నటీనటులు - అంజలి, శ్రీనివాసరెడ్డి, హర్షవర్ధన్ రాణె, బ్రహ్మానందం, రావు రమేష్ తదితరులు
సంగీతం - ప్రవీణ్ లక్కరాజు
మాటలు, స్ర్కీన్ ప్లే, సమర్పణ - కోన వెంకట్
కెమెరా - సాయి శ్రీరాం
ఎడిటింగ్ - ఉపేంద్ర
నిర్మాత - ఎం.వి.వి.సత్యనారాయణ
దర్శకత్వం - రాజ కిరణ్.
రచయితగా కోన వెంకట్ కి మంచి గుర్తింపు ఉంది. 'జర్నీ'తోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అంజలి ' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'తో ఓ మంచి ఇమేజ్ ని సొంతం చేసుకుంది. తను ప్రధాన పాత్రలో రాజ కిరణ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎం.వి.వి. సత్యనారాయణ నిర్మించిన చిత్రం 'గీతాంజలి'. ఈ చిత్రానికి సమర్పకునిగా వ్యవరించడంతో పాటు మాటలు, స్ర్కీన్ ప్లే కూడా సమకూర్చాడు కోన వెంకట్. వినూత్నంగా సాగే హారర్, కామెడీ మూవీ అని చెప్పుకుంటూ వచ్చింది ఈ బృందం. 'చంద్రముఖి'లో జ్యోతిక, 'అరుంధతి'లో అనుష్క కు వచ్చినంత పేరు అంజలికి వస్తుందనే అంచనాలు నెలకొన్నాయి. మరి.. ఆ అంచనాలు నిజమయ్యే విధంగా ఈ చిత్రం ఉందా? తొలి ప్రయత్నంగా కోన వెంకట్ సమర్పించిన ఈ చిత్రం అతనికి ఎలాంటి అనుభూతిని మిగులుస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమీక్ష.
కథ
గీతాంజలి (అంజలి), ఉషాంజలి (అంజలి) కవలలు. గీతాంజలిని ఓ వ్యాపారవేత్త రేపి చేసి, చంపేస్తాడు. ఇదిలా ఉంటే దర్శకుడై, సినిమా పరిశ్రమలో ఓ మంచి స్థానం సంపాదించుకోవాలనుకుంటాడు శ్రీను (శ్రీనివాసరెడ్డి). తన స్నేహితుడు మధు (మధునందన్)తో పాటు అతని ఫ్లాట్లో ఉంటాడు శ్రీను. నిర్మాత రావు రమేష్ కి ఓ అద్భుతమైన కథ చెబుతాడు శ్రీను. అది అతనికి నచ్చి, సినిమా నిర్మించడానికి అంగీకరిస్తాడు. శ్రీను చెప్పిన కథ తన జీవితంలో జరుగుతున్న సంఘటనల సమహారంతో అల్లినదే. తన ఫ్లాట్ లో పలు ఇబ్బందులను ఎదుర్కొంటుంటాడు శ్రీను. ఒకానొక సందర్భంలో అతనికి ఉషాంజలి పరిచయమవుతుంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదురుతుంది. దాంతో రోజూ శ్రీను ఫ్లాట్ కి ఉషాంజలి వస్తుంటుంది. ఉషాంజలికి, ఆ ఫ్లాట్ కి ఉన్న సంబంధం ఏంటి? శ్రీనుని ఇబ్బందులపాలు చేస్తున్న సంఘటనలేంటి? గీతాంజలి హత్య కేసులో ఇరుకుని, జైలుపాలైన ఆమె ప్రియుడు హర్షవర్ధన్ రాణె నిర్దోషి అని నిరూపించుకోగలుగుతాడా? గీతాంజలి ఆత్మగా మారి, తనను చంపిన వ్యక్తిపై పగ తీర్చుకుంటుందా? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటులు పర్ ఫార్మెన్స్
తొలిసారి అంజలి ద్విపాత్రాభినయం చేసిన చిత్రం ఇది. తనలో మంచి నటి ఉందనేది తెలిసిన విషయమే. గీతాంజలి, ఉషాంజలి పాత్రలను బాగానే చేసింది. అయితే, చాలామంది ఊహించినట్లుగా చంద్రముఖి, అరుంధతి చిత్రాల్లో జ్యోతిక, అనుష్కలకు వచ్చినంత పేరైతే రాదు. అంజలి చేసిన ఈ రెండు పాత్రలకు అంత స్కోప్ లేదు. శ్రీను పాత్రను శ్రీనివాసరెడ్డి అద్భుతంగా చేశాడు. సినిమా తన భుజాల మీద నడిపించగలిగాడు. రావు రమేష్, బ్రహ్మానందం, హర్షవర్ధన్ తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు. అతిథి పాత్రలో 'దిల్' రాజు ఓకే అనిపించుకున్నాడు.
సాంకేతిక వర్గం
దర్శకుడు రాజ కిరణ్ పలు సినిమాల సమాహారంతో ఈ కథ అల్లుకున్నట్లుగా అనిపిస్తుంది. కథలో కొత్తదనం లేదు. కాకపోతే టేకింగ్ పరంగా తను ఓకే అనిపించుకున్నాడు. తొలి సినిమానే అయినప్పటికీ ప్రతిభ గలవాడు అనిపించుకున్నాడు. ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే, మాటలు కోన సమకూర్చాడు. సంభాషణలు యావరేజ్ గా ఉన్నాయి. ప్రథమార్థానికి కుదిరినంత బాగా ద్వితీయార్ధానికి స్ర్కీన్ ప్లే కుదరలేదు. పాటలు పరంగా ప్రవీణ్ లక్కరాజు ఇచ్చిన ట్యూన్స్ సాదాసీదాగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సాయిశ్రీరాం కెమెరా పనితనం ఓ ఎస్సెట్. ఎడిటింగ్ పరంగా సెకండాఫ్ మైనస్ అని చెప్పాలి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ కూడా బాగుంటుందని అంచనా వేస్తే పప్పులో కాలేసినట్లే. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, తద్వారా వచ్చే కొత్త పాత్రలు, మలుపులతో సినిమా వేగం తగ్గింది. పైగా మలుపులన్నీ ఊహించదగ్గవే కావడంతో ప్రేక్షకుడు ఉత్కంఠకు గురికాడు. సైతాన్ రాజుగా బ్రహ్మానందం కామెడీ ఇరగదీసి ఉంటాడని అంచనా వేసి, కావల్సినంతగా నవ్వుకోవచ్చనుకుంటే నిరాశ తప్పదు. ఫస్టాఫ్ లో శకలక శంకర్ కామెడీ బాగుంది. వాస్తవానికి ఈ సినిమాలో పాటలు లేకుండా ఉండి ఉంటే బాగుండేది.
ఇది హారర్ నేపథ్యంలో సాగే సినిమాయే అయినా కామెడీ సినిమాయేమో అనే సందేహం రాకమానదు. ఎందుకంటే, హారర్ సినిమాలంటే ప్రేక్షకుడు భయపడాలి. కానీ, ఈ సినిమా భయపెట్టదు. సరికదా నవ్విస్తుంది. ఫస్టాఫ్ మాత్రమే ఈ చిత్రానికి ఎస్సెట్. సెకండాఫ్ మొత్తం వచ్చే సన్నివేశాలను ప్రేక్షకుడు ముందే ఊహించేస్తాడు.. దాంతో ఈ చిత్రం థ్రిల్ కి గురి చేయదు.
ఫైనల్ గా చెప్పాలంటే... 'గీతాంజలి' భయెపెట్టే హారర్ కాదు. సాదాసీదాగా సాగే కామెడీ సినిమా. ఓసారి చూడొచ్చు. బాక్సాఫీస్ ని షేక్ చేసే అవకాశం లేదు.