నందమూరి నటసింహం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' భారీ ఎత్తున రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో కీలక పాత్ర చేసే అవకాశం జగపతిబాబును వరించిందని తెలుస్తోంది. బాలయ్య 'లెజెండ్' చిత్రంలో విలన్ గా నటించారు జగపతిబాబు. ఆ సినిమా జగపతిబాబు కెరియర్ కి కీలక మలుపు అయ్యింది. ఇప్పుడు మళ్లీ బాలయ్య ప్రతిష్టాత్మక చిత్రం 'గౌతమిపుత్ర శాతకర్ణి' లో కీలక పాత్ర చేసే అవకాశం రావడం పట్ల జగపతిబాబు ఫుల్ హ్యాపీ అట. ఈ విషయం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉంటే...
చిరు 150వ చిత్రంలో విలన్ గా నటించే అవకాశం జగపతిబాబును వరించిందని తెలుస్తోంది. ఈ సినిమాలోని విలన్ పాత్రకు జగపతిబాబు అయితే పూర్తి న్యాయం చేయగలుగుతాడని భావించిన వినాయక్, ఇదే విషయాన్ని చిరుకి చెప్పారట. మరో మాట మాట్లాడకుండా చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. జగపతిబాబు సైతం ఈ చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్.
టాలీవుడ్ లో రూపొందుతోన్న రెండు అత్యంత ప్రతిష్టాత్మక చిత్రాల్లో నటించే అవకాశం జగపతిబాబును వరించడం విశేషం. ఈ రెండు సినిమాల్లోనూ జగపతిబాబు చేయబోతున్న పాత్రలకు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందని తెలుస్తోంది.