బ్యాంక్ కుంభకోణంలో తమిళ హీరో ఏంటీ... దాంతో మహేష్ బాబుకి లింకేంటీ అని ఆలోచిస్తున్నారా... ఏంలేదండి...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'సర్కారు వారి పాట' కు విలన్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. కోలీవుడ్ సీనియర్ హీరో అరవింద్ స్వామితో సంప్రదింపులు జరుపుతున్నారని సమాచారమ్. 'ధృవ' చిత్రంలో స్టైలిష్ విలన్ గా అరవింద్ స్వామి కనబర్చిన నటనకు తెలుగు ఆడియన్స్ జేజేలు కొట్టారు. 'సర్కారు వారి పాట' సినిమాలో విలన్ రోల్ కూడా చాలా స్టైలిష్ గా, పవర్ ఫుల్ గా ఉంటుందట. అందుకే అరవింద్ స్వామిని ఈ సినిమాలో నటింపజేయాలని, ఆయన అయితే ఈ క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేయగలరని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారట. ఆల్ రెడీ అరవింద్ స్వామిని సంప్రదించారని, ఆయన ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారమ్.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న కుంభకోణాల నేపధ్యంతో ఈ సినిమా ఉంటుంది. మహేష్ బాబు తండ్రి బ్యాంక్ మేనేజర్ కాగా, వేలాది కోట్లు ఎగవేసిన ఓ బిజినెస్ మ్యాన్ వల్ల తండ్రి మీద పడ్డ అపవాదను తొలిగించడానికి మహేష్ బాబు చేసిన ప్రయత్నం ఈ సినిమా మెయిన్ స్టోరీ లైన్ అని తెలుస్తోంది. వేలాది కోట్లు ఎగవేసిన బిజినెస్ మ్యాన్ గా అరవిందస్వామి నటించనున్నాడని సమాచారమ్.