నటీనటులు - గోపీచంద్, రకుల్ ప్రీత్ సింగ్, బ్రహ్మనందం, చంద్రమోహన్, ఫృధ్వీ, భరత్, సంపత్ రాజ్, ముఖేష్ రుషి, పోసాని కష్ణమురళి, ప్రదీప్, రఘుబాబు, హంసా నందిని, భరత్ తదితరులు
కథ, మాటలు - శ్రీధర్ సీపాన
స్ర్కీన్ ప్లే - కోన వెంకట్, గోపీ మోహన్
సంగీతం - అనూప్ రూబెన్స్
కెమెరా - వెట్రి
ఎడిటింగ్ - ఎస్.ఆర్. శేఖర్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అన్నే రవి
నిర్మాత - వి. ఆనందప్రసాద్
దర్శకత్వం - శ్రీవాస్
బ్యానర్ - భవ్య క్రియేషన్స్
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా నటించిన 'లక్ష్యం' ఎంతటి ఘనవిజయాన్ని సొంతం చేసుకుందో తెలిసిందే. దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన చిత్రం 'లౌక్యం'. ఆల్ రెడీ హిట్ మూవీ ఇచ్చిన కాంబినేషన్ కాబట్టి, సహజంగానే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పైగా, ఈ చిత్రానికి సంబంధించిన ఈస్ట్ గోదావరి హక్కులు స్వయంగా చిత్రదర్శకుడే కొనడం, రచయిత కోన వెంకట్ గుంటూరులో విడుదల చేయడం సినిమాపై వారికున్న నమ్మకాన్ని తెలియజేస్తోంది. ఈ మధ్యకాలంలో గోపీచంద్ చిత్రాలు ఆశించిన ఫలితం ఇవ్వలేదు. చిత్రనిర్మాత ఆనందప్రసాద్ గ్యారంటీగా హిట్ కొడతాం అని పేర్కొన్నారు. మరి.. ఈ 'లౌక్యం' ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో చూద్దాం...
కథ
వరంగల్ ని గుప్పెట్లో పెట్టుకుని వణికించే బాబ్జి (సంపత్ రాజ్) చెల్లెలు (శ్యామల)ను పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లి, ఆమె ప్రేమించిన అబ్బాయితో సహా క్యాబ్ డ్రైవర్ సిప్పీ (బ్రహ్మానందం) సహాయంతో హైదరాబాద్ పంపిచేస్తాడు వెంకటేశ్వర్లు (గోపీచంద్). తన ఫ్రెండ్స్, తన తల్లిదండ్రులు (చంద్రమోహన్, ప్రగతి) గురించి బాబ్జికి చిన్న క్లూ దొరక్కుండా జాగ్రత్తలు తీసుకుని హైదరాబాద్ లో తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటూ ఉంటాడు వెంకటేశ్వర్లు. అక్కడ వెంకటేశ్వర్లుకు చంద్రకళ (రకుల్ ప్రీత్ సింగ్) కనబడుతుంది. ఫస్ట్ లుక్ లోనే ఆమెను ప్రేమించేస్తాడు వెంకీ. కానీ చంద్రకళ వైపు చూసిన వారిని ఆమె అన్న సత్య చంపేస్తాడు. సత్య గుప్పెట్లో పోలీస్ కమీషనర్లు సైతం ఉంటారు. అయితే ముందు గొడవతో ఆరంభమైన చంద్రకళ, వెంకటేశ్వర్లు పరిచయం ప్రేమగా మారుతుంది. చంద్రకళ, వెంకీ ప్రేమలో పడ్డారని తెలుసుకున్న సత్య వెంకీని చంపడానికి రౌడీలను పంపిస్తాడు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు చంద్రకళ, వెంకీ. కరెక్ట్ గా ఆ సమయంలో చంద్రకళపై శివారెడ్డి (ముఖేష్ రుషి) గ్యాంగ్ అటాక్ చేస్తుంది. చంద్రకళను వారి నుంచి తప్పించే ప్రయత్నం చేస్తుంటాడు వెంకీ. అప్పుడే రంగంలోకి బాబ్జి దిగి, తన చెల్లెలు చంద్రకళపై అటాక్ చేసిన వారితో ఫైట్ చేసి తన చెల్లెలును తీసుకెళ్లిపోతాడు బాబ్జి. చంద్రకళ అన్నయ్య బాబ్జి అని తెలుసుకుని వెంకీ షాక్ అవుతాడు. అసలు చంద్రకళ సత్య చెల్లెలా? బాబ్జి చెల్లెలా? చంద్రకళపై శివారెడ్డి గ్యాంగ్ ఎందుకు అటాక్ చేసింది? తన పెద్ద చెల్లెలును పెళ్లి పీటల మీద నుంచి తీసుకెళ్లి ప్రేమించినవాడితో పెళ్లి చేయించిన వెంకీని బాబ్జి కనిపెడతాడా? వెంకీనే తన రెండో చెల్లిలిని ప్రేమిస్తున్నాడని తెలుసుకుని, అతనితో తన చెల్లెలు పెళ్లి చేస్తాడా? బాబ్జిని ఒప్పించి తన ప్రేమను వెంకీ ఎలా గెలుచుకుంటాడు తదితర అంశాలతో సెకండాఫ్ సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్...
మంచి యాక్షన్ హీరో అనిపించుకున్న గోపీచంద్ ఈ చిత్రంలో యాక్షన్ తో పాటు కామెడీ కూడా చేశాడు. గోపీ మేన్లీగా ఉంటాడు కాబట్టి, తనకు కామెడీ సూట్ అవుతుందా అని చాలామంది అనుకుంటారు. తనకు ఎదురయ్యే సంఘటనలను లౌక్యంగా ఎదుర్కొంటూ విజయవంతంగా సాగే కుర్రాడి పాత్ర. కాబట్టి ఈ పాత్రకు యాక్షన్ టచ్ తక్కువ ఇచ్చికామెడీ టచ్ ఎక్కువ ఇచ్చారు. ఈ పాత్రలో పూర్తిగా ఒదిగిపోయాడు గోపీచంద్. చాలా హ్యాండ్ సమ్ గా ఉన్నాడు. ఫైట్స్ చాలా బాగా చేశాడు. ఒక మంచి పాత్ర దొరికితే నటనపరంగా ఏ స్థాయిలో విజృంభించగలడో నిరూపించుకున్నాడు. ఇక.. రకుల్ అందంగా, ఫ్రెష్ గా ఉంది. అభినయంపరంగా కూడా ఓకే. సిప్పీగా బ్రహ్మానందం తనదైన శైలిలో కామెడీ పండించాడు.పప్పీగా చంద్రమోహన్ ప్రేక్షకులను నవ్వించే పాత్ర చేసారు. ముఖ్యంగా సిప్పీ, పప్పీ కాంబినేషన్ సీన్స్ అలరించే విధంగా ఉన్నాయి. హంసా నందిని కనిపించేది కాసేపే అయినా... ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఫృద్వీరాజ్ గురించి. బాయిలింగ్ స్టార్ బబ్లూగా ఈ చిత్రంలో నటించాడు పృధ్వీ. తను నటించిన అన్నీ సీన్లు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి. క్లయిమ్యాక్స్ లో ఫృధ్వీ నటనకు, డైలాగ్ డెలివరీకి ప్రేక్షకులు చప్పట్లు కొడతారు. ముఖేష్ రుషి, ప్రగతి, శ్యామల, సంపత్ రాజ్ ఎవరి పాత్రల పరిధి మేరకు వారు నటించారు.
సాంకేతిక వర్గం...
'లక్ష్యం'లాంటి యాక్షన్ చిత్రం చేసిన డైరెక్టర్ శ్రీవాస్ ప్రస్తుతం ట్రెండ్ ని ఫాలో అవుతూ మంచు హీరోలతో 'పాండవులు పాండవులు తుమ్మెద'లాంటి కామెడీ ఎంటర్ టైనర్ ని చేసి విజయం సాధించాడు. తాజగా కూడా ఇదే ట్రెండ్ ని ఫాలో అవుతూ గోపీచంద్ తో కూడా కామెడీ ఎంటర్ టైనర్ నే చేసాడు. శ్రీధర్ సీపాన అందించిన కథ, మాటలు.. కోన వెంకట్, గోపీ మోహన్ అందించిన స్ర్కీన్ ప్లేని ఏ మాత్రం డిస్టర్బ్ చేయకుండా, తన ఆలోచనలను చొప్పించకుండా తెరకెక్కించాడు శ్రీవాస్. అందువల్ల స్ర్కిఫ్ట్ లో కన్ ఫ్యూజ్ లేదు. టేకింగ్ బాగుంది. శ్రీధర్ సీపాన అందించిన కథ రొటీన్ గానే ఉంది. కాకపోతే శ్రీధర్ అందించిన కొన్ని డైలాగులు బాగా పేలతాయి. రొటీన్ కథ అయినప్పటికీ, గ్రిప్పింగ్ స్ర్కీన్ ప్లే చేసారు కోన వెంకట్, గోపీ మోహన్. వెట్రి అందించిన ఫోటోగ్రఫీ బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ లు ఉన్నాయి. ఎడిటర్ కొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే, ల్యాగ్ అనిపించిన సీన్స్ ని ఎడిట్ చేసి ఉంటే సినిమా ఇంకా ఫాస్ట్ గా ఉంటుంది. అనూప్ అందించిన పాటలు మామూలుగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణపు విలువలు బాగున్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని తెరకెక్కించారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
నిజం చెప్పాలంటే ఇది రొటీన్ స్టోరీ. కాకపోతే ఇందులో రెండు ట్విస్ట్ లు ప్రేక్షకులు అసలు ఊహించరు. తనకు ప్రత్యర్ధి, విలన్ అయిన శివారెడ్డి కొడుకు భరతే తన ఇంట్లో ఉండి తన చెల్లెళ్ల జీవితాలతో ఆడుకోవాలనుకుంటున్నాడని మరో విలన్ అయిన బాబ్జి తెలుసుకోలేకపోతాడు. చివరి వరకూ దీన్ని సస్పెన్స్ గానే మెయింటెన్ చేయడం బాగుంది. ఇక ఈ మధ్య కాలంలో విలన్ ఇంట్లో హీరో సెటిల్ అయ్యి, వాళ్ల మనసులను మార్చి... తన ప్రేమను గెల్చుకోవడం అనే పాయింట్ తో వచ్చే సినిమాలు ఎక్కువైపోయాయి. కానీ ఈ సినిమాలో అందుకు భిన్నంగా తన ఇంట్లోకి విలన్ గ్యాంగ్ ని రప్పించి, వాళ్ల మనసులను మార్చి... తన ప్రేమను సక్సెస్ చేసుకుంటాడు హీరో. ఈ రెండు పాయింట్స్ ప్రేక్షకులను అలరిస్తాయి. కామెడీ ఎంటర్ టైనర్స్ ని ప్రేక్షకులు ఇష్టపడుతున్నారనే విషయాన్ని బాగా నెత్తికెక్కించుకుని ఈ సినిమా చేసారు. అందుకే బ్రహ్మానందం, చంద్రమోహన్ కాంబినేషన్ సీన్స్ ఆల్ మోస్ట్ కామెడీ ఉండేలా చూసుకున్నారు. అందులో ఈ టీమ్ సక్సెస్ అయ్యింది కూడా. వీరి కాంబినేషన్ సీన్స్ బాగున్నాయి. ఈ చిత్రంలో పృధ్వీ క్యారెక్టర్ ని డిజైన్ చేసిన విధానం బాగుంది. ఈ పాత్ర కూడా కామెడీ పండిస్తుంది. తన సీన్స్ అన్నీ బాగున్నాయి. ఈ కామెడీ సీన్స్ చిత్రానికి హైలెట్. ఓ యాక్షన్ హీరోని పెట్టుకుని కూడా సక్సెస్ ఫార్ములానే ఫాలో అయ్యి కామెడీ ని ప్రధానంగా తీసుకుని ఈ సినిమా చేసారు.
ఫైనల్ గా చెప్పాలంటే...
లౌక్యంగా కామెడీని చొప్పంచి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి చేసిన ఈ ప్రయత్నాన్ని ప్రేక్షకులు ఓసారి ఎంజాయ్ చెయ్యొచ్చు.