నందమూరి నటసింహం బాలకృష్ణ 98వ చిత్రంగా రూపొందుతోన్న 'లయన్' మే 1న గానీ, లేదా మే 7న గానీ ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమా తర్వాత బాలయ్య 99వ చిత్రం శ్రీవాస్ దర్శకత్వంలో రూపొందనుంది. 'లయన్' విడుదలైన వెంటనే 99వ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది. కాబట్టి 100వ చిత్రం గురించి బాలయ్య ఆలోచించడం మొదలుపెట్టేసారట. బోయపాటి శ్రీను ఇప్పటికే 100వ చిత్రానికి సంబంధించి స్ర్కిఫ్ట్ వర్కవుట్ చేసే పనిలో ఉన్నారని సమాచారమ్.
ఇదిలా ఉంటే నందమూరి కళ్యాణ్ రామ్ తన బాబాయ్ బాలకృష్ణ 100వ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడట. తన ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో బాబాయ్ 100వ చిత్రం నిర్మించాలనే పట్టుదలతో కళ్యాణ్ రామ్ ఉన్నాడట. ఇందుకోసం బాలయ్యను పదే పదే కళ్యాణ్ రామ్ కలుస్తున్నాడనే టాక్ కూడా ఉంది. కాగా తాజా వార్తల ప్రకారం అబ్బాయ్ కళ్యాణ్ రామ్ కి బాలయ్య పచ్చ జెండా ఊపేసారని తెలుస్తోంది. 100వ సినిమా తన కుటుంబ సభ్యులకు నిర్మించే అవకాశం ఇవ్వడమే కరెక్ట్ అని భావిస్తున్నారట బాలయ్య. అది కూడా తన తండ్రి ఎన్టీఆర్ పేరు మీదున్న బ్యానర్ కాబట్టి తన 100వ సినిమా ఈ బ్యానర్ లో తెరకెక్కితే ఇటు కుటుంబానికి, అటు అభిమానులకు కూడా బాగుంటుందని బాలయ్య ఆలోచిస్తున్నారట. అందుకే కళ్యాణ్ రామ్ కి పచ్చజెండా ఊపేసారని సమాచారమ్. 'చరిత్రకొక్కడే' టైటిల్ ని బాలయ్య 100వ సినిమా కోసం అనుకుంటున్నారు. ఈ టైటిల్, అబ్బాయ్ నిర్మాత, బాబాయ్ హీరో, ఎన్టీఆర్ బ్యానర్... వెరసి బాలయ్య 100వ సినిమా భారీగా, నందమూరి కుటుంబానికి అత్యంత ప్రతిష్టాత్మకంగా ఉండబోతోందని ఊహించవచ్చు.