పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 'వకీల్ సాబ్' సినిమాతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూనే, సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. కరోనా మహమ్మారి విజృంభణతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ ల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్.
''కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే... అన్న టెన్షన్ అందరిలో ఉంది. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ గారికి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా... ఎవరికి వచ్చినా... ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చేంతవరకూ నిస్సహాయతతో వెయిట్ చేస్తూ ఉండాల్సిందే'' అని చెప్పారు పవన్ కళ్యాణ్.