కరోనా నిర్ధారణ అవ్వడంతో ఈ నెల 5న గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం చెన్నయ్ లోని ఎం.జి.యం హాస్పటల్లో ఆడ్మిట్ అయ్యారు. ఆ తర్వాత ఓ వీడియోను పోస్ట్ చేసారు. తను రెస్ట్ తీసుకుంటున్నానని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని, అభిమానులు కంగారు పడాల్సిన పనిలేదని ఆ వీడియో ద్వారా తెలియజేసారు.
అయితే ఈ రోజు (14.8.2020) ఆయన హెల్త్ కండీషన్ గురించి వస్తున్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. నిన్న రాత్రి (13.8.2020) యస్.పి.బి ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూ కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని, వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నామని హాస్పటల్ వర్గాలు హెల్త్ బులిటెన్ ని విడుదల చేసారు.
ఈ విషయం తెలిసిన దగ్గర్నుంచి గానగంధర్వుడు కోలుకోవాలని ఆయన అభిమానులతో పాటు ప్రముఖులు కోరుకుంటూ ట్వీట్స్ చేస్తున్నారు. కొన్ని వేల పాటలు పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న యస్.పి.బి ఈ గండం నుంచి బయటపడాలని కోరుకుందాం.