మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన 'క్రాక్' సినిమా ఈ రోజు (9.1.2021) విడుదలవుతున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా థియేటర్స్ బంద్ అవ్వడంతో సినిమాల విడుదల ఆగిపోయాయి. 50 శాతం ఆకుపెన్సీతో థియేటర్స్ తెరుచుకోవడంతో ఇప్పుడిప్పుడే సినిమాలు వరుసగా విడుదలవుతున్నాయి. సంక్రాంతి కానుకగా మూడు సినిమాలు 'క్రాక్', 'రెడ్', అల్లుడు అదుర్స్' థియేటర్స్ కి వస్తున్నాయి. ఇందులో భాగంగా ముందుగా ఈ రోజు 'క్రాక్' సినిమా రిలీజ్ అవుతోంది. దాదాపు 10 నెలల తర్వాత ఓ పెద్ద సినిమా, అది కూడా మాస్ మహారాజా సినిమా థియేటర్స్ కి వస్తోందంటే అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు సినీ ప్రియుల్లోనూ హుషారు వచ్చింది. అయితే ఈ హుషారు కాస్త ఈ సినిమా ఫస్ట్ షోలు క్యాన్సిల్ అవ్వడంతో నీరుకారిపోయింది. అసలు ఈ సినిమా ఫస్ట్ షోలు క్యాన్సిల్ అవ్వడానికి కారణం ఏంటా అని ఆరా తీస్తే...
'క్రాక్' సినిమా నిర్మాతకు ఫైనాన్షియల్ ఇష్యూ ఉండటం వల్లే ఈ సినిమా ఫస్ట్ షోలు పడలేదని తెలుస్తోంది. ఈ నిర్మాత గత సినిమాని డిస్ట్రిబ్యూట్ చేసిన ఓ డిస్ట్రిబ్యూటర్ తో నెలకొన్న ఫైనాన్షియల్ ఇష్యూ వల్లే ఫస్ట్ షోలు పడలేదు. ఉదయం 8.45, 9గంటలు షోలు స్రీనింగ్ కాకపోడంతో ఆడియన్స్ నిరాశపడుతున్నారు. ప్రస్తుతం నిర్మాత ఠాగూర్ మధు ఈ ఫైనాన్షియల్ ఇష్యూని క్లియర్ చేసుకునే పనిలో ఉన్నారు. ఆ ఇష్యూ క్లియర్ అయితే కానీ... 'క్రాక్' బొమ్మ థియేటర్స్ లో పడదు. త్వరగా ప్రాబ్లమ్ క్లియర్ అయిపోయి మధ్యాహ్నం షోలు అయినా థియేటర్స్ లో పడాలని అందరూ ఎదురుచూస్తున్నారు.
మరి... కరోనా, ఫైనాన్షియల్ ఇష్యూస్ లాంటివి దాటుకుని బయటికి వస్తున్న 'క్రాక్' సినిమా బాక్సాఫీస్ కి పూర్వ వైభవం తెచ్చిపెడుతుందేమో వేచిచూద్దాం.