ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్స్ జాబితాలో కొరటాల శివ పేరున్న సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కొరటాల దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందిన 'జనతాగ్యారేజ్' చిత్రం సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకురానుంది. దీని తర్వాత మహేష్ బాబుతో సినిమా చేయబోతున్నాడు కొరటాల. నిజం చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రాంచరణ్ తో కొరటాల సినిమా చేయాల్సి ఉంది. కారణం తెలియడంలేదుగానీ, ఈ సినిమా వర్కవుట్ అవ్వలేదని సమాచారమ్. దాంతో కొరటాల శివకు మెగా కాంపౌండ్ కీ కుదరడంలేదని చెప్పుకుంటున్నారు. అయితే తాజా వార్తల ప్రకారం మెగా కాంపౌండ్ నుంచి కొరటాల శివకు బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి దృష్టి కొరటాల శివపై ఉందట. తన 151వ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం కొరటాల శివకు ఇవ్వాలనుకుంటున్నారట చిరంజీవి. ఈ విషయం కొరటాల వరకూ వెళ్లిందని, మంచి కథ చిరు కోసం తయారు చేయడానికి కొరటాల సిద్ధమవుతున్నాడని సమాచారమ్. అన్నీ కుదిరితే చిరు 151వ చిత్రానికి కొరటాల దర్శకత్వం వహించే అవకాశముందని ఫిల్మ్ నగర్ టాక్. ఇదిలా ఉంటే...
'జనతాగ్యారేజ్' థియేట్రికల్ ట్రైలర్ ని చూసారట చిరంజీవి. ఆ ట్రైలర్ చాలా బాగుందని ప్రశంసలు కురిపించారట చిరు. అంతే కాదు.. సినిమా పెద్ద విజయం సాధించాలని కొరటాలకు, ఎన్టీఆర్ కు అభినందనలు చెప్పారని సమాచారమ్.