మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి' చిత్రం నిన్న (2.10.2019) ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా విడుదలయ్యింది. తెలుగు రాష్ట్రాల్లో యునానిమస్ హిట్ టాక్ తో మంచి వసూళ్లు కురిపిస్తూ ముందుకు దూసుకెళుతోంది. భారీ వసూళ్లు కురిపించి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందనే నమ్మకాన్ని ట్రేడ్ వర్గాలు వ్యక్తపరుస్తున్నాయి. అయితే బాలీవుడ్ లో మాత్రం 'సైరా' కి దెబ్బపడింది. బాలీవుడ్ క్రిటిక్స్ 'సైరా' కి మంచి రేటింగ్స్ ఇచ్చాయి. సినిమాని, చిత్రం యూనిట్ ని అభినందించాయి. కానీ వసూళ్ల పరంగా మాత్రం ఈ సినిమా బాలీవుడ్ లో సత్తా చాటలేకపోతోంది. దీనికి కారణం ఏంటీ అనే విశ్లేషణలోకి వెళితే...
హృతిక్ రోషన్ హీరోగా నటించిన 'వార్' సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. బాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిలిమ్స్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించింది. స్ట్రయిట్ హిందీ సినిమా కావడంతో 'వార్' కి కేటాయించినన్ని థియేటర్స్ నార్త్ లో 'సైరా' కి కేటాయించలేదు. 'సైరా' హిందీ వెర్షన్ కోసం భారీ ప్రమోషన్ జరిగింది. పైగా ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా నటించారు. దాంతో ఖచ్చితంగా 'సైరా' భారీ వసూళ్లను కురిపిస్తుందనే నమ్మకం అందరిలోనూ నెలకొంది. అయినా సరే అందుకు భిన్నంగా కేవలం 2 కోట్ల గ్రాస్ మాత్రమే ఈ సినిమా వసూళ్లు నమోదవ్వడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. వార్ సినిమా దాదాపు 50 కోట్ల పై చిలుకు గ్రాస్ సాధించి తస సత్తా చాటుకుంది. విశేషమేంటంటే హాలీవుడ్ మూవీ 'జోకర్' సైతం 6కోట్లు గ్రాస్ సాధించి 'సైరా' ని మించిపోయింది. భారీ ప్రమోషన్, అమితాబ్ బచ్చన్ వంటి అంశాలు 'సైరా' కి కలిసొస్తాయని, నార్త్ లో ఈ సినిమా భారీ వసూళ్లు కురిపించడం ఖాయమనే అంచనాలు తలక్రిందులవ్వడం షాక్ కి గురి చేస్తోంది. మరి ఈ వీకెండ్ పూర్తయ్యేలోపు నార్త్ లో 'సైరా' పరిస్థితి ఎలా ఉండబోతుందో వేచిచూద్దాం.