చిత్రం - చిన్నదాన నీ కోసం
బ్యానర్ - శ్రేష్ట్ మూవీస్
నటీనటులు - నితిన్, మిస్తీ చక్రబర్తి, నాజర్, ధన్య, నరేష్, సితార, రోహిణి, అలీ, తాగుబోతు రమేష్ తదితరులు
డైలాగ్స్ - హర్షవర్ధన్
సినిమాటోగ్రఫీ - ఐ.ఆండ్రూ
మ్యూజిక్ - అనూప్ రూబెన్స్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
సమర్పణ - విక్రమ్ గౌడ్
నిర్మాతలు - ఎన్.సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - ఎ.కరుణాకరన్
అదృష్టం చల్లని చూపు చూస్తే జీవితం చాలా బాగుంటుంది. సినిమా పరిశ్రమపరంగా అందుకు చాలా ఉదాహరణలున్నాయి. తాజా ఉదాహరణ నితిన్.అంతకుముందు దాదాపు తొమ్మిది పరాజయాలు చవి చూశాడు నితిన్. ఆ తర్వాత లక్ ఫేవర్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఇష్క్, గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ ఎటాక్... ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహమో ఏమో మంచి కథలు ఎన్నుకోవడంతో పాటు నటుడిగా కూడా డెవలప్ అవుతున్నాడు నితిన్. ఇప్పుడు 'చిన్నదాన నీ కోసం' చిత్రం చేశాడు. అది కూడా ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ ని అద్భుతంగా తెరకెక్కించే కరుణాకరన్ దర్శకత్వంలో ఈ చిత్రం చేశాడు. మరి... చిన్నదాని కోసం నితిన్ ఏం చేశాడు? ఈ చిత్రం అతని సక్సెస్ ట్రాక్ రికార్డుని కంటిన్యూ చేస్తుందా?... చూద్దాం.
కథ
నితిన్ (నితిన్) మంచి జోష్ ఉన్న కుర్రాడు. ఇంట్రడక్షన్ సీన్ లోనే మనకు ఆపద వచ్చినప్పుడు మాత్రమే ఎదురుతిరగకుండా, ఎవరికి ఆపద వచ్చినా ఎదురుతిరగాలని ట్రైన్ లో పబ్లిక్ కి తెలియజేసి పెద్దాయన రెడ్డి గారి (నాజర్) మనసును గెలుచుకుంటాడు నితిన్. అమ్మ, నాన్న, చెల్లితో ఎలాంటి చీకూ చింతా లేకుండా హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేస్తుంటాడు. నితిన్ అమ్మ, నాన్నది లవ్ మ్యారేజ్. తమలానే ఓ మంచి అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోమని నితిన్ ని ప్రోత్సహిస్తారు. తన మనసుకు నచ్చిన అమ్మాయి దొరికితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెబుతాడు నితిన్. అలాంటి సమయంలోనే నందిని (మిస్తీ చక్రబర్తి) కనబడుతుంది. తొలి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోతాడు నితిన్. ఎలాగైనా ఆమెను ఇంప్రెస్ చేసి, తన ప్రేమలో పడేలా చేయడానికి ప్రయత్నాలు మొదలుపెడతాడు.
తనకు రెడ్డిగారి ఇంటి పైన పెంట్ హౌస్ లో ఉండే ఏర్పాటు చేసి ఇస్తే ఇంటికి వస్తానని నితిన్ కి మాట ఇస్తుంది నందిని. రెడ్డిగారిని కన్విన్స్ చేసి నందిని పెంట్ హౌస్ లో ఉండే ఏర్పాటు చేస్తాడు నితిన్. దాంతో నితిన్ ఇంటికి వెళుతుంది నందిని. తమకు ఎలాంటి కోడలు కావాలో కరెక్ట గా ఆ క్వాలిటీస్ నందినిలో ఉన్నాయని తెగ ఆనందపడిపోతారు నితిన్ తల్లిదండ్రులు. నందిని కూడా నితిన్ కుటుంబ సభ్యులతో బాగా కలిసిపోతుంది. సరిగ్గా ఆ సమయంలో నితిన్ కి చెప్పకుండా రెడ్డిగారిని తీసుకుని లాస్ ఏంజిల్స్ కి వెళ్లిపోతుంది నందిని. ఈ హఠాత్తు పరిణామానికి షాక్ అవుతాడు నితిన్. ఇది ఇంటర్వెల్ ట్విస్ట్.
తన మనసుతో ఆడుకోవడమే కాకుండా, తన తల్లిదండ్రులతో కలిసిపోయి వారిని కూడా మోసం చేసి వెళ్లిపోయిన నందినికి గుణం పాఠం చెప్పాలనుకుంటాడు నితిన్. నందిని పెన్ డ్రైవ్ ద్వారా రెడ్డిగారు నందినికి తాత అవుతారని, ఆయనను తీసుకెళ్లడానికే ఇండియా వచ్చిందని తెలుసుకుంటాడు. దాంతో లాస్ ఏంజిల్స్ వెళతాడు నితిన్. అక్కడికి వెళ్లిన నితిన్ మరో వారంలో పెళ్లి చేసుకోబోతున్న నందినీకి ఎలా గుణపాఠం చెప్పాడు? ఆ పాఠం ద్వారా నందిని అతనికి దగ్గరవుతుందా? తను అనుకున్నట్లుగానే తల్లిదండ్రులను, తాతను కలపగలుగుతుందా? అసలు వాళ్లెందుకు విడిపోయారు? అనేదే ఈ సినిమా సెకండాఫ్ స్టోరి.
నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ చిత్రంలో నితిన్ అసలు పేరునే అతని కారెక్టర్ కి పెట్టారు. కామెడీ, లవ్, సెంటింమెంట్, యాక్షన్.. ఇలా అన్నిరసాలూ ఉన్న పాత్ర నితిన్ ది. వీటన్నిటినీ నితిన్ బాగా ఆవిష్కరించాడు. నటనలో పరిణతి కనిపించింది. డాన్సులు బాగా చేశాడు. డైలాగులు పలికే తీరులో గత చిత్రాల్లోకన్నా స్పష్టత ఉంది. ఓవరాల్ గా నటుడిగా నితిన్ భేష్ అనిపించుకున్నాడు. ఇక, కథానాయిక మిస్తీ చక్రవర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. సుభాష్ ఘై దర్శకత్వం వహించిన హిందీ చిత్రం 'కాంచీ' ద్వారా బాలీవుడ్ కి పరిచయమైంది మిస్తీ. బెంగాలీలో 'పొరిచోయ్' అనే చిత్రం చేసింది. ఆ తర్వాత చేసిన చిత్రం ఇది. ఈ చిత్రంలోని నందిని పాత్రను బాగా చేసింది. పాటలకు మాత్రమే కాకుండా.. నటనకు కూడా అవకాశం ఉన్న పాత్ర మిస్తీది. ఎమోషనల్ సీన్స్ ని బాగా చేసింది. మూడో చిత్రానికే మంచి నటన కనబర్చగలిగిందంటే.. బలమైన పాత్రలొస్తే.. ఖచ్చితంగా నిరూపించుకుంటుందని చెప్పొచ్చు. అయితే నేటి తరం నాయికల్లా మెరుపు తీగలా లేదు. అందచందాలు ఓకే. ఇక.. మిగతా పాత్రల్లో నాజర్, నరేశ్, సితార, రోహణి మెరిశారు. అలీ పాత్ర బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
సాంకేతిక వర్గం
ప్రేమకథా చిత్రాలను చక్కగా డీల్ చేసే నేర్పున్న దర్శకుడు కరుణాకరన్. అలాంటి స్టోరీ లైన్ నే ఎంపిక చేసుకుని ఈ చిత్రాన్ని కూడా బాగానే తీశాడు. సెకండాఫ్ లో కొంచెం ట్రాక్ తప్పింది. ఫస్టాఫ్ బాగుంది. చెప్పాలనుకున్న కథను స్పష్టంగా చూపించాడు. ఏ దర్శకుడికైనా కావాల్సింది అదే. అనూప్ పాటలు బాగున్నాయి. 'చిన్నదాన నీ కోసం...' పాట బాగుంది. ఆండ్రూ కెమెరా పనితనాన్ని మెచ్చుకోవాల్సిందే. సినిమా కలర్ ఫుల్ గా ఉంది. 'మనం' చిత్రం ద్వారా మాటల రచయితగా పరిచయమైన హర్షవర్ధన్ ఈ చిత్రానికి మంచి సంభాషణలు అందించాడు. కథకు సంబంధం లేని మాటలు ఒకట్రెండు ఉంటాయేమో తప్ప మిగతావన్నీ కూడా బాగున్నాయి. ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ బిగినింగ్ లో సినిమా ల్యాగ్ అనిపించినప్పటికీ, అది ఎడిటింగ్ వైఫల్యం కాదు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ చిత్రం ప్రథమార్ధం బోర్ కొట్టకుండా సాగింది. అన్ని సన్నివేశాలున్నాయి బాగున్నాయి. ఇంట్రవెల్ ట్విస్ట్ ఎవరూ ఊహించని విధంగా ఆసక్తికరంగా ఉంది. ఆ ఆసక్తితో సెకండాఫ్ పై అంచనాలు పెంచుకుంటారు ప్రేక్షకులు. అయితే, ఫస్టాఫ్ ఉన్నంత ఆసక్తిగా సెకండాఫ్ లేదు. అసలు హీరోయిన్ ఆరాటం అంతా విడిపోయిన తన తల్లి, తాతను కలపాలన్నదే సినిమా కీలకాంశం అని సెకండాఫ్ లో తెలిసిన తర్వాత 'తాతగారింటికి దారేది' అంటూ పవన్ కల్యాణ్ 'అత్తారింటికి దారేది' టైటిల్ ని గుర్తు చేసుకుంటారు. అలా.. పవన్ కల్యాణ్ నటించిన 'తొలి ప్రేమ' సీన్ ని పోలిన సీన్లూ ఉన్నాయి. ఇక.. 'బ్రది'లో 'ఏ చికితా...' పాటలా ఇందులో 'అల్ బేలా..' పాట ఉంటుంది. ఈ పాట మొదలయ్యే ముందు 'ఏ చికితా..' పాట స్టార్టింగ్ ని చూపించడం పవన్ కల్యాణ్ అభిమానులకు పండగలాంటిది. ఒక సీన్లో పవన్ అభిమానిని అంటూ.. అతని బొమ్మను గీస్తాడు నితిన్. మొత్తానికి పవన్ ని బాగానే వాడుకున్నారు. కానీ, పవన్ సినిమాల్లోని కొన్ని సన్నివేశాలు పోలినవి సన్నివేశాలు ఉండటంతో ఇలాంటివి చూసినవేగా అనిపించక మానదు. ఫైగా, సెకండాఫ్ లో వచ్చే 'అల్ బేలా...' పాట అనవసరమేమో అనిపించకమానదు. కానీ, నితిన్ ఎంత జోష్ గా డాన్స్ చేయగలడో ఈ పాట చూపించింది. అలాగే, ఈ పాటలో, పవన్ కల్యాణ్ పాట కొంత కనిపించడంతో.. పవన్ కల్యాణ్ అభిమానులు దీనికోసం వచ్చే అవకాశం ఉంటుందేమో. బహుశా దర్శక, నిర్మాతల ఆలోచన ఇదే అయ్యుండొచ్చేమో.
ఏదేమైనా.. తాతను వెతుక్కంటూ మనవడు, అత్తను వెతుక్కుంటూ మేనల్లుడు విదేశాల నుంచి ఇండియా వచ్చిన కథలను మనం చూశాం. ఇప్పడో తాత కోసం మనవరాలు ఇండియా వచ్చి, ప్లాన్ చేసి, విదేశాలు తీసుకెళుతుంది. దానికోసం అల్లిన సన్నివేశాలతో సగ భాగం... ఆ తర్వాత తాతను తన తల్లిదండ్రులతో కలపడానికి ఆ మనవరాలు చేసే ప్రయత్నం కోసం అల్లిన సన్నివేశాలతో మిగతా సగ భాగం సాగుతాయి. చాలా సన్నివేశాలు గత చిత్రాల్లో చూసినట్టు ఉంటాయి. అది లేకుండా చేసి ఉంటే ఈ సినిమా చాలా బాగుండేది. ఫ్రెష్ ఫీల్ ని కలుగజేసేది.
ఫైనల్ గా చెప్పాలంటే... పోస్టర్ చూసి కూడా టికెట్ కొన్నావా? అని ఈ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. కానీ, పోస్టర్ తో సినిమాని అంచనా వేయలేం. అలా చూస్తే.. ఈ చిత్రం పోస్టర్స్ బ్రహ్మాండంగానే ఉన్నాయి. సినిమా అంత బ్రహ్మాండం కాదు.. ఓకే అనేలా ఉంది. అలాగే.. నేను గుద్దితే ఐదు స్టార్లు పడాల్సిందే అని ఒక సీన్ లో నితిన్ అంటాడు... కానీ, ఈ చిన్నదానికి, తన చుట్టూ తిరిగే చిన్నోడికి ఐదు స్టార్లు కష్టం. అందుకే...! అందులో సగం.