చిత్రం - కార్తీకేయ
బ్యానర్ - మాగ్నస్ సినీ ప్రైమ్ ప్రై.లిమిటెడ్
నటీనటులు - నిఖిల్, స్వాతి, తనికెళ్ల, రావు రమేష్, కిశోర్, రాజా రవీంద్ర, జయప్రకాశ్, తులసి, జోగినాయుడు, ప్రవీణ్, స్వామి రారా సత్య, చత్రపతి శేఖర్ తదితరులు
కెమెరా - కార్తిక్ ఘట్టమనేని
ఎడిటింగ్ - కార్తిక శ్రీనివాస్
సంగీతం - శేఖర్ చంద్ర
ఆర్ట్ డైరెక్టర్ - సాహి సురేష్
రచనా సహకారం - దండు కార్తిక్ వర్మ
సమర్పణ - శిరువూరి రాజేష్ వర్మ
నిర్మాత - వెంకట శ్రీనివాస్ బొగ్గరం
రచన, దర్శకత్వం - చందు మొండేటి
విడుదల తేదీ - 24.10.2014
నిఖిల్, స్వాతి జంటగా నటించిన 'స్వామి రారా' చిత్రం ఘన విజయాన్ని అందుకుంది. అదే కాంబినేషన్ లో రిపీట్ అయిన చిత్రం 'కార్తీకేయ'. సూపర్ నాచురల్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం టీజర్ విడుదల నుంచే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిచింది. ట్రైలర్స్, పోస్టర్స్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేసాయి. ఈ చిత్రం ద్వారా చందు మొండేటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. నిఖిల్, స్వాతి మళ్లీ తమ కాంబినేషన్ హిట్ కొడుతుందనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకం నెరవేరే విధంగా ఈసినిమా ఉందా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
ఆంధ్ర, తమిళనాడు బోర్డర్ ని పరిపాలిస్తున్న కీర్తి వర్మరాజు, ఆ రాజ్యానికి వచ్చిన దుర్భిక్షం నుంచి ప్రజలను కాపాడటానికి ఆ రాజ్యంలో ఎక్కడా లేని సుబ్రమణ్య స్వామిని రాజ్యాన్ని కాపాడాల్సిందిగా మొక్కుకుంటాడు. దాంతో ఆ రాజ్యం సస్యశ్యామలంగా మారుతుంది. కీర్తి వర్మరాజు ఆ రాజ్యంలో సుబ్రమణ్య స్వామి గుడి కట్టిస్తాడు. అప్పట్నుంచి సుబ్రమణ్యపురంగా వెలుగొందుతుంటుంది. అలాగే సుబ్రమణ్య స్వామికి ప్రతి రోజూ దీపారాధన జరుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున స్వామివారికి షష్టి పూజ జరిపిస్తారు. ఇలా నిత్యం పూజలందుకునే ఆ సుబ్రమణ్య స్వామి ఆలయం 2013లో కొన్ని కారణాల వల్ల మూతబడుతుంది.అప్పట్నుంచి గుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు పాము కాటుతో చనిపోతూ ఉంటారు.
మెడిసిన్ ఫైనలియర్ కుర్రాడు కార్తీక్ (నిఖిల్) ఎలాంటి సమస్యను అయినా, దాన్ని విజయవంతంగా ఎదుర్కొన్ని సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టే మనస్తత్వం కలవాడు. తన కాలేజ్ లోనే చదివే వల్లి (స్వాతి)ని ప్రేమిస్తాడు కార్తీక్. మెడిసిన్ పూర్తయిన అనంతరం మెడికల్ క్యాంపు కోసం సుబ్రమణ్యపురం వెళతాడు కార్తీక్. అక్కడ సుబ్రమణ్య స్వామి ఆలయం మూసి ఉండటం, ఎందుకు గుడి మూసి ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నించిన వారు పాము కాటుతో చనిపోవడం కార్తీక్ ని ఆలోచింపజేసేలా చేస్తుంది. నిజంగానే పాము కాటుతోనే మనుషులు చనిపోతున్నారా? గుడి మూసి వేయడానికి కారణం ఏంటీ? ఈ విషయాలను ఛేజించడానికి నడుం కడతాడు కార్తీక్. ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెడతాడా? కార్తీక్ ఈ గుడి ఎందుకు మూసివేసారో తెలుసుకున్నాడా తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
కార్తీక్ పాత్రలో నిఖిల్ బాగా ఒదిగిపోయాడు. స్ర్కీన్ పై బాగున్నాడు. బాగా నటించాడు. ఆడియన్స్ ని కట్టిపడేసే నటనతో నిఖిల్ ఈ సినిమాకి వంద శాతం న్యాయం చేసాడు. ఈ సినిమా అతని కెరియర్ లో ఓ మైలురాయిగా నిలిచిపోతుంది. స్వాతి అందంగా ఉంది. లవ్ ట్రాక్ లో అద్భుతంగా నటించింది. క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కట్టిపడేసే స్వాతి, ఈ సినిమాలో కూడా చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నిఖిల్ ఫ్రెండ్స్ గా నటించిన ప్రవీణ్, సత్య కామెడీ సీన్స్ బాగా చేసారు. వీరి కామెడీ ప్రేక్షకులకు పెద్ద రిలీఫ్. ఇక ఈ సినిమాలో రావు రమేష్ ది కీలక పాత్ర. ఆయన కూడా ఆ పాత్ర బాగా చేసారు. పోలీసాపీసర్ గా కిషోర్, తనికెళ్ల భరణి, గెస్ట్ అఫియరెన్స్ ఇచ్చిన జయప్రకాష్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం
చందు మొండేటి తొలి సినిమా అయినప్పటికీ, చక్కటి కథ ఎంచుకున్నారు. తొలి సినిమా కాబట్టి లైటర్ వీన్ పాయింట్ ని తీసుకుని చేస్తారు. కానీ తొలి సినిమాకే తన సత్తా చాటుకోవాలనుకునే ప్రయత్నంలో కథ, కథనం విషయంలో డైరెక్టర్ చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఫస్టాప్ లో లవ్ ట్రాక్, కామెడీ సీన్స్ ని చక్కగా డీల్ చేసిన డైరెక్టర్, సెకండాఫ్ లో సస్పెన్స్ ఎలిమెంట్స్ ని డీల్ చేసిన విధానం బాగుంది. దేవుడు ఉన్నాడని, లేడని వాదించుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా డైలాగులు రాయడంలో చందు మొండేడి వంద శాతం సక్సెస్ అయ్యారు. సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని వర్క్ చాలా బాగుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. సంగీతం బాగుంది. ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా ముఖ్యం. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేసారు సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ బాగుంది. ఆర్ట్ డైరెక్టర్ సాహి సురేష్ క్రియేట్ చేసిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయి. అందువల్ల ప్రేక్షకులు కథలో బాగా లీనమవుతారు. నిర్మాత ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉండేలా చూసుకున్నారు. నిఖిల్, స్వాతి, కొత్త డైరెక్టర్ కాబట్టి చిన్న సినిమా అనుకునే అవకాశం ఉంది. కానీ విజువల్ గా సినిమా భారీ చిత్రంలా అనిపిస్తుంది.
ఫిల్మీబజ్ విశ్లేషణ
నిఖిల్, స్వాతి ఆన్ స్ర్కీన్ కెమిస్ట్రీ బాగుంది. ఈ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని చక్కగా నెరేట్ చేయడం ఈ సినిమాకి చాలా ప్లస్. కొత్త డైరెక్టర్ అయినప్పటికీ, ఎక్కడా తడబడకుండా సినిమాని తెరకెక్కిండం సినిమాకి హైలెట్. నటీనటులు ఎంపిక విషయంలో కూడా డైరెక్టర్ వంద శాతం సక్సెస్ అయ్యారు. చక్కటి సాంకేతిక వర్గాన్ని ఎన్నుకుని, తను అనుకున్న కథను పర్ ఫెక్ట్ గా స్ర్కీన్ పై పెట్టారు. ఇక ఈ సినిమా నిడివి కూడా కలిసొచ్చే అంశమే. తక్కువ నిడివి కాబట్టి, ప్రేక్షకులు ఎక్కడా బోర్ ఫీలవ్వరు. ఈ సినిమాలోని మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే... సినిమా ఆరంభం నుంచి ఇచ్చిన బిల్డప్ ని, క్లయిమ్యాక్స్ లో మాత్రం తేలికగా తేల్చేసినట్లు అనిపిస్తుంది. క్లయిమ్యాక్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే, ఫుల్ మీల్స్ సంతృప్తిగా తిన్న ఫీలింగ్ కలిగి ఉండేది. ఇది మినహా ఈ సినిమా గురించి పెద్దగా మైనస్ పాయింట్ లు చెప్పుకోవడానికి ఏమీ లేవు.
'కార్తీకేయ' ను హాయిగా ఈ వీకెండ్ లో ఎంజాయ్ చెసేయ్యొచ్చు