చిత్రం - హలో
బ్యానర్ - అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ ప్రైజెస్
నటీనటులు - అఖిల్ అక్కినేని, కళ్యాణి ప్రియదర్శన్, జగపతిబాబు, రమ్యకృష్ణ, అజయ్, సత్యకృష్ణ తదితరులు
సంగీతం - అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ - పి.యస్.వినోద్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
నిర్మాత - అక్కినేని నాగార్జున
రచన - విక్రమ్ కుమార్, ముకుంద్ పాండే (స్ర్కిఫ్ట్ అసోసియేట్)
దర్శకత్వం - విక్రమ్ కుమార్
విడుదల తేదీ - 22.12.2017
'అఖిల్' సినిమాతో హీరోగా పరిచయమైన అక్కినేని అఖిల్ రెండో సినిమా 'హలో' ఈ రోజు (22.1.2017) థియేటర్స్ కి వచ్చింది. 13 బి, ఇష్క్, మనం, 24, చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కుమార్.కె ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మనం ఎంటర్ ప్రైజెస్ పై అక్కినేని నాగార్జున నిర్మించిన ఈ చిత్రం ద్వారా లిజి, ప్రియదర్శన్ ల తనయ కళ్యాణి టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయం అయ్యింది. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చాడు. విక్రమ్ కుమార్ సినిమాలు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇష్క్ లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ, మనం లాంటి ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్, 24 లాంటి సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ని విక్రమ్ కుమార్ హ్యాండిల్ చేసిన విధానం సూపర్బ్. అతని సినిమాల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. లవ్ స్టోరీస్ కి బ్రాండ్ అంబాసిడర్స్ అక్కినేని హీరోలు. ఆ ఫ్యామిలీ హీరో అఖిల్ తో విక్రమ్ కుమార్ తెరకెక్కించిన లవ్ స్టోరీ 'హలో'. మరి ఈ సినిమా ఎలా ఉంది... అఖిల్ కెరియర్ ని 'హలో' ఎలాంటి మలుపు తిప్పుతుంది తెలుసుకుందాం.
కథ
శ్రీను అలియాస్ అవినాష్ (అఖిల్ అక్కినేని) ఓ అనాధ. ఏక్ తార వాయిస్తుంటాడు శ్రీను. తనకు చిన్నప్పుడే దూరమైన చిన్ననాటి స్నేహితురాలు జున్ను అలియాస్ ప్రియ (కళ్యాణి ప్రియదర్శన్) అంటే శ్రీనుకి చాలా ఇష్టం. తల్లిదండ్రులతో కలిసి ఢిల్లీకి వెళ్లిపోతూ వంద రూపాయల నోటు మీద తన ఫోన్ నెంబర్ రాసి శ్రీనుకి చేరేలా చేస్తుంది జున్ను. ఆ వంద రూపాయల నోటు పోవడంతో జున్నుకి ఫోన్ చేయలేకపోతాడు శ్రీను. అలా విడిపోయిన జున్ను, శ్రీను పెరిగి పెద్దవాళ్లయిన తర్వాత కూడా తమ స్నేహాన్ని మర్చిపోరు. 13 యేళ్లు గడిచినా శ్రీను తనకు ఫోన్ చేయకపోతాడా అని జున్ను ఎదురుచూస్తుంటుంది. జున్ను తనను కలుసుకోవడానికి వస్తుందని తాము కలుసుకునే పార్క్ దగ్గర ప్రతి రోజు ఉదయం వాకింగ్ కి వచ్చి ఎదురుచూస్తుంటాడు శ్రీను. మరి చిన్నప్పుడే విడిపోయిన జున్ను, శ్రీను కలుసుకుంటారా... ఎలా కలుసుకుంటారు అనేదే ఈ చిత్ర కథ.
నటీనటుల పెర్ ఫామెన్స్
శ్రీను అలియాస్ అవినాష్ పాత్రను అఖిల్ అద్భుతంగా పోషించాడు. ఎమోషనల్ సీన్స్ లో అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్... ఫైట్స్, డ్యాన్స్, లవ్ సీన్స్ లో చక్కటి నటన కనబర్చి వావ్ అనిపించాడు. కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ గా ఉంది. మంచి నటన కనబర్చింది. తల్లిదండ్రులుగా జగపతిబాబు, రమ్యకృష్ణ కనబర్చిన నటనను ఎవ్వరూ మర్చిపోలేరు. ఇద్దరూ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు. విలన్ గా అజయ్ పెర్ ఫామెన్స్ సూపర్బ్. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
అనూప్ రూబెన్స్ సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి చాలా ప్లస్ పాయింట్. పి.యస్.వినోద్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. రిచ్ విజువల్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్. ఎడిటింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు సూపర్బ్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాకి కావాల్సిన బడ్జెట్ ని సమకూర్చారు నిర్మాత నాగార్జున. డైరెక్టర్ విక్రమ్ కుమార్ తన స్ర్కీన్ ప్లేతో మరోసారి బ్రిలియంట్ డైరెక్టర్ అనిపించుకున్నారు. సింఫుల్ లవ్ స్టోరీకి విక్రమ్ కుమార్ రాసుకున్న కథనం, డైలాగులు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
లవ్ స్టోరీస్ కి అక్కినేని హీరోలు బ్రాండ్ అంబాసిడర్స్. నాగేశ్వరరావు గారు, నాగార్జున, నాగచైతన్య చేసిన ప్రేమ కథలు వారి తరం వారిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు అఖిల్ కూడా వీరికి ఏ మాత్రం తీసిపోలేదు. చక్కటి లవ్ స్టోరీ, లవబుల్ ఎక్స్ ప్రెషన్స్ తో అఖిల్ యూత్ ని మెస్మరైజ్ చేసేసాడు. స్ర్కీన్ ప్లే తో మ్యాజిక్ చేసాడు డైరెక్టర్ విక్రమ్ కుమార్. తల్లిదండ్రులతో మంచి ఎమోషన్ సీన్స్, చిన్ననాటి స్నేహితురాలితో చక్కటి ఎమోషన్స్, సోల్ మేట్ ని కలుసుకోవాలనే తపన ఉన్న కుర్రాడు... ఇలా హీరో క్యారెక్టరైజేషన్ ని విక్రమ్ కుమార్ అద్భుతంగా డిజైన్ చేసాడు. అఖిల్ ని అక్కినేని అభిమానులు ఎలా చూడాలనుకుంటారో అలా చూపించాడు విక్రమ్ కుమార్. ఇక రమ్యకృష్ణ, జగపతిబాబు సీన్స్ కొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. సినిమా చూసినంతసేపు ఓ చక్కటి ఫీలింగ్ కలుగుతుంది. ఫస్ట్ సినిమా 'అఖిల్' అందరినీ చాలా డిస్పాయింట్ చేసింది. దాంతో 'హలో' అఖిల్ కి రీ లాంచింగ్ సినిమా అని నాగార్జున ప్రకటించారు. నిజంగానే అఖిల్ కి 'హలో' చక్కటి రీ లాంచింగ్ సినిమా.
ఫైనల్ గా చెప్పాలంటే... నీట్ ఫిలిం. ఫీల్ గుడ్ లవ్ స్టోరీ.. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే సినిమా. ముఖ్యంగా యూత్ ని మెస్మరైజ్ చేసే 'హలో' ని అసలు మిస్ అవ్వకండి.
ఫిల్మీబజ్ డాట్ కామ్ రేటింగ్ - 3.5/5