చిత్రం - ఎర్రబస్సు
బ్యానర్ - తారకప్రభు ఫిలింస్
నటీనటులు - దాసరి నారాయణరావు, మంచు విష్ణువర్ధన్ బాబు, క్యాథరిన్, నాజర్, బ్రహ్మానందం, అలీ, కృష్ణుడు, ఎం.ఎస్.నారాయణ, రఘుబాబు,గౌతంరాజు, హేమ, సురేఖావాణి, విష్ణు ప్రియ, మౌనిక, బేబి నీరాజిత మరియు అతిధి పాత్రలో మురళీమోహన్ తదితరులు
కథ - ఎన్.రాఘవన్
రచన - రాజేంద్రకుమార్
పాటలు - డా.దాసరి నారాయణరావు, సుద్దాల అశోక్ తేజ, భాస్కరభట్ల, కరుణాకర్
సంగీతం - చక్రి
సినిమాటోగ్రఫి - అంజి
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు (చంటి)
సెకండ్ యూనిట్ డైరెక్టర్ - రేలంగి నరసింహారావు
నిర్మాత, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - డా.దాసరి నారాయణరావు
విడుదల తేదీ - 14.11.2014
తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం ఏ ట్రెండ్ నడుస్తోంది?... ఏ సినిమా ఫాలోయర్ని అడిగినా చెప్పే సమాధానం ఒక్కటే.. 'నాలుగు ఫైట్లు, ఆరు పాటలు, ఆ ఆరింట్లో ఒకటి ఐటమ్ సాంగ్, కథకు అతక్కపోయినా ఓ కామెడీ ట్రాక్, పంచ్ డైలాగులు'. ఈ మూస ఫార్ములాకి భిన్నంగా ఉన్న చిత్రాలు రావా? అని ఎవరికి వారు ప్రశ్నించుకుంటూనే.. వేరే దారి లేక వీటినే చూస్తున్నారు. ఈ నేపథ్యంలో 'ఎర్రబస్సు' అని టైటిల్ పెట్టి, తాత-మనవడి కాంబినేషన్ కథ అంటే.. ఓ మంచి ఫీల్ కలుగుతుంది. పైగా తాతేమో దర్శకరత్న దాసరి, మనవడేమో మంచు కుర్రాడు విష్ణు అంటే.. కాంబినేషన్ నుంచే అంచనాలు ఏర్పడటం సహజం. మావగారు, ఒసేయ్ రాములమ్మ తదితర చిత్రాల ద్వారా నటుడిగా దాసరి భేష్ అనిపించుకున్నారు. ఈ మధ్యకాలంలో ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలు చేస్తూ.. విష్ణు నటుడిగా తనలోని భిన్న కోణాలను ఆవిష్కరించుకుంటూ భేష్ అనిపించుకుంటున్నారు. మరి.. ఈ తాతా మనవళ్లు ఎలాంటి సందడి చేసారో చూద్దాం.
కథ
రాజేష్ (విష్ణు) సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ, యు.యస్ వెళ్లాలనే టార్గెట్ తో ఉంటాడు. మూడు నెలలలోపు ఓ ప్రాజెక్ట్ పూర్తి చేస్తే, రాజేష్ ని యు.యస్ పంపిస్తామని కంపెనీ మాట ఇస్తుంది. దాంతో ఈ మూడు నెలలు పల్లెటూరులో ఉండే తన తాత నారాయణస్వామి (దాసరి నారాయణరావు) ని సిటీకి తీసుకువచ్చి తనతో పాటు ఉంచుకుని ఆయనను సంతోషపెట్టాలనుకుంటాడు రాజేష్. ఆ ప్రకారం తాతను సిటీకి తీసుకువస్తాడు. పల్లెటూరు జీవితానికి అలవాటుపడి, ఉన్నది ఉన్నట్లు మాట్లాడి, అందరిని కలుపుకుపోయే నారాయణస్వామికి సిటీ లైఫ్, అపార్ట్ మెంట్ కల్చర్ కొత్తగా ఉంటుంది. ఆ అపార్ట్ మెంట్ లో వ్యక్తులు కూడా నారాయణస్వామిని ఏమీ తెలీని ఎర్రబస్సు గా కట్టేస్తారు. మరో వైపు డాక్టర్ రాజీ (క్యాథరీన్)ని తొలి చూపులోనే ప్రేమిస్తాడు రాజేష్. రాజీ కూడా రాజేష్ ని ప్రేమిస్తుంది. తన తాత మీద ఉన్న ప్రేమ వల్ల, కొన్ని కొన్ని విషయాల్లో రాజీని విభేదిస్తాడు. దాంతో రాజేష్, రాజీ మధ్య గొడవలు జరుగుతాయి.
తను ఎంతగానో ప్రేమించే తాత అమాయకత్వం వల్ల రాజేష్ ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అదే తాత వల్ల యు.యస్ వెళ్లాలనే అతని కల కలగానే మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. తను ప్రేమించిన రాజీ సైతం తన తాత వల్ల దూరమవుతుంది. ఈ పరిస్థితిలో తన తాతయ్య మీద కోపం తెచ్చుకుని, ఎప్పుడూ గట్టిగా మాట్లాడని రాజేష్ తన నుంచి దూరంగా వెళ్లిపోమ్మని తాతయ్యను తిడతాడు.
తన వల్ల తన మనవడు ఎదుర్కొన్న సమస్యలను దూరం చేయడానికి ఎవరి కాళ్లయినా పట్టుకోవడానికి సిద్ధపడతాడు తాత. చివరికి సమస్యలను పరిష్కరిస్తాడు. కానీ, ఈ క్రమంలో మానసిక ఒత్తిడికి గురవుతాడు. ఈ ఒత్తిడి నారాయణస్వామి ప్రాణం మీదకు తీసుకురాదు కానీ... ఘోరమైన మార్పునే తెస్తుంది. తనను ఎంతో జాగ్రత్తగా చూసుకున్న తాతయ్య స్థితిలో వచ్చిన ఆ మార్పుని చూసి, కుమిలిపోతాడు మనవడు. అదెలాంటి మార్పు? ఆ మార్పు కారణంగా తాతయ్య జీవితం ఎలాంటి మలుపు తీసుకుంటుంది? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే..
నటీనటుల పర్ఫార్మెన్స్
అచ్చ తెలుగు తాత ఎలా ఉంటారో అచ్చంగా దాసరి అలానే ఉన్నారు. నిజాయితీ, అమాయకత్వం, అవసరమైతే ఎదుటి వ్యక్తి వాడైనా తప్పు అనిపిస్తే.. చెంప దెబ్బ కొట్టడం, మనవణ్ణి విపరీతంగా ప్రేమించడం.. ఈ పాత్ర గుణాలివి. వీటిని దాసరి తనదైన శైలిలో పండించారు. ముఖ్యంగా ఎర్రబస్సెక్కి వచ్చిన తాతగా ఆయన శారీరక భాష బాగుంది. ఇక.. మనవడు విష్ణు గురించి చెప్పాలి. అమెరికాలో స్థిరపడాలని కలలు కనే సగటు యువకుడు. చిన్నతనంలోనే అమ్మా,నాన్నలను కోల్పోయి తాత దగ్గర పెరిగిన మనవడు. ప్రేమించిన అమ్మాయిని తాత అనుమతితో పెళ్లి చేసుకోవాలనుకునే కుర్రాడు. ప్రొఫెషన్ లో పట్టుదల, తాత పట్ల ప్రేమ, అమ్మాయితో ప్రేమ.. ఈ మూడింటినీ చక్కగా ఆవిష్కరించాడు. డ్యాన్స్ లు బాగా చేసాడు. ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసుకునే కుర్రాడు ఎలా ఉంటాడో, విష్ణు కూడా తన బాడీ లాంగ్వేజ్, లుక్ పరంగా అలానే మేకోవర్ అయ్యాడు. ముఖ్యంగా క్లయిమాక్స్ లో తాత స్థితిని చూసి, కంట తడిపెట్టుకునే సన్నివేశాలు ప్రేక్షకుల కంట తడిపెట్టిస్తాయి. ఓ మంచి నటుడు మంచి దర్శకుడి చేతిలో పడితే.. ఎంత బాగా నటించగలడో చెప్పడానికి క్లయిమాక్స్ లో విష్ణు నటన ఓ ఉదాహరణ. ఇక.. కేథరిన్ పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. ఇతర పాత్రల్లో నాజర్, అలీ, బ్రహ్మానందం తదితరులు ఒదిగిపోయారు. రఘుబాబు పాత్ర, ఆ పాత్రను ఆయన పోషించిన విధానం బాగుంది.
సాంకేతిక వర్గం
కొంత గ్యాప్ తర్వాత దాసరి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తమిళ చిత్రం 'మంజ పై' ఆధారంగా ఈ చిత్రం చేశారు.దర్శకుడిగా మళ్లీ మెరిశారు. చక్రి పాటలు కథానుసారంగా ఉన్నాయి. 'ఓం నమో నమ..', 'అయ్యో అయ్యో తాతయ్యా..', 'ఆకాశన పుడతాడు..' పాటలు బాగున్నాయి. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో రీ-రికార్డింగ్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండి ఉంటే బాగుండేదనిపిస్తుంది. కెమెరా, ఎడిటింగ్... అన్నీ ఓకే అనిపించుకుంటాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ప్రస్తుత పరిస్థతుల్లో సీన్ సీన్ కీ కన్నీళ్లు పెట్టునే సెంటిమెంట్ సినిమాలు చూడటం కష్టమే. కానీ, సెంటిమెంట్ ని ఇష్టపడతారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని చిత్రం ప్రథమార్ధం లైటర్ వీన్ గా తీసుకెళ్లి, ద్వితీయార్ధంలో సెంటిమెంట్ డోస్ ను పెంచారు దాసరి. మనవడిని బుల్లి బెల్లం అని ముద్దుగా పిలుచుకునే సీన్లు ప్రేక్షకులు ఎంజాయ్ చేసే విధంగా ఉన్నాయి. ఓ గంటన్నర పాటు అక్కడక్కడా మనసు మెలిపడుతూ, ఎక్కువగా రిలాక్స్ నిచ్చే సీన్స్ తో సినిమా సాగుతుంది. ఆ తర్వాత వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడి హృదయాన్ని తడి చేస్తాయి. బ్రహ్మానందం కాకి గోల సీన్ కథకు అతకలేదు.. పోనీ పండిందీ అంటే అదీ లేదు. ఆ ట్రాక్ లేకుండా ఉంటే బాగుండేది.
ఫైనల్ గా చెప్పాలంటే.. తాత ప్రేమను ఇష్టపడని మనవళ్లు, మనవరాళ్లు ఉండరు. మనవళ్లను ప్రేమించని తాతలూ ఉండరు. ఆ బంధం తాలూకు ప్రేమకు తెరరూపం ఇచ్చిన ఈ 'ఎర్రబస్సు'ని ఒక్కసారి ఎక్కితే తప్పు లేదు. ఎలాంటి ద్వందార్థాలు లేకుండా, రక్తపాతాలు లేకుండా, పంచ్ లు, ప్రాస్ డైలాగుల హోరు లేకుండా.. సాగే ఈ తాతా, మనవళ్ల కథను కుటుంబ సమేతంగా చూడొచ్చు.