చిత్రం - వైల్డ్ డాగ్
నటీనటులు - అక్కినేని నాగార్జున, సయామీ ఖేర్, దియా మీర్జా, అలీ రెజా, అతుల్ కులకర్ణి, అన్జిత్ తదితరులు
సంగీతం - తమన్
సినిమాటోగ్రఫీ - షనీల్ డియో
డైలాగ్స్ - కిరణ్ కుమార్
నిర్మాతలు - నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సాల్మన్ అహిషోర్
అక్కినేని నాగార్జున, దియామీర్జా, సయామీ ఖేర్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా 'వైల్డ్ డాగ్'. ఎన్ఐఏ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) లో నిజాయితీగా పనిచేసే ఏసీపీ విజయ్ వర్మగా నటించారు నాగార్జున. ఈ సినిమా టీజర్స్, ట్రైలర్స్ ఆసక్తికరంగా ఉండటంతో ఆడియన్స్ లో సినిమాపై అంచనాలు పెరిగాయి. నాగార్జున కూడా ఈ సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో జోరుగా పాల్గొన్నారు. సినిమా విజయంపై చిత్రం యూనిట్ మొత్తం నమ్మకంగా ఉంది. మరి అందరి అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా రివ్య్వూ ద్వారా తెలుసుకుందాం.
కథ
జాతీయ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) లో ఏసీపీ విజయ్ వర్మ (నాగార్జున) ఎన్నో ముఖ్యమైన ఆపరేషన్స్ ని తన టీమ్ తో కలిసి విజయవంతంగా పూర్తి చేసి, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకున్న ఆఫీసర్. అలాంటి ఆఫీసర్ గోకుల్ చాట్ లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ లో తన కూతురిని పోగొట్టుకుంటాడు. ఈ సంఘటన తర్వాత కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన విజయ్ వర్మను డెస్క్ జాబ్ కి పంపించేస్తారు. అయితే పూణేలో జరిగిన టెర్రరిస్ట్ దాడి కేసును డీల్ చేయాల్సిన పరిస్థితి విజయ్ వర్మకు వస్తుంది. పుణే పేలుళ్ల సూత్రధారిని పట్టుకోవడానికి అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెడతాడు విజయ్ వర్మ. అతను, అతని టీమ్ ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటారు. మరి ఫైనల్ గా పూణే పేలుళ్ల కేసును విజయ్ వర్మఅండ్ టీమ్ ఛేదించగలిగిందా... ఇందులో భాగంగా వారు ఎదుర్కొన్న ఇబ్బందులు తదితర అంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.
నటీనటుల పెర్ ఫామెన్స్
విజయ్ వర్మ పాత్రలో నాగార్జున లీనమైన విధానం సూపర్బ్. ఫిజిక్, బాడీ లాంగ్వేజ్ తో పాటు సటిల్ గా నాగార్జున నటించిన తీరు వావ్ అనిపిస్తుంది. ఎన్ఐఏ ఆఫీసర్ గా నాగార్జున పర్ ఫెక్ట్ గా సూట్ అయ్యారు. నాగార్జున టీం సయామి ఖేర్, అలీ రెజా తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేసారు. అతుల్ కులకర్ణి నటన బాగుంది. విలన్ పాత్ర చేసిన నటుడు ఫర్వాలేదనిపిస్తాడు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఇలాంటి జానర్ సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ఇంపార్టెంట్. సీన్లు ఎలివేట్ అవ్వాలంటే ఖచ్చితంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండాలి. ఈ విషయంలో తమన్ పూర్తిగా సక్సెస్ అయ్యాడు. చాలా ఎఫెక్టివ్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసాడు తమన్. ఈ సినిమాకి ఫస్ట్ హైలైట్ బ్యాక్ గ్రాండ్ షనీల్ డియో సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. పకడ్బందీ స్ర్కీన్ ప్లే తో ఆసక్తికరంగా సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ సాల్మన్. టేకింగ్ కూడా చాలా బాగుంది. ఓ హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీల్ ని కలుగజేస్తుంది. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా రాజీపడలేదు. సినిమా రిచ్ గా ఉంది.
విశ్లేషణ
'వైల్డ్ డాగ్' టాలీవుడ్ ఆడియన్స్ కి ఓ విభిన్న అనుభూతిని కలుగుజేస్తుంది. వాస్తవ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడంతో మాములుగానే ఆడియన్స్ లో ఈ సినిమాపై అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గలేదు. రెండు గంటల పాటు ఆడియన్స్ ని సినిమాలో లీనమయ్యేలా చేసే కథ, స్ర్కీన్ ప్లే ఈ సినిమాకి కుదిరాయి. యాక్షన్ ఎపిసోడ్స్ ని ఎంజాయ్ చేస్తారు. పూణే దాడిలో పాల్గొన్న టెర్రరిస్ట్ ని పట్టుకున్న తర్వాత, అన్ని అడ్డంకులను దాటుకుని ఆ టెర్రరిస్ట్ ను ఇండియా తీసుకురావడానికి విజయ్ వర్మ, అతని టీమ్ చేసే ప్రయత్నాలు, ఫైనల్ గా ఇండియాకి రావడం లాంటి ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. అలాగే విజయ్ వర్మ బాంబ్ బ్లాస్టింగ్ లో తన కూతురిని కోల్పడం వంటి సన్నివేశాలు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతాయి. ఓవరాల్ గా తదుపరి ఏం జరుగుతుందనే విషయాన్ని ఊహించగలిగినప్పటికీ, ఆ సీన్స్ ని తెరకెక్కించిన విధానం ఆడియన్స్ ని మెప్పిస్తుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... 2 గంటల పాటు ఎంగేజింగ్ గా సాగే 'వైల్డ్ డాగ్' ని అస్సలు మిస్ అవ్వద్దు. ఈ వారం వీకెండ్ ని 'వైల్డ్ డాగ్' తో ఎంజాయ్ చెయ్యొచ్చు.
ఫిల్మీబజ్ రేటింగ్ - 3.25/5