చిత్రం - బ్యాంగ్ బ్యాంగ్
నటీనటులు - హృత్విక్ రోషన్, కత్రినా కైఫ్, డ్యాని డెంగ్జోపా, బిపాసా బసు తదితరులు
సంగీతం - విశాల్ - శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - జాక్.ఎల్.ముర్రే
దర్శకత్వం - సిద్దార్ధ్ ఆనంద్
బ్యానర్ - పాక్స్ స్టార్ స్టూడియోస్
విడుదల తేదీ - 2.10.2014
హాలీవుడ్ చిత్రం 'నైట్ అండ్ డే'కి రీమేక్ గా రూపొందిన హిందీ చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్'. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా డబ్ చేసి, ఒకేసారి విడుదల చేసారు. హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన ఈ చిత్రం ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలు పెంచేసాయి. హృతిక్ చేసిన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాపై ఆసక్తిని కలిగించాయి. అత్యంత భారీ అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4,500 థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకుంటుందా? హాలీవుడ్ చిత్రాన్ని యథాతథంగా తీశారా? లేక భారతీయ ప్రేక్షకులకు అనుగుణంగా మార్చారా... ఆ విషయాల్లోకి వెళదాం...
కథ
రాజ్ వీర్ (హృతికో రోషన్) అల్లరి చిల్లరి కుర్రాడు. చెడ్డవాళ్లతో స్నేహం చేస్తుంటాడు. ఎంతో విలువైన కోహినూర్ వజ్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రత్యర్థులతో తలపడుతుంటాడు. ఇదిలా ఉంటే బ్యాంక్ రిసప్షనిస్ట్ హర్లీన్ (క్రతినా కైఫ్)తో రాజ్ వీర్ కి ఓ సందర్భంలో పరిచయం ఏర్పడుతుంది. రాజీవ్ మంచివాడు కాదని మనసుకి అనిపిస్తున్నా అతనితో ప్రేమలో పడిపోతుంది. మరి.. ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా? రాజ్ వీర్ కోహినూర్ వజ్రాన్ని కాపాడుకోగలిగాడా?.. అనే అంశంతో ఈ చిత్రం తెరకెక్కింది.
నటీనటుల ఫర్ఫార్మెన్స్
హృతిక్ రోషన్ మంచి నటుడనే విషయం తెలిసిందే. పాత్రకు న్యాయం చేయడానికి ఎలాంటి రిస్కులైన తీసుకోవడానికి తను వెనకాడడు. అందుకు అతని గత చిత్రాలు ఓ ఉదాహరణ. ఇక ఈ చిత్రంలో అయితే 120 కార్లతో భారీ కార్ చేజింగ్, బోట్ ఫైట్స్, స్కై ప్లెయిన్ ఫైట్.. ఇలా రిస్కీ పోరాటాలు చేశాడు. హాలీవుడ్ చిత్రంలో టామ్ క్రూజ్ చేసిన పాత్రను ఈ చిత్రంలో హృతిక్ చేశాడు. టామ్ క్రూజ్ నటనకు ఏ మాత్రం తీసిపోని నటన కనబర్చాడు హృతిక్. ఫైట్స్ మాత్రమే కాదు.. ఓ పాటలో మైకేల్ జాక్సన్ స్టెప్పులతో అలరించాడు. ఇక.. క్రతినా కైఫ్ అయితే చాలా అందంగా ఉంది. చక్కగా యాక్ట్ చేసింది కూడా. ఇతర పాత్రధారులు సినిమాకు హెల్ప్ అయ్యారు.
సాంకేతిక వర్గం
హలీవుడ్ సినిమాకి మక్కీకి మక్కీ తీయకుండా డైరెక్టర్ సిద్ధార్ధ్ ఆనంద్ ఈ చిత్రాన్ని భారతీయ ప్రేక్షకులు అభిరుచి మేరకు మలచడం ప్లస్ పాయింట్. దర్శకునిగా తన కెరీర్ లో చెప్పుకోదగ్గ చిత్రం అవుతుంది. 'ది అమేజింగ్ స్పైడర్ మేన్ 2'కి ఫైట్స్ సమకూర్చిన ఆండీ ఆర్మ్ స్ర్టాంగ్ 'బ్యాంగ్ బ్యాంగ్'కి సమకూర్చిన ఫైట్స్ సుపర్బ్. భారతీయ తెరపై ఇలాంటి యాక్షన్ సీన్స్ కనిపించడం ప్రేక్షకులకు ధ్రిల్ కలిగించే విషయం. విశాల్-శేఖర్ స్వరపరచిన పాటలు ఇప్పటికే ఘనవిజయం సాధించాయి. కెమెరా పనితనం ఓ కనువిందు. ఇతర శాఖల పనితీరు కూడా మెచ్చుకోదగ్గ విధంగా ఉంది.
ఫిల్మీబజ్ విశ్లేషణ
హృతిక్ రోషన్ నటన కోసం ఈ సినిమాని చూడాలి. అలాగే హృతిక్, క్రతినా మధ్య కెమిస్ర్టీ కోసం చూడొచ్చు. సిద్ధార్ధ్ టేకింగ్ కోసం తప్పకుండా ఈ చిత్రాన్ని వీక్షించాలి. థ్రిల్ కి గురి చేసే ఫైట్స్, మంచి రొమాంటిక్ సీన్స్, కామెడీ.. ఇలా సగటు ప్రేక్షకుడికి కావల్సిన అన్ని అంశాలూ ఉన్న ఈ చిత్రం దసరా సెలవుల్లో ప్రేక్షకులకు మంచి విందు.