శుక్రవారం వచ్చిందంటే చాలు కొత్త సినిమాల సందడి. విడుదలవుతున్న సినిమాల్లో ఏ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటుందనే ఆసక్తి. ఆ రోజంతా విడుదలైన సినిమాల గురించిన ముచ్చట్లు మాట్లాడుకుంటూ సరదాగా గడిపేస్తారు ప్లబిక్ ఆడియన్స్. చిత్ర పరిశ్రమకు చెందిన వారైతే, ఏ సినిమా ఎలా ఉంది... బాక్సాపీస్ వద్ద వసూళ్లు కురిపించే సినిమా ఏదీ... నెటిజన్ల మనసులను గెల్చుకున్న సినిమా ఏదీ... ఏ సినిమాకి ఎంత రేటింగ్ అనే కబుర్లుతో గడిపేస్తారు. స్టార్ హీరో సినిమా అయితే ముందు రోజు జరిగే ప్రీమియర్స్ టాక్ తోనే సందడి ఆరంభమవుతుంది. అదే చిన్న సినిమాలు అయితే ఫస్ట్ షో అయిపోయిన తర్వాత వచ్చే టాక్ ని బట్టి ఆ సినిమాల రన్ ఎలా ఉంటుందో అంచనాలు ఆరంభమవుతాయి. ఇక ఈ రోజు (7.12.2018) 'కవచం', 'నెక్ట్స్ ఏంటీ', 'సుబ్రహ్మణ్యపురం', 'శుభలేఖ+లు' సినిమాలు థియేటర్స్ కి వస్తున్నాయి.
బెల్లంకొండ సురేష్ తనయుడు బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన 'కవచం' చిత్రం భారీ ఎత్తున విడుదలవుతోంది. ఎక్కువ థియేటర్స్ లో విడుదలవుతున్న ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన కాజల్ అగర్వాల్, మోహ్రీన్ కథానాయికలుగా నటించారు. ఫస్ట్ టైమ్ పోలీసాఫీసర్ గా నటించాడు శ్రీనివాస్. బడ్జెట్ ని నియంత్రణలో ఉంచుకుని ఈ సినిమాని పూర్తి చేసారు. వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ సొంటినేని (నాని) నిర్మించిన ఈ చిత్రం ద్వారా శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్స్, టీజర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
తమన్నా, సందీప్ కిషన్ జంటగా నటించిన చిత్రం 'నెక్ట్స్ ఏంటి'. బాలీవుడ్ డైరెక్టర్ కునాల్ కోహ్లీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. నవదీప్, పూనమ్ కౌర్ కీలక పాత్రల్లో నటించారు. ప్రొమోస్ తో ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది.
సుమంత్ హీరోగా నటించిన చిత్రం 'సుబ్రహ్మణ్యపురం'. మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి నెలకొంది. ట్రైలర్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచాయి. ఈషా రెబ్బ కథానాయికగా నటించింది.
సాయి శ్రీనివాస్, దీక్షా శర్మ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం 'శుభలేఖ+లు'. శరత్ నర్వాడే దర్శకత్వంలతో తెరకెక్కిన ఈ సినిమాని చూసి నచ్చడంతో పుష్యమి ఫిల్మ్ మేకర్స్ అధినేత బెల్లం రామకృష్ణారెడ్డి వరల్డ్ వైడ్ రైట్స్ ని దక్కించుకుని విడుదల చేస్తున్నారు.
విశేషమేంటంటే... ఈ రోజు తెలంగాణాలో పోలింగ్ డే. ఓటు వేయడం కోసం జనాలు పోలింగ్ బూత్ బాట పడతారు. మరి ఈ పోలింగ్ సందడిలో థియేటర్స్ కి వెళ్లే వారి సంఖ్య కొంచెం తగ్గొచ్చు. ఆ ఎఫెక్ట్ సినిమాలపై పడుతుంది. సో.... ఈ వారం విడుదలవుతున్న ఈ నాలుగు సినిమాల్లో బాక్సాఫీస్ విన్నర్ గా నిలిచే సినిమా ఏదీ... కాసుల వర్షం కురిపించే సినిమా ఏదో వేచిచూద్దాం.