చిత్రం - గాలిపటం
నటీనటులు: ఆది, ఎరికా ఫెర్నాండెజ్, క్రిస్టినా అకీవా, రాహుల్ రవీంద్రన్, ప్రీతి రానా, ప్రగతి, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం:భీమ్స్ సిసిరోలియో
కెమెరా: కె. బుజ్జి
ఎడిటింగ్: రాంబాబు
నిర్మాతలు: సంపత్ నంది, కిరణ్ ముప్పవరపు, విజయకుమార్ వట్టికూటి
దర్శకత్వం: నవీన్ గాంధీ
'ఏమైంది ఈ వేళ', 'రచ్చ'తో దర్శకునిగా తన ప్రతిభ నిరూపించుకున్నారు సంపత్ నంది. నిర్మాతగా మారి, తొలి ప్రయత్నంగా కిరణ్, విజయకుమార్ లతో కలిసి ఆయన నిర్మించిన చిత్రం 'గాలిపటం'. సినిమా సినిమాకీ నిరూపించుకుంటూ వస్తున్న ఆది ఇందులో హీరో. ఇది తనకు ఐదో సినిమా అనీ, తన కెరీర్ కి చాలా ముఖ్యం అని ఇటీవల ప్రెస్ మీట్ లో ఆది చెప్పాడు. తమకు బ్రేక్ రావడం కోసం కాదు.. ప్రేక్షకులకు ఓ మంచి సినిమా ఇవ్వాలనే తాపత్రయంతో చేశాం అని సంపత్ నంది అన్నారు. మరి.. ఆది కెరీర్ కి ఈ సినిమా ప్లస్ అవుతుందా? సంపత్ నంది అన్నట్లు గా ఈ సినిమా నిజంగానే ప్రేక్షకులను మంచి అనుభూతికి గురి చేస్తుందా?... ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమీక్ష.
కథ
కార్తీక్ (ఆది), శ్వేత (ఎరికా ఫెర్నాండెజ్) పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్స్ అయిన ఈ ఇద్దరూ ఒకే ఆఫీసులో వర్క్ చేస్తుంటారు. మ్యారీడ్ లైఫ్ కొద్ది రోజులు సజావుగా సాగుతుంది. కొన్ని రోజులు తర్వాత ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఎప్పుడూ సర్ధుకుని కాంప్రమైజ్ అయ్యే ఈ ఇద్దరూ ఓ రోజున మాత్రం తమ పాత లవర్స్ గురించి ఒపెన్ అవుతారు. దాంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరతాయి.
గతంలోకి వెళితే...శ్వేత గతంలో అరవ్ రెడ్డి (రాహుల్ రవీంద్రన్)ని ప్రేమిస్తుంది. కార్తీక్ గతంలో పరిణితి (క్రిస్టినా అకీవా)ని ప్రేమిస్తాడు. వీరి ప్రేమలు విఫలమవుతాయి. ఆ తర్వాత శ్వేతను పెళ్లి చేసుకుంటాడు ఆది.
కార్తీక్ ప్రేమ గురించి శ్వేతకు... శ్వేత ప్రేమ గురించి కార్తీక్ కి తెలియగానే ఇక కలిసుండలేమని భావించి ఇద్దరూ విడాకులు తీసుకోవడానికి రెడీ అయిపోతారు.
కార్తీక్, పరిణితిల ప్రేమ ఎందుకు విఫలమయ్యింది? అరవ్ రెడ్డి, శ్వేత ఎందుకు విడిపోయారు? పెళ్లి చేసుకున్న కార్తీక్, శ్వేత విడాకులు తీసుకుంటారా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ సినిమాకి నటీనటుల ఎంపిక పర్ ఫెక్ట్ గా జరిగింది. ఆది తన గత సినిమాలకంటే ఈ సినిమాలో అద్భుతంగా నటించాడు. అతని నటనలో మెచ్చూర్టీ కనిపించింది. లవ్, రొమాంటిక్ సన్నివేశాల్లో ఆది నటన చాలా బాగుంది. ఎరికా ఫెర్నాండెజ్ ఎమోషనల్ సీన్స్ ని చాలా బాగా చేసింది. క్రిస్టినా అకీవా రష్యా అమ్మాయి. అయినా సరే తెలుగు డైలాగులను చక్కగా చెప్పింది. అద్భుతమైన ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది క్రిస్టినా అకీవా. రాహుల్ రవీంద్రన్ పాత్ర నిడివి చాలా తక్కువ. అయినా సరే తను కనిపించినంతసేపు ఆడియన్స్ ని తన నటనతో ఆకట్టుకుంటాడు. చాలా మెచ్చుర్డ్ గా నటించాడు రాహుల్. ప్రీతి రానా, ప్రగతి, పోసాని కృష్ణమురళి తదితరులు వారి పాత్రల్లో ఒదిగిపోయారు. సప్తగిరి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాడు. పవన్ కళ్యాణ్ కాటంరాయుడా సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటుంది.
సాంకేతిక వర్గం
మంచి కథ. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోగల సత్తా ఉన్న స్టోరీ లైన్ తీసుకోవడంలో సంపత్ నంది సఫలమయ్యారు. ఆ కథను ఆసక్తిగా మలచడంలో డైరెక్టర్ నవీన్ గాంధీ పూర్తిగా సఫలమమయ్యారు. ఫస్టాప్ స్ర్కీన్ ప్లే చాలా ఆసక్తిగా సాగుతుంది. సెకండాఫ్ లో అక్కడక్కడా కొంచెం బోర్ ఫీలైనా, ఓవరాల్ గా మాత్రం ప్రేక్షకులను సినిమాలో మునిగిపోయేలా చేయడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ ఫీస్ట్ లా ఉంటుంది సినిమా. భీమ్స్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. సీన్స్ లో ఇన్ వాల్వ్ అయ్యేలా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేయడంలో భీమ్స్ సఫలమయ్యారు. అద్నాన్ సామి, కైలాస్ ఖేర్ పాడిన పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాప్ అంతా ఎంటర్ టైన్ మెంట్ తో బోర్ లేకుండా సినిమా సాగుతుంది. సెకండాఫ్ లో మాత్రం ఎమోషనల్ సీన్స్ ఎక్కువయ్యాయి. దాంతో ఎంటర్ టైన్ మెంట్ తగ్గి కాస్త బోర్ ఫీలవుతారు. సెకండాఫ్ కాస్త సాగదీసినట్టుగా కూడా ఉంటుంది. కొన్ని బోల్డ్ సీన్స్ ఉన్నాయి. అవి రియలిస్టిక్ గా ఉన్నప్పటికీ, అంత డిటైల్డ్ గా తెరపై చూపించాలా అనిపిస్తుంది. ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అయిన నవీన్ గాంధీ వంద శాతం తన సత్తాని ఫ్రూవ్ చేసుకున్నారు. లవ్, రొమాంటిక్, ఎమోషనల్ సీన్స్ ని చక్కగా తెరకెక్కించగలిగారు డైరెక్టర్. తొలి సినిమాతోనే నవీన్ కి మంచి గుర్తింపు వస్తుంది. తన ఫ్రెండ్స్ కిరణ్, విజయ్ కుమార్ లతో కలిసి సంపత్ నంది ఈ సినిమాని నిర్మించారు. నిర్మాతగా సంపత్ నంది ఈ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నట్టే.
ఫైనల్ గా చెప్పాలంటే...
యూత్ కి కనెక్ట్ అయ్యే ఈ సినిమా బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం ఖాయం. ఈ వీకెండ్ కి దొరికిన మంచి ఎంటర్ టైన్ మెంట్ మూవీ ఇది. గో అండ్ ఎంజాయ్. డోంట్ మిస్.