చిత్రం - బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
బ్యానర్ - సిరి సినిమా
సమర్పణ - ఇ.వి.వి.సత్యనారాయణ
నటీనటులు - అల్లరి నరేష్, కార్తీక నాయర్, మోనాల్ గజ్జర్, భానుశ్రీ మెహ్రా, హర్షవర్ధన్ రానే, బ్రహ్మానందం, అలీ, చలపతిరావు, జయప్రకాష్ రెడ్డి, జీవా, బెనర్జీ, వెన్నెల కిషోర్, నాగినీడు, అభిమన్యు సింగ్, సురేఖా వాణి, ఢిల్లీ రాజేశ్వరి, సంధ్య జనక్, శ్రీనివాసరెడ్డి, ఫృధ్వీ, కాశి విశ్వనాధ్, కెల్లి డార్జ్, మెల్కొటి, మీనాకుమారి, ప్రియ, ప్రభు, మధు నందన్, జబర్ధస్త్ సుధీర్, జబర్ధస్త్ చంద్ర, జబర్ధస్త్ రాఘవ, చిత్రం శ్రీను తదితరులు
కథ - విక్రమ్ రాజ్
సినిమాటోగ్రఫీ - అడుసుమిల్లి విజయ్ కుమార్
సంగీతం - శేఖర్ చంద్ర
ఫైట్స్ - రామ్-లక్ష్మణ్
ఎడిటింగ్ - గౌతంరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వల్లూరిపల్లి వెంకటేశ్వరరావు
నిర్మాత - అమ్మిరాజు కానుమిల్లి
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - బి.చిన్ని
విడుదల తేదీ - 7.11.2014
రాజేంద్రప్రసాద్ తర్వాత తెలుగు చిత్రపరిశ్రమలో మంచి కామెడీ హీరో అనిపించుకున్న క్రెడిట్ 'అల్లరి' నరేష్ కి దక్కుతుంది. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించగల దమ్మున్న మంచి కామెడీ హీరో. అలాంటి నరేష్ 'బ్రదర్ ఆఫ్ బొమ్మాళీ' అనే సినిమా ఒప్పుకోవడం... అన్న కన్నా చెల్లెలి పాత్ర డామినేటింగ్ గా ఉంటుందనే ఊహను ఈ టైటిల్ క్యారీ చేయడం.. వెరసి అసలీ చిత్రం ఎలా ఉంటుంది? ఈ అన్నాచెల్లెళ్లు ఎలాంటి సందడి చేస్తారు? ఇప్పటివరకు తన సినిమాల్లో నరేష్ డామినేటింగ్.. ఇప్పుడీ సినిమాలో తన పాత్రను చెల్లెలి పాత్ర డామినేట్ చేస్తుందా? లాంటి ప్రశ్నలు కలగడం సహజం. మరి.. బొమ్మాళీ.. ఆమె బ్రదర్ ఏం చేసారో చూద్దాం.
కథ
రామకృష్ణ అలియాస్ రాంకీ (అల్లరి నరేష్), లక్ష్మీ అలియాస్ (లక్కీ) కవల పిల్లలు. అమ్మ కడుపులో ఉన్నప్పట్నుంచే అమ్మ తినే ఆహారాన్నిముందుగా తనే లాక్కుని తినేసే గడుసు పిండం లక్కీ. భూమి మీద పడినప్పట్నుంచి తనకంటే కొన్ని క్షణాలు ముందుగా పుట్టిన అన్నయ్య రాంకీని ఏడిపిస్తూ గయ్యాళిలా అన్నింటిల్లోనూ తనదే పైచెయ్యి అనిపించుకుంటుంది. ఈ చెల్లెలి ఆగడాలు తట్టుకోలేక అన్నయ్య రాంకీ ఇబ్బందిపడుతుంటాడు. కరాటే కూడా నేర్చుకున్న లక్కీ ఏ విషయాన్ని అయినా ఆవేశంగా హ్యాండిల్ చేస్తుంటుంది. కానీ ఇందుకు పూర్తి భిన్నంగా రాంకీ ప్రవర్తన ఉంటుంది. ఏ సమస్యను అయినా తెలివిగా హ్యాండిల్ చేస్తుంటాడు రాంకీ.
రాంకీ తొలి చూపులోనే శృతి (మోనాల్ గజ్జర్)ని ఇష్టడతాడు. ఆమెను ఒప్పించి పెళ్లికి సిద్ధమవుతాడు. కానీ రాంకీ తండ్రి (కాశి విశ్వనాధ్) కూతురు పెళ్లి అవ్వకుండా కొడుకు పెళ్లి చేయడానికి కుదరదని చెప్పేస్తాడు. దాంతో లక్కీకి పెళ్లి చేయడానికి సంబంధాలు చూస్తాడు రాంకీ. అయితే తను హర్షవర్ధన్ (హర్షవర్ధన్) అనే అబ్బాయిని ప్రేమించానని. అతనినే పెళ్లి చేసుకుంటానని చెబుతుంది.
హర్షవర్ధన్ కి పెళ్లి కుదిరిపోయిందని తెలియడంతో ఖంగు తింటాడు రాంకీ. హర్షవర్ధన్ తో తన చెల్లెలి పెళ్లి ఎలా చేయాలి? అని తర్జన భర్జన పడతాడు. హర్ష పెళ్లి చెడగొట్టి, అతనితో తన చెల్లెలి మెడలో మూడు ముళ్లు వేయిస్తాడా? తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లగలిగాడా? అనే కథాంశంతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
'అల్లరి' నరేష్ మంచి నటుడు. అన్ని రసాల్లోనూ హాస్యరసం పండించడం కష్టమంటారు. అందులో ఎప్పుడో భేష్ అనిపించుకున్నాడు. ఈ సినిమాతో మరోసారి శభాష్ అనిపించుకుంటాడు. చెల్లెలి ముందు తగ్గే అన్న పాత్రను ఒప్పుకోవడానికి సామాన్యంగా ఏ హీరో ముందుకు రాడు. కానీ, కథకు ప్రాధాన్యం ఇచ్చి, ఈ పాత్రను ఒప్పుకున్నాడు నరేష్. తనదైన శైలిలో నవ్వించడంతో పాటు 'ఇన్నాళ్లు ఏమీ కోరని చెల్లెలు మొదటిసారి తనకు హర్ష కావాలని అడిగింది. తన కోరిక తీర్చడం అన్నగా నా బాధ్యత' అనే సెంటిమెంట్ సన్నివేశంలో నరేష్ నటన టచింగ్ గా ఉంది. ఇక.. హీరోయిన్ గా చేస్తున్న కార్తీక ఈ చెల్లెలి పాత్ర ఒప్పుకోవడం గ్రేట్. డైనమిక్ లేడీ గా తన నటన బాగుంది. ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్, హావభావాల్లో పొగరుబోతుతనాన్ని చక్కగా ఆవిష్కరించింది. కోన వెంకట్ పాత్ర ద్వారా బ్రహ్మానందం నవ్వించారు. మోనాల్ గజ్జర్ ది నటన ప్రదర్శించేంత గొప్ప పాత్ర కాదు. ఉన్నంతలో ఓకే అనిపించుకుంది. 'వరుడు' ఫేం భానుశ్రీ మెహ్రా పాత్ర సినిమాకి కీలకంగా అనిపించినా.. పెద్దగా నటన కనబర్చడానికి స్కోప్ ఉండదు. హర్షవర్ధన్ రాణె పాత్ర కూడా అంతే. హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. జయప్రకాశ్ రెడ్డి, అలీ, శ్రీనివాస రెడ్డి, కాశీ విశ్వనాథ్, నాగినీడు, వెన్నెల కిశోర్, సుధ, సురేఖావాణి... తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీలైన్. గడుసు చెల్లెలు, అన్నయ్యను హడలెత్తించే చెల్లెలు క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. అన్నయ్య, చెల్లెలు కాంబినేషన్ సీన్స్ ని డైరెక్టర్ ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించడం బాగుంది. మాటలు బాగున్నాయి. కొన్ని పంచ్ డైలాగులు ప్రేక్షకులు నవ్వుకునే విధంగా ఉన్నాయి. ఫోటోగ్రఫీ ఫర్వాలేదు. ఎడిటింగ్ బాగుంది. సెకండాఫ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉండేది. సంగీతం యావరేజ్ గా ఉంది. రీ-రికార్డింగ్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ కథ కొత్తగా ఉంది. అన్నా, చెల్లెళ్ల సినిమా అంటే.. కంట తడిపెడుతూ.. కర్చీఫులు తడిపేసుకుంటూ బోల్డన్ని సినిమాలను ఏడుస్తూ చూశాం. ఇది అందుకు పూర్తి భిన్నం. సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్ నవ్వులే. పొట్టలు చెక్కలయ్యే నవ్వులు కాదు కానీ.. పెదాల మీద నవ్వు చెరగదు. అంతవరకు గ్యారంటీ. ఇందులో చెల్లెలి పాత్ర డామినేటింగ్ అయినప్పటికీ, నరేష్ ఈ సినిమా ఒప్పుకోవడం గొప్ప విషయం. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ లో దర్శకుడు కొంచెం పట్టు తప్పాడేమో అనిపిస్తుంది. అది ప్రేక్షకుడి మనసుకి అనిపిస్తున్న సమయంలో మళ్లీ సినిమా ఊపందుకుంటుంది. పగతో విడిపోయిన రెండు కుటుంబాలను ఒకేచోట చేర్చి.. పెళ్లి ప్లాన్ చేసి, తెలివిగా వాళ్లని కలపడం అనేది పాయింట్ చాలా సినిమాల్లో చూసాం. ఈ సినిమా సెకండాఫ్ ఆ పాయింట్ తోనే సాగుతుంది. కాకపోతే.. పూర్తి స్థాయి కామెడీ చిత్రం కాబట్టి, విడిపోయినవాళ్లని కలిపే ఎపిసోడ్ మొత్తం కామెడీ గా సాగడం ఓ రిలీఫ్. డైలాగ్స్ బాగున్నాయి. పాటలు కథానుసారం ఉన్నాయి. ఫొటోగ్రఫీ ఓకే.
కొన్ని సినిమాలు చూసి బయటికొస్తున్నప్పుడు బతుకు జీవుడా అనిపిస్తుంది. అలాంటి హార్డ్ ఫీలింగ్స్ కలిగించకుండా హాయినిచ్చే కామెడీ ఎంటర్ టైనర్. ఒక్కసారి బొమ్మాళీని, ఆమె అన్నయ్యను చూడొచ్చు..