చిత్రం - లింగ
బ్యానర్ - రాక్ లైన్ ఎంటర్ టైన్ మెంట్స్ ప్రై.లిమిటెడ్
సమర్పణ - మునిరత్న, ఈరోస్ ఇంటర్నేషనల్
నటీనటులు - రజనీకాంత్, అనుష్క, సోనాక్షి సిన్హా, జగపతిబాబు, కె.విశ్వనాధ్, బ్రహ్మానందం, సంతానం, విజయకుమార్, రాధారవి, నిళగళ్ రవి, దేవ్ గిల్, ఆర్.సుందర్ రాజన్, పొన్ వన్నన్ తదితరులు
ఆర్ట్ డైరెక్టర్ - ఎ.అమరన్
సంగీతం - ఏ.ఆర్.రహమాన్
సినిమాటోగ్రఫీ - రత్నవేల్
కథ - పొన్ కుమరన్
మాటలు - శశాంక్ వెన్నెలకంటి
నిర్మాత - రాక్ లైన్ వెంకటేష్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - కె.యస్.రవికుమార్
సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా అంటే అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. సినిమాకి కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచీ గుమ్మడికాయ కొట్టేవరకూ ఆ చిత్రం గురించి వాడివేడిగా చర్చలు జరుగుతుంటాయి. ఇక.. బొమ్మ తెరకు వచ్చే సమయమయ్యేసరికి.. అంచనాలు ఊపందుకుంటాయి. 'లింగ'పై అలాంటి అంచనాలే ఉన్నాయి. రజనీకాంత్ హీరోగా 'పడయప్పా' ('నరసింహా) వంటి సంచలనాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన కె.యస్. రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం, ప్రచార చిత్రాలు చాలా బాగుండటం, 1990లలో చేసిన చిత్రాల్లో రజనీ ఎలా స్టయిల్ గా కనిపించారో అలా ఫొటోలు ఉండటం.. ఇలా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొనడానికి కారణం అయ్యాయి. మరి.. 'లింగ' ఆ అంచనాలు చేరుకునే విధంగా ఉందా... చూద్దాం.
కథ
లింగేశ్వర్ అలియాస్ లింగ (రజనీకాంత్) తన ఫ్రెండ్స్ తో కలిసి చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడు. అతనిని తన తాత ఊరు శింగనూరుకు తీసుకెళ్లాలని జర్నలిస్ట్ లక్ష్మీ (అనుష్క) ట్రై చేస్తుంటుంది. లింగేశ్వర్ తాతగారు రాజా లింగేశ్వర్ (రజనీకాంత్) కట్టించిన గుడి తెరవకుండా కొన్ని సంవత్సరాల నుంచి మూత పడి ఉంటుంది. ఆ గుడి తెరిస్తే ఊరికి మంచిదని ఊరి పెద్ద శీను (కె.విశ్వనాధ్) చెప్పడంతో రాజా లింగేశ్వర్ మనవడు లింగేశ్వర్ తో గుడి తెరిపించడానికి శింగనూరు తీసుకెళ్లాలనుకుంటుంది లక్ష్మీ. అయితే తన తాత తనకు ఏమీ మిగల్చకుండా తన జల్సాల కోసం ఆస్థిని నాశనం చేసాడనే అభిప్రాయంతో ఉన్న లింగేశ్వర్ శింగనూరు వెళ్లడానికి అంగీకరించడు. ఓ ప్లాన్ వేసి, లింగేశ్వర్ ని శింగనూరు తీసుకెళుతుంది లక్ష్మీ.
శింగనూరు వెళ్లిన లింగేశ్వర్ కి రాజమర్యాదలతో ఊరి ప్రజలు స్వాగతం పలుకుతారు. గుడిలో ఎంతో విలువైన మరకతమణి శివలింగం ఉందని తెలుసుకున్న లింగశ్వేర్ దానిని దొంగిలించి తీసుకెళ్లిపోవాలని గుడిని తెరుస్తాడు. ఊరి ప్రజలు లింగేశ్వర్ దొంగ అనుకుంటున్న సమయంలో ఊరి పెద్ద శ్రీను... లింగేశ్వర్ తాతగారు అయిన రాజా లింగేశ్వరం గురించి చెప్పడం మొదలుపెడతారు. ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది.
రాజా లింగేశ్వర్ రాజవంశీకుడు. బ్రిటీష్ పరిపాలనలో కలెక్టర్ గా జాబ్ చేస్తుంటాడు. శింగనూరు ప్రజలు నీళ్లు లేక కరువుతో అల్లాడడం చూసి, ఆ ఊరికి డ్యామ్ కట్టించాలని డిసైడ్ అవుతాడు. కానీ బ్రిటీష్ గవర్నమెంట్ డ్యామ్ కట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడంతో కలెక్టర్ పదవికి రాజీనామా చేసి, తన సొంత డబ్బులతో, శింగనూరు, ఆ చుట్టు పక్కల 36 గ్రామాల ప్రజల అండతో డ్యామ్ కట్టిస్తాడు. కాకపోతే ఆ డ్యామ్ నిర్మాణంలో భాగంగా కావాల్సిన ఎక్విప్ మెంట్స్ ఇవ్వడం కోసం రాజా లింగేశ్వర్ దగ్గర ఉన్న ఆస్తినంతా తన పేర రాయించుకుంటాడు బ్రిటీష్ గవర్నమెంట్ కి చెందిన కలెక్టర్. అలాగే డ్యామ్ బ్రిటీష్ గవర్నమెంట్ కట్టించిందని ప్రజలకు చెప్పాలని కూడా రాజా లింగేశ్వర్ కి కండీషన్ పెడతాడు. ఊరి ప్రజలకు రాజా లింగేశ్వర్ రాసిచ్చిన పొలాలు సైతం లాక్కుంటాడు బ్రిటీష్ కలెక్టర్. దాంతో ఊరి ప్రజలు తమను రాజా లింగేశ్వర్ మోసం చేసాడనుకుని అతనిని ఊరి నుంచి పంపించి వేస్తారు. అప్పుడదే ఊరికి చెందిన భారతి (సోనాక్షీ సిన్హా) కూడా లింగేశ్వరతో వెళ్లిపోతుంది. ఆ తర్వాత బ్రిటీష్ కలెక్టర్ చేసిన మోసం తెలుసుకుని, రాజా లింగేశ్వర్ కట్టించిన గుడిని ఆయనతోనే తెరిపించాలని ఊరి ప్రజలు రాజా లింగేశ్వర్ ని శింగనూరుకు రావాల్సిందిగా కోరతారు. అయితే అందుకు రాజా లింగేశ్వర్ నిరాకరిస్తాడు. ఆ రకంగా గుడి మూతపడే ఉంటుంది.
ప్రెజెంట్ కథలోకి వస్తే...
రాజా లింగేశ్వర్ మనవడు లింగేశ్వర్ అలియాస్ లింగ గుడిని తెరుస్తాడు. కాకపోతే తన తాత కట్టించిన డ్యామ్ ని కూలగొట్టి, వేరే డ్యామ్ నిర్మాణం కోసం ప్రభుత్వం నుంచి వేల కోట్లు దోచేయాలని ఆ ఊరు ఎం.పి నాగభూషణం (జగపతిబాబు) పన్నిన కుట్రను తెలుసుకుంటాడు. దాంతో లింగ తన తాత కట్టించిన డ్యామ్ తో పాటు, ఆ ఊరి ప్రజలను కాపాడి నాగభూషణాన్ని అంతం చేయడంతో కథ ముగుస్తుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
మాస్ పాత్రలు బ్రహ్మాండంగా చేయడం రజనీకి కొట్టిన పిండి. ఒకే చిత్రంలో రెండు, మూడు విభిన్న కోణాలున్న పాత్రలు చేయడం ఆయనకు హల్వా తిన్నంత ఈజీ. ఈ చిత్రకథ ప్రధానంగా ఫ్లాష్ బ్యాక్ లో తాత పాత్ర, ప్రెజెంట్ లో మనవడి పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ రెండు పాత్రలను రజనీ అద్భుతంగా చేశారు. కొంతమంది సీనియర్ హీరోల సరసన కుర్ర తారలు చేసినప్పుడు ఆ హీరోకి కూతుళ్లలా ఆ కథానాయికలు అనిపిస్తారు. కానీ, ఈ చిత్రంలో అనుష్క, సోనాక్షీలు రజనీకి సరిజోడీ అనిపించుకున్నారు. స్వాతంత్ర్య రాక మునుపు కథలో సోనాక్షీ, ప్రస్తుత తరానికి చెందిన జర్నలిస్ట్ గా అనుష్క నటించారు. ఇద్దరికీ నటించడానికి పెద్దగా స్కోప్ లేదు. ఉన్నంతలో ఓకే అనిపించుకున్నారు. ఇక.. ఈ చిత్రంలో జగపతిబాబు చేసిన పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిందే. 'లెజెండ్'లో విలన్ గా తొలి ప్రయాణం ఆరంభించి, భేష్ అనిపించుకున్న జగపతిబాబు ఈ చిత్రంలో నెగటివ్ రోల్ ను బాగా చేశాడు. కళాతపస్వి కె. విశ్వనాథ్ ది నిడివి తక్కువ పాత్ర అయినా గుర్తుండిపోతుంది. సంతానం పాత్ర నవ్వించింది. బ్రహ్మానందం, రాధారవి, విజయ్ కుమార్, నిళల్ గళ్ రవి... ఇలా ఇతర నటీనటులు పాత్రల పరిధి మేరకు చేశారు.
సాంకేతిక వర్గం
కేయస్ రవికుమార్ మంచి మాస్ దర్శకుడు. ఆ విషయం మరోసారి నిరూపించిన చిత్రం ఇది. అప్పట్లో 'నరసింహా'లో రజనీని ఎంత అద్భుతంగా ఆవిష్కరించారో ఈ చిత్రంలో కూడా అంతే బ్రహ్మాండంగా ఆవిష్కరించారు. కథ గొప్పది కాదు. కానీ, కథలో రజనీ ఉన్నారు కాబట్టి బాగున్నట్లనిపిస్తుంది. రత్నవేలు కెమెరా పనితనం కనువిందుగా ఉంది. ఎ.ఆర్. రహమాన్ పాటలు సోసోగా సాగాయి. అమరన్ వేసిన సెట్స్ పాత కాలం, ఇప్పటి కాలానికి తగ్గ విధంగా ఉన్నాయి. రజనీకాంత్ అవకాశం ఇచ్చారన్న ఆనందమో.. ఏమో రాక్ లైన్ వెంకటేష్ వెనకాడకుండా ఖర్చు పెట్టేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్.. డబ్బుని మంచినీళ్లలా ఖర్చుపెట్టిన వైనం స్పష్టంగా కనిపిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఇలాంటి స్టోరీ లైన్స్ చాలానే వచ్చాయి. అయితే రజనీకాంత్ నటించే ఏ సినిమా అయినా ఆయన మార్క్ ఉండాలి. అప్పుడే ఆయన అభిమానులతో పాటు ఇతర ఆడియన్స్ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ఈ విషయం డైరెక్టర్ రవికుమార్ కి బాగా తెలుసు కాబట్టి, ఆ పంధాలోనే సినిమాని ప్రెజెంట్ చేసారు. రజనీ నుంచి ప్రేక్షకులు ఎదురు చూసే ఆయన స్టయిల్ మిస్ కాకుండా చూసుకున్నారు. ఇది పక్కా కమర్షియల్ చిత్రం. రజనీ అభిమానులను సంతృప్తి పరిచే చిత్రం.
ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ గురించి చెప్పుకోవాలంటే... ఈ చిత్రం ప్రథమార్ధం సోసోగా ఉంటుంది, సెకండాఫ్ కూడా అదే చందాన సాగుతుంది. పాటలు పేలవంగా ఉండటం ఓ మైనస్. రహమాన్ పెద్దగా దృష్టి పెట్టలేదనే విషయం అర్థమవుతోంది. ఒక్క పాట కూడా గుర్తుండదు. రీ-రికార్డింగ్ అక్కడక్కడా బాగుంది. రజనీకాంత్ తో పెద్దగా డ్యాన్స్ స్టెప్పులు వేయించకపోవడం, ఫైట్స్ లో సైతం రజనీ యాక్షన్ కి బదులు డూప్ లు వీరవిహారం చేయడం నిరాశపరుస్తుంది. ఎక్కువ శాతం సినిమాని టెక్నిక్ తో జిమ్మిక్ చేయడంవల్ల ఆడియన్స్ కి రజనీకాంత్ అసలు సిసలు యాక్షన్ ని మిస్ అయ్యామనే ఫీల్ కలిగే ఆస్కారం ఉంది.
ఫైనల్ గా చెప్పాలంటే.. ఒకవేళ ఇది రజనీకాంత్ సినిమా కాకపోయి ఉంటే... ఖచ్చితంగా రిజల్ట్ తేడానే. కానీ, సింహం సింగిల్ గా కాదు.. రెండు పాత్రల్లో వచ్చింది. పైగా.. నడకలో వేగం, చూపుల్లో షార్ప్ నెస్ తో రజనీ మెస్మరైజ్ చేసేస్తారు. సో.. కమర్షయిల్ గా వర్కవుట్ అయ్యే అవకాశం ఉంది.