చిత్రం - జోరు
బ్యానర్ - శ్రీ కీర్తి ఫిలింస్
నటీనటులు - సందీప్ కిషన్, రాశిఖన్నా, ప్రియా బెనర్జి, సుష్మ, బ్రహ్మానందం, ఎం.బాలయ్య, షాయాజీ షిండే, సప్తగిరి, అన్నపూర్ణ, హేమ తదితరులు
మాటలు - మీరాఖ్
పాటలు - వనమాలి,భీమ్స్ సిసిరోలియో, పూర్ణాచారి
సంగీతం - భీమ్స్ సిసిరోలియో
ఎడిటింగ్ - యస్.ఆర్.శేఖర్
కెమెరా - యం.ఆర్.పళనికుమార్
ఆర్ట్ - మురళి కొండేటి
ఫైట్స్ - వెంకట్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - ఇ.వి.రాజ్ కుమార్
నిర్మాతలు - అశోక్, నాగార్జున
రచన, దర్శకత్వం - కుమార్ నాగేంద్ర
విడుదల తేదీ - 7.11.2014
'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' చిత్రంతో మంచి విజయం అందుకున్న సందీప్ కిషన్ వరుసగా హిట్ చిత్రాలు చేసి, టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఓ స్థానం సంపాదించుకోవడానికి కృషి చేస్తున్నాడు. అతని గత చిత్రం 'రారా కృష్ణయ్య' ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో సందీప్ ఆశలన్నీ 'జోరు' పైనే ఉన్నాయి. వినోదం ప్రధానంగా రూపొందిన 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' హిట్ అవ్వడంతో, 'జోరు' సినిమాలో కూడా ఎంటర్ టైన్ మెంట్ మిస్ అవ్వకూడదని సందీప్ సినిమా ఆరంభం నుంచి డైరెక్టర్ కి చెబుతూ వస్తున్నాడనే వార్తలు ఉన్నాయి. ఇక 'గుండెల్లో గోదారి'లాంటి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ చిత్రానికి దర్శకత్వం వహించిన కుమార్ నాగేంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి. రాశిఖన్నా, ప్రియా బెనర్జీ, సుష్మ ముగ్గురు కథానాయికలు ఈ చిత్రంలో నటించారు. సో... గ్లామర్ కి కొరత ఉండదు. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణ పొందే విధంగా ఉందా, లేదా అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
విదేశాల్లో చదువుకుంటున్న అన్నపూర్ణ అలియాస్ అను (రాశిఖన్నా) 16యేళ్ల తర్వాత తన తండ్రి సదాశివం (షయాజీ షిండే)ని చూడటానికి ఇండియా ప్రయాణం అవుతుంది. విశాఖపట్నంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పని చేస్తాడు సదాశివం. ఫ్లయిట్ ల్యాండింగ్ ప్రాబ్లమ్ అవ్వడంతో హైదరాబాద్ నుంచి క్యాబ్ మాట్లాడుకుని రోడ్డు దారిలో విశాఖపట్నం చేరుకోవడానికి అను రెడీ అవుతుంది. దారిలో అను ని చంపడానికి అజయ్ ప్రయత్నిస్తాడు. సందీప్ (సందీప్ కిషన్) ఆమెను కాపాడతాడు. అను ప్రేమలో పడిపోతాడు సందీప్. కొన్ని కారణాల వల్ల సందీప్, అను ఆ ప్రయాణంలో విడిపోతారు. అప్పట్నుంచి అను కోసం వెతుకుతుంటాడు సందీప్. ఆ వెతుకులాటలో అను పేరున్న కొంతమంది అమ్మాయిలను కలుస్తాడు. అసలు అజయ్ ఎవరు? అనుని ఎందుకు చంపాలనుకుంటాడు? అనుని సందీప్ ఎలా కనిపెడతాడు? సందీప్ ని అను ప్రేమిస్తుందా అనే అంశాలతో ఈ చిత్రం రూపొందింది.
నటీనటులు పెర్ ఫామెన్స్
సందీప్ తెరపై బాగున్నాడు. కానీ గత సినిమాలతో పోలిస్తే, నటన విషయంలో సందీప్ అంచనాలను మించలేకపోయాడు. ముగ్గురు హీరోయిన్లలో రాశిఖన్నా క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో అందంగా ఉంది. మిగతా హీరోయిన్స్ తో పోలిస్తే, రాశిఖన్నా నటన బాగుంది. సప్తగిరి ప్రేక్షకులను నవ్వించాడు. పెళ్లికొడుకు పాత్రలో బ్రహ్మానందం మరోసారి తన విశ్వరూపం చూపించాడు. షయాజీ షిండే నెగటివ్ షేడ్ పాత్ర బాగా చేసాడు. మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
కుమార్ నాగేంద్ర టేకింగ్ తొలి సినిమా కంటే ఈ సినిమాలో బాగుంది. సింఫుల్ స్టోరీ లైన్. డైలాగ్స్ ఫర్వాలేదు. సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. అందమైన లొకేషన్స్ ని చక్కగా చూపించారు. 'జోరు' పాటలు బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలోకి వస్తే, సీన్స్ అబ్ రాప్ట్ గా కట్ అవుతున్నట్టు ఉంటుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
'జోరు' అటు రొమాంటిక్ ఎంటర్ టైనర్ గానీ, ఇటు కామెడీ ఎంటర్ టైనర్ గానీ కాదు. ఈ రెండింటిని మిక్స్ చేసి డైరెక్టర్ ఈ చిత్రాన్ని సరైన స్ర్కీన్ ప్లేతో తీర్చిదిద్దలేకపోయాడు. ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ గ్లామర్ పరంగా సరిగ్గా వాడుకోలేకపోయాడు డైరెక్టర్. యూత్ ఫుల్ హీరోతో అవుట్ అండ్ అవుట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ని చేసి ఉంటే, యూత్ కైనా ఈ సినిమా కనెక్ట్ అయ్యుండేది. లేదా కామెడీని బాగా వర్కవుట్ చేసి ఉంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసే అవకాశం ఉండేది. ఈ రెండింటిని మిక్స్ చేసి, సినిమాని సరిగ్గా హ్యండిల్ చేయలేకపోవడం ఈ సినిమాకి మైనస్. సందీప్ కిషన్, ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు కాబట్టి... టైమ్ పాస్ కోసం ఓసారి ఈ సినిమాని చూడొచ్చు.