స్టార్ హీరో, లోకనాయకుడు తనయ శృతిహాసన్ ప్రస్తుతం తెలుగు సినిమాలు చేయడంలేదు. 'కాటమరాయుడు' సినిమా తర్వాత శృతిహాసన్ తెలుగు సినిమా చేయలేదు. అయితే తాజా వార్తల ప్రకారం మాస్ మహారాజా సినిమా కోసం శృతిహాసన్ ని కథానాయికగా తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ వివరాల్లోకి వెళితే...
రవితేజ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో 'నేల టిక్కెట్' చిత్రం చేస్తున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో 'అమర్ అక్బర్ ఆంటోని' చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కాకుండా 'కందిరీగ' ఫేం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న సినిమాకి కూడా సైన్ చేసాడు రవితేజ. ఈ సినిమా కోసం శృతిహాసన్ ని హీరోయిన్ గా తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట. శృతిహాసన్ తో చర్చలుకూడా జరుపుతున్నారట. ఇంకా ఈ సినిమాకి సైన్ చేయలేదుగానీ, ఈ సినిమా చేయడానికి శృతి ఆసక్తిగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా కనుక శృతి అంగీకరిస్తే.. రవితేజతో రెండోసారి జత కట్టబోతోంది. ఆల్ రెడీ 'బలుపు' సినిమా కోసం రవితేజ, శృతిహాసన్ జత కట్టారు. మరి రవితేజతో శృతిహాసన్ రెండోసారి జత కట్టడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా వేచి చూద్దాం.