ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'రెడ్'. సంక్రాంతి కానుకగా ఈ నెల 14న థియేటర్స్ కి వస్తోంది. ఈ సందర్భంగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేదా పేతురాజ్ తో జరిపిన ఇంటర్య్వూ మీ కోసం...
హాయ్ నివేతా... చెప్పండి ఈ సినిమా అవకాశం ఎలా వచ్చింది?
కిశోర్ తిరుమల గారితో నేను వర్క్ చేసాను. 'తడం' తమిళ్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నానని ఎప్పుడో చెప్పారు. ఈ సినిమా గురించి నాకు తెలుసు. తమిళంలో ఈ సినిమా మంచి విజయం సాధించింది. దాంతో ఈ సినిమాలో నటించే అవకాశాన్ని అసలు వదులుకోలేదు. ఆఫర్ రాగానే యస్ చెప్పేసాను. ఇందులో నేను టఫ్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేసాను.
ఆ రోల్ గురించి చెప్పండి?
టఫ్ పోలీసాఫీర్ గా గంభీరంగా బయటికి కనిపించినప్పటికీ, లోపల చాలా ఇన్నోసెంట్ గర్ల్ పాత్ర నాది. సీరియస్ గా ఫేస్ పెట్టుకుని నటించాలంటే చాలా భయపడ్డాను. కానీ కిశోర్ తిరుమలగారి క్రియేటివిటీ మీద నమ్మకంతో, ఆయన సపోర్ట్ తో ఈజీగా ఈ పాత్ర చేయగలిగాను.
రామ్ తో స్ర్కీన్ షేర్ చేసుకోవడం గురించి చెప్పండి?
రామ్ టాప్ క్లాస్ కో-స్టార్. నాతో తమిళంలో మాట్లాడటం వల్ల సెట్స్ లో ఎలాంటి టెన్షన్ లేకుండా కూల్ గా వర్క్ చేయగలిగాను. రామ్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేసారు. అద్భుతమైన నటనతో అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకుంటారు.
కిశోర్ తిరుమలగారితో వర్క్ ఎక్స్ పీరియన్స్ ఎలా అనిపించింది?
యునిక్ టచ్ తో నా పాత్ర క్రియేట్ చేసారు డైరెక్టర్ కిశోర్ గారు. నా బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, ఆ పాత్రలో నేను ఎలా కనిపించాలి... ఇలా ప్రతి విషయంలోనూ కేర్ తీసుకున్నారు. చాలా ఫ్యాషనేట్ డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో నటించడం చాలా హ్యాపీగా ఉంది.
ఎక్కువగా సెకండ్ లీడ్ చేస్తున్నారు... కారణం?
మంచి పాత్ర దొరికినప్పుడు సెకండ్ హీరోయిన్ గా నటించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. 'అలా వైకుంఠపురంలో' నా పాత్ర చాలా చిన్నది. కానీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. అందుకే మంచి ఆఫర్స్ వస్తున్నాయి.
గ్లామర్ పాత్రలు పట్ల మీ అభిప్రాయం?
గ్లామర్ రోల్స్ చేయడానికి నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఆ పాత్రకు ఎంత ఇంపార్టెన్స్ ఉంది... కథకు ఆ పాత్ర ఎంత అవసరం అనేది ముఖ్యం. తమిళంలో నేను చేసిన కొన్ని పాత్రలు నా కెరీర్ పైన ప్రభావం చూపించాయి. అందుకే ప్రస్తుతం చాలా కేర్ ఫుల్ గా సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నాను.
మీరు అంగీకరించిన సినిమాల గురించి చెప్పండి?
తమిళంలో ఓ సినిమా సైన్ చేసాను. వెబ్ బేస్డ్ ఫిల్మ్ ఒకటి డైరెక్టర్ చందు మొండేటితో కలిసి చేస్తున్నాను. విరాటపర్వం సినిమాలో స్పెషల్ అపియరెన్స్ ఇస్తున్నాను. విశ్వక్ సేన్ 'పాగల్' చిత్రంలో మాస్ రోల్ చేస్తున్నాను.
ఫైనల్ గా చెప్పాలంటే... విజయ్ సేతుపతిలా డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ చేయాలనే ఆశ ఉంది. మంచి అవకాశాలు వస్తే... నా కోరిక నెరవేరుతుంది. మంచి పాత్రలు చేసి ఆడియన్స్ ని అలరించడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను అంటూ ఇంటర్య్వూ ముగించారు నివేదా.