చిత్రం - కరెంట్ తీగ
బ్యానర్ - 24ప్రేమ్స్ ఫ్యాక్టరీ
నటీనటులు - మంచు మనోజ్, జగపతిబాబు, రకుల్ ప్రీత్ సింగ్, పవిత్రా లోకేష్, తనికెళ్ల భరణి, సన్నీ లియోన్, సంపూర్నేష్ బాబు, వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్, ధనరాజ్, జీవా, వీరేన్, సుప్రీత్, పృధ్వీ, రఘుబాబు తదితరులు
డైలాగ్స్ - కిషోర్ తిరుమల, జి.నాగేశ్వరరెడ్డి
సంగీతం - అచ్చు
ఎడిటింగ్ - యస్.ఆర్.శేఖర్
సినిమాటోగ్రఫీ - సతీష్ ముత్యాల
సమర్పణ: డా. మోహన్ బాబు
నిర్మాత - మంచు విష్ణు
దర్శకత్వం - జి.నాగేశ్వరరెడ్డి
విడుదల తేదీ - 31.10.2014
పోటుగాడు, పాండవులు పాండవులు తుమ్మెద... ఇలా వరుస విజయాలతో దూసుకెళుతున్నాడు మంచు మనోజ్. అలాగే, 24 ఫ్రేమ్స్ పతాకంపై డా. మోహన్ బాబు సమర్పణలో మంచి విష్ణు నిర్మిస్తున్న చిత్రాలు వరుస విజయాలు సాధిస్తున్నాయి. తాజాగా మనోజ్ హీరోగా, మంచి ఎంటర్ టైనర్స్ ని రూపొందించే జి. నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో మంచు విష్ణు నిర్మించిన చిత్రం 'కరెంట్ తీగ'. సక్సెస్ ట్రాక్ లో ఉన్న మంచు విష్ణు, మంచు మనోజ్, జి.నాగేశ్వరరెడ్డి, రకుల్ ప్రీత్ సింగ్ కాంబినేషన్ లో రూపొందిన 'కరెంట్ తీగ' చిత్రం ఆరంభమైనప్పట్నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం పోస్టర్స్ ఓ పండగలాంటి సినిమా అనే ఫీల్ ని కూడా కలగజేశాయి. పైగా తమిళంలో ఆల్రెడీ హిట్టయిన 'వరుత్తపడాద వాలిబర్ సంగమ్'కి ఇది రీమేక్ కావడంతో ఈ సినిమా విజయం సాధిస్తుందనే పాజిటివ్ టాక్ ఉంది. మరి.. ఈ 'కరెంట్ తీగ'... ఎలా ఉంది? విజయాన్ని సొంతం చేసుకుంటుందా...? విశ్లేషణలోకి వెళదాం...
కథ
పార్వతీపురానికి చెందిన పెద్ద మనిషి శివరామరాజు (జగపతిబాబు). తనకు ముగ్గురు కూతుళ్లు. అదే పార్వతీపురానికి చెందిన వీర్రాజు (సుప్రీత్) ఆడపిల్లలు గుండెల మీద కుంపట్లు అంటూ... ముగ్గురు ఆడపిల్లలు ఉన్న తండ్రి అని శివరామరాజును హేళన చేస్తుంటాడు. ఆ పిల్లలు పెరిగి పెద్దవారై ప్రేమలో పడి, ఎవరితోనైనా లేచిపోతే పరువు పోతుందని కూడా రెచ్చగొడుతుంటాడు వీర్రాజు. తన కూతుళ్లు ప్రేమలో పడితే, వాళ్లనైనా చంపుతాను, లేకపోతే తన చెవులను అయినా కోయించుకుంటానని శపధం చేస్తాడు శివరామరాజు. పెద్ద కూతురు, రెండో కూతురికి చక్కని సంబంధాలు చూసి, పెళ్లి చేసేస్తాడు శివరామరాజు. మూడో కూతురు కవిత (రకుల్ ప్రీత్ సింగ్) కూడా తన మాటే వింటుందని, తను చెప్పిన పెళ్లి కొడుకునే చేసుకుంటుందని చెబుతూ తిరుగుతుంటాడు శివరామరాజు.
అదే ఉరికి చెందిన కుర్రాడు రాజు (మంచు మనోజ్). ఎం.ఎ ఎంఫిల్ పూర్తి చేసి ఉద్యోగం దొరకపోయినప్పటికీ, ఎలాంటి చీకూ చింతా లేకుండా సరదాగా జీవితాన్ని గడిపేస్తుంటాడు. అతనికి ముగ్గురు ఫ్రెండ్స్ ఉంటారు. ఉద్యోగం లేని వీరందరూ వి.ఐ.పి అనే సంఘాన్ని ఏర్పాటు చేసి, ఊరిలో ఏదైనా అన్యాయం జరిగితే ఎదురుతిరుగుతారు. ఊరిలో ఎవరికి ఇబ్బంది వచ్చినా, తమ సమస్యగా భావించి ఆ సమస్యను తీర్చుతుంటుంది ఈ వి.ఐ.పి బ్యాచ్.
పక్క ఊరికి చెందిన శంకరన్న పెద్ద రౌడీ. దందాలు, భూకబ్జాలు చేస్తుంటాడు. పార్వతీపురంకి చెందిన ఇసుకను శంకరన్న బ్యాచ్ తరలిస్తున్నప్పుడు ఆ విషయాన్ని పోలీసులకు చెప్పి అడ్డంపడతాడు రాజు. ఇసుక తరలించకుండా అడ్డుకుంటాడు. దాంతో శంకరన్న బ్యాచ్ కి రాజు అంటే పడదు. రాజు మీద పగ తీర్చుకోవడానికి శంకరన్న బ్యాచ్ ట్రై చేస్తుంటుంది.
శివరామరాజు మూడో కూతురు కవితను శంకరన్న బ్యాచ్ కి చెందిన రౌడీ టీజ్ చేస్తున్న సమయంలో రాజు రంగంలోకి దిగి కాపాడతాడు. దాంతో కూతురుకి పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోతాడు శివరామరాజు. 17యేళ్ల కూతురికి పెళ్లి చేస్తున్నాడనే కారణంతో పోలీసులకు చెప్పి పెళ్లి ఆపించేస్తాడు రాజు. తన కూతురు పెళ్లికి అడ్డంపడిన వాడిపై కోపం పెంచుకుంటాడు శివరామరాజు. తన పెళ్లి ఆపించిన రాజుతో ప్రేమలో పడిపోతుంది కవిత. ఓ సందర్భంలో కవితపై కూడా రాజు మనసు పారేసుకుంటాడు.
మరి... కూతురు ప్రేమలో పడితే ఊరుకోని శివరామరాజును రాజు పెళ్లికి ఒప్పిస్తాడా? కూతురు పెళ్లి చెడగొట్టిన రాజును శివరామరాజు ఏం చేయాలనుకుంటాడు? కూతురు ప్రేమలో పడటం వల్ల శివరామరాజు చెవులు కోయించుకుంటాడా?... శంకరన్న బ్యాచ్ రాజుని అంతం చేయగలుగుతుందా? తదితర ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే 'కరెంట్ తీగ'ను చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్
లైవ్ వైర్ లా ఉండే మనోజ్ అద్భుతంగా నటించాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసిన..పల్లెటూరికి చెందిన ఓ నిరుద్యోగ యువకుడు ఎలా ఉంటాడో? అచ్చంగా మనోజ్ అలానే మౌల్డ్ అయ్యాడు. కామెడీ, యాక్షన్ మిక్స్ అయిన రాజు కారెక్టర్ ని చాలా ఎనర్జిటి్ గా చేశాడు. రి్స్కీ ఫైట్స్ చేయడం మనోజ్ అలవాటు. ఈ చిత్రంలో కూడా చాలా రిస్కులే తీసుకున్నాడు. వాటితో పాటు డాన్స్ కూడా బాగా చేశాడు. మొత్తం మీద తనలో మంచి కమర్షియల్ హీరో ఉన్న విషయన్ని మరోసారి నిరూపించుకున్నాడు మనోజ్. ఇక..మనోజ్ తర్వాత సినిమాలో జగపతిబాబుది కీలక పాత్ర. ముగ్గురు ఆడపిల్లల తండ్రిగా, పవర్ ఫుల్ మేన్ గా జగపతిబాబు తనదైన శైలిలో ఎక్స్ లెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. రకుల్ ప్రీత్ సింగ్ కాలేజీ గాళ్ గా సరిగ్గా సరిపోయింది. తన గత చిత్రాలతో పోల్చితే చాలా క్యూట్ గా ఉంది. చక్కగా నటించింది. ఇక.. హాట్ లేడీ సన్నీ లియోన్ ఈ చిత్రంలో టీచర్ పాత్రలో చాలా హాట్ గా కనిపించింది. కనిపించిన కాసేపు మెరిసింది. సంపూ ఇలా కనిపించి, అలా నవ్వించి మాయమవుతాడు. ఇతర నటీనటులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
తమిళ చిత్రం 'వరుత్తపడాద వాలిబర్ సంగం'ని తెలుగుకి అనుగుణంగా చక్కగా మలిచాడు నాగేశ్వరరెడ్డి. అచ్చు తెలుగు సినిమా చూస్తున్న ఫీల్ ని కలుగుజేస్తుందీ చిత్రం. కామెడీ ఎంటర్ టైనర్స్ ని చక్కగా తీసే నేర్పు ఉన్న దర్శకుడని ఈ చిత్రంతో మరోసారి నిరూపించుకున్నాడు. పాటలు కథానుసారం ఉన్నాయి. వినసొంపుగానే ఉన్నాయి. పల్లెటూరి వాతావరణాన్ని ఛాయాగ్రాహకుడు సతీష్ ముత్యాల చక్కగా ఆవిష్కరించాడు. ఈ చిత్రానికి ఉన్న మెయిన్ హైలైట్స్ లో సంభాషణల గురించి ప్రముఖంగా చెప్పుకోవాలి. కిశోర్ తిరుమల, జి,నాగేశ్వరరెడ్డి రాసిన డైలాగ్స్ షార్ట్ అండ్ స్వీట్ గా ఉన్నాయి. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఇది వేస్ట్ సీన్ అని ఎక్కడా అనిపించదు. ఎస్.ఆర్. శేఖర్ ఎడిటింగ్ కూడా షార్ప్ గా ఉంది. సినిమా ఎక్కడా ల్యాగ్ అనిపించదు. కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టారు. 'వరుత్త పడాద వాలిబర్'ని 'కరెంటు తీగ' గా రీమేక్ చేస్తే, హిట్ కొట్టొచ్చని జడ్జ్ చేసిన నిర్మాత విష్ణుని అభినందించవచ్చు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఏ సినిమా అయినా స్టార్టింగ్ టు ఎండింగ్ ఎక్కడా బోర్ కొట్టకుండా సాగితే అది హిట్ కిందే లెక్క. 'కరెంటు తీగ' ఈ కోవకే చెందుతుంది. ఫస్టాఫ్ ఎప్పుడో పూర్తయ్యిందో తెలియకుండానే ఇంటర్వెల్ వచ్చేస్తుంది. ఇక.. సెకండాఫ్ ఎప్పుడు పూర్తవుతుందా అని అసహనంగా కుర్చీల్లో కదలే బాధ ప్రేక్షకుడికి ఉండదు. ద్వితీయార్థం కూడా చాలా వేగంగా ఉంది. ట్విస్ట్ లు, నరాలు తెగిపోయే జోనర్ కి చెందిన సినిమా కాదు కాబట్టి, రిలాక్డ్స్ గా సినిమాని ఎంజాయ్ చేస్తారు. సాదాసీదా ఉద్యోగం లేని కుర్రాడితో ట్విస్ట్ లు గ్రటా పెట్టేసి, రొటీన్ సినిమాలా కాకుండా, ఎంటర్ టైన్ మెంట్ గా సినిమాని తెరకెక్కించడం బాగుంది. మంచు కుటుంబం నుంచి వచ్చిన మంచి మాస్ కమర్షియల్ మూవీ ఇది. 'నా సినిమా వల్ల నిర్మాతలు సేఫ్' అని మనోజ్ ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పాడు. అది నిజమే. మనోజ్ ఖాతాలో కమర్షియల్ హిట్ పడినట్టే.
క్లుప్తంగా చెప్పాలంటే.. పక్కా పైసా వసూల్ సినిమా.