చిత్రం - అనుక్షణం
నటీనటులు - విష్ణు, రేవతి, నవదీప్, మధుశాలిని, తేజస్వి, బ్రహ్మానందం, సూర్య (నూతన నటుడు)
నిర్మాతలు - పార్థసారధి నాయుడు, గజేంద్రనాయుడు, విజయ్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రాంగోపాల్ వర్మ
ఒక చిత్రాన్ని విడుదలకు రెండు రోజుల ముందే క్రిటిక్స్ చూపించాలంటే.. ఆ చిత్రం మీద చిత్రబృందానికి ఎంతో నమ్మకం ఉండాలి. ఎందుకంటే, భిన్న మనస్తత్వాలున్న విశ్లేషకులు ఆ చిత్రాన్ని చూసి, భిన్నాభిప్రాయాలు వ్యక్తపరుస్తారు. అందుకని అన్ని రకాల మనస్తత్వాలను ఆకట్టుకోగలమనే నమ్మకం ఉంటేనే బొమ్మ వెండితెరపై పడకముందు క్రిటిక్స్ కి చూపిస్తారు. ఇటీవల మంచు విష్ణు అదే చేశారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో పార్థసారధి, గజేంద్ర నాయుడు, విజయ్ నిర్మించిన ఈ చిత్రం రేపు (13.09.) విడుదల కానుంది. కానీ ఈ చిత్రాన్ని 10న క్రిటిక్స్ చూపించారు. తమ సినిమాపై వర్మ, విష్ణుకు ఉన్న నమ్మకానికి ఇది నిదర్శనం. మరి.. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం..
కథ
గౌతమ్ (విష్ణు) హైదరాబాద్ కు చెందిన స్పెషల్ బ్రాంచ్ ఎసీపి. సిన్సియర్ ఆఫీసర్. అంతా ప్రశాంతంగా సాగుతున్న సమయంలో నగరంలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఈ హత్యలు ఎవరు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. వయసులో ఉన్న అందమైన ఆడపిల్లలపై అత్యాచారం జరిపి, వారిని అంతమొందిస్తున్నట్లు, ఓ సైకో ఇదంతా చేస్తున్నట్లు గౌతమ్ తెలుసుకుంటాడు. ఆ సైకో ఎంత తెలివిగలవాడంటే ఆనవాళ్లు తెలుసుకోలేని విధంగా హత్యలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఒకదాని తర్వాత ఒకటి వరుసగా హత్యలు జరుగుతుంటాయి. వీటిని ఓ కాబ్ డ్రైవర్ చేస్తున్నట్లు తెలుసుకుంటాడు. సైకోల తీరు తెన్నులు ఎలా ఉంటాయో తెలియజేయడానికి ఎన్నారై సైకలాజిస్ట్ (రేవతి) రంగంలోకి దిగుతుంది. ఆమె సలహాలు తీసుకుంటాడు గౌతమ్. చివరికి హంతకుణ్ణి ఎలా పట్టుకున్నాడు? అసలా సైకో వరుసగా హత్యలు చేయడానికి కారణం ఏంటి? తదితర అంశాలను తెలుసుకోవాలంటే 'అనుక్షణం' చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్
ఈ సినిమా మొత్తాన్ని విష్ణు తన భుజాలపై మోసాడు. క్రమశిక్షణ గల పోలీసాఫీసర్ గా విష్ణు అద్భుతంగా ఒదిగిపోయాడు. ఒక మంచి పాత్ర దొరికితే నటనపరంగా ఏ స్థాయిలో విజృంభిస్తాడో నిరూపితమైంది. పోలీసాఫీసర్ గా అతని బాడీ లాంగ్వేజ్ బాగుంది. ఇక, రేవతి గురించి చెప్పక్కర్లేదు. తన పాత్రను పండించింది. నవదీప్ పాత్ర నిడివి తక్కువే అయినా, గుర్తుండిపోతుంది. తను కూడా బాగా చేశాడు. ఇంకా తేజస్వి, మధు శాలిని తదితరులు పాత్రల పరిది మేరకు చేశారు. సైకోగా నూతన నటుడు సూర్య బాగా చేశాడు.
సాంకేతిక వర్గం
రాంగోపాల్ వర్మ మార్క్ సినిమా ఇది. ఈ మధ్యకాలంలో తను తీసిన చిత్రాల్లోకెల్లా ది బెస్ట్ అంటే అతిశయోక్తి కాదు. పేరుకి తగట్టుగానే అనుక్షణం ఉత్కంఠకు గురి చేసే విధంగా తీశాడు. కెమెరా యాంగిల్స్ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాని ఎలివేట్ చేసే విధంగా ఉంది.
ఫిల్మీబజ్ విశ్లేషణ
భారతీయ చిత్రాలంటే పాటలు ఉండాల్సిందే. కానీ, పాటలు పెడితే కొన్ని కథలు డిస్ర్టబ్ అవుతాయి. 'అనుక్షణం' అలాంటి కథే. ఈ చిత్రంలో పాటలు లేకపోవడం పెద్ద ప్లస్. గంటన్నర నిడివితో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను కుర్చీల్లోంచి కదలనివ్వలేదు. రెప్పవాల్చడం మర్చిపోతారంటే అతిశయోక్తి కాదు. అయితే.. ఎంత మంచి సినిమాలో అయినా లోపాలుంటాయన్నట్లు.. ఈ చిత్రంలో ఉన్న ఒకే ఒక్క లోపం బ్రహ్మానందం కామెడీ ట్రాక్. అది మినహా సినిమాకి వంకపెట్టడానికి లేదు.
ఫైనల్ గా చెప్పాలంటే.. 'ఈ చిత్రం అనుక్షణం టెన్షన్ పెడుతుందని, తనకు చాలా నచ్చిందని' డా. మోహన్ బాబు తెలిపారు. అది నిజమే.. ప్రతి క్షణం ఉత్కంఠకు గురి చేసే ఈ 'అనుక్షణం' చూడదగ్గ సినిమా. పైగా.. ప్రతి స్ర్తీ తమ సమస్యగా భావించే కథ ఇది. అలాగే, ప్రతి మగాడు తన చెల్లెలికో, అక్కకో, భార్యకో.. ఇలాంటి పరిస్థితి వస్తే.. అని ఆలోచిస్తాడు.. సో.. ఆడ, మగ అందరికీ కనెక్ట్ అయ్యే చిత్రం ఇది. ముఖ్యంగా యువత చూడాల్సిన సినిమా. కుటుంబ సమేతంగా చూడదగ్గది.
'అనుక్షణం' ఓ మంచి ప్రయత్నం.. విష్ణు యాక్టింగ్, రాంగోపాల్ వర్మ టేకింగ్, కథ కథనం.. వీటికోసం చూడాలి. వేలం పాట ద్వారా ఈ చిత్రాన్ని పంపిణీ చేశారు. కొనుక్కున్న అందరికీ లాభం తెచ్చిపెట్టే చిత్రం.