చిత్రం - నా బంగారు తల్లి
నటీనటులు - సిద్ధిక్, అంజలి పాటిల్, రత్న శేఖర్ రెడ్డి, లక్ష్మీమీనన్, నీనా కురూప్, అనూప్ అరవింద్, వారెన్ జోసెఫ్, సునీల్ కుడ్వత్తూర్ తదితరులు
సంగీతం - శరత్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ - సంతను మొయిత్రా
సినిమాటోగ్రఫీ - రమా తులసి
ఎడిటింగ్ - డాన్ మ్యాక్స్
కథ - సునీతకృష్ణన్
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - రాజేష్ టచ్ రివర్
నిర్మాతలు - సునీతకృష్ణన్, యం.యస్.రాజేష్
బ్యానర్ - సన్ టచ్ ప్రొడక్షన్స్
చైల్డ్ ట్రాఫికింగ్, వుమన్ ట్రాఫికింగ్ నేపధ్యంలో చాలా సినిమాలు తెరకు వస్తున్నాయి. ఈ కోవలో వుమన్ ట్రాఫికింగ్ నేపధ్యంలో తెరకెక్కిన తాజా చిత్రం 'నా బంగారు తల్లి'. ఇది యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కింది. ఇప్పటికే పలు విభాగాల్లో నేషనల్, ఇంటర్నేషనల్ అవార్డులు గెల్చుకున్న ఈ చిత్రం ఈ రోజు (21.11.2014) వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలకు ముందే అవార్డులు అందుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొంది, కమర్షియల్ విజయం అందుకుంటుందా? ఫార్ములా బేస్డ్ చిత్రాలకు భిన్నంగా.. హృదయానికి హత్తుకునే కథాంశంతో తీసిన ఈ చిత్రం నిర్మాతలకు ఎప్పుడో హార్థిక సంతృప్తినిచ్చేసింది.. మరి.. ఆర్థిక సంతృప్తిని కూడా మిగులుస్తుందో లేదో కాలమే చెప్పాలి. ఇక.. 'నా బంగారు తల్లి' సమీక్షలోకి ఎంటరవుదాం...
కథ
దుర్గాశ్రీనివాస్ (అంజలి పాటిల్) తన తల్లిదండ్రులు మిష్టర్ అండ్ మిసెస్ శ్రీనివాస్ (సిద్ధిక్, నీనాకురూప్)తో కలిసి అమలాపురంలో ఉంటుంది. అంజలి బాగా చదువుకుంటుంది. తన పై చదువుల కోసం హైదరాబాద్ వెళ్లాలనుకుంటుంది అంజలి. కానీ అంజలి తండ్రి శ్రీనివాస్ అంగీకరించడు. అయితే తల్లిదండ్రులకు తెలీకుండా పై చదువుల కోసం హైదరాబాద్ కాలేజ్ లకు అఫ్లై చేస్తుంది. తనకు ఇంటర్వ్యూ కాల్ రావడంతో, హైదరాబాద్ లో ఉన్న తన తండ్రిని కలుసుకుని ... ఆయనను ఒప్పించి ఇంటర్వ్యూ కు అటెండ్ అవ్వాలనే టార్గెట్ తో అమలాపురం నుంచి హైదరాబాద్ కు బయలుదేరుతుంది.
హైదరాబాద్ వెళ్లిన రోజే ఓ బ్రోతల్ గ్యాంగ్ చేతిలో పడుతుంది అంజలి. పది రోజుల పాటు చిత్ర వధ అనుభవిస్తుంది. ఇలాంటి సమయంలోనే తన తండ్రి గురించి తెలిసిన ఓ వార్త అంజలిని షాక్ కు గురి చేస్తుంది. తన తండ్రి గురించి అంజలి ఏం తెలుసుకుంటుంది? బ్రోతల్ హౌస్ నుంచి అంజలి ఎలా బయటపడుతుంది? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పెర్ ఫామెన్స్
దుర్గ పాత్రలో అంజలి పాటిల్ ఒదిగిపోయిన వైనాన్ని అభినందించాల్సిందే. నటనకు స్కోప్ ఉన్న పాత్ర కావడంతో, అంజలికి తనలోని నటిని ఆవిష్కరించే అవకాశం దక్కింది. వంద శాతం దుర్గ పాత్రకు న్యాయం చేసింది. చూడచక్కగా కూడా ఉంది. ఇలాంటి పాత్రలు చేసేటప్పుడు చాలా బ్యాలెన్స్ గా నటించాల్సి ఉంటుంది. దుర్గ పాత్రను చాల బ్యాలెన్స్ గా చేసింది అంజలి. ఇక ఈ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర అంజలి తండ్రి పాత్ర. ఈ పాత్రను సిద్ధిక్ చేసారు. అంజలి తండ్రి శ్రీనివాస్ గా చక్కగా నటించారు సిద్ధిక్. ఆయన పాత్రకు పలు షేడ్స్ ఉన్నాయి. ఎన్నో ఎమోషన్స్ ని చక్కగా పలికించి తన పాత్రకు పూర్తి న్యాయం చేసారు సిద్ధిక్. మిగతా నటీనటులందరూ ఎవరి పాత్ర పరిధిమేరకు వారు నటించారు.
సాంకేతిక వర్గం
వుమన్ ట్రాఫికింగ్, సెక్స్ రాకెట్స్ నేపధ్యంలో రూపొందిన ఈ కథకు చక్కటి స్ర్కీన్ ప్లే సమకూర్చారు డైరెక్టర్ రాజేష్ టచ్ రివర్. సోషల్ ఇష్యూకి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించి అద్భుతంగా తెరకెక్కించారు రాజేష్. ఈ చిత్రానికి హైలెట్ స్ర్కీన్ ప్లే, దర్శకత్వం. కొన్ని డైలాగులు బాగున్నాయి. కథానుసారం పాటలు సాగుతాయి. రీ-రికార్డింగ్ సీన్స్ ని ఎలివేట్ చేసే విధంగా ఉంది. ప్రేక్షకులు సీన్ లో లీనమవ్వడానికి బ్యాక్ గ్రాండ్ స్కోర్ బాగా దోహదపడింది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ కూడా స్పీడ్ గా ఉండటంతో సినిమా నడక వేగంగా సాగినట్టు అనిపిస్తుంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ రిచ్ గా ఉన్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఎవరు తీసిన గోతిలో వాళ్లే పడతారనే ఓ మంచి మెసేజ్ తో తెరకెక్కిన చిత్రం ఇది. అయితే కేవలం మెసేజ్ మాత్రమే ఇవ్వాలనుకుంటే, ప్రేక్షకులకు ఇలాంటి సినిమాలు రీచ్ అవ్వడం కష్టమవుతుంది. లేదా శృతిమించి ఈ పాయింట్ ని పక్కా కమర్షియల్ సినిమాలా తెరకెక్కించాలంటే ఓ వర్గం ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తుంది. సినిమాపై వేరే రకమైన ఇమేజ్ కూడా పడుతుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా జరగలేదు. తీసుకున్న ఓ మంచి పాయింట్ కు కమర్షియల్ అంశాలు కూడా ఎంతవరకు అవసరమో అంతవరకే జోడించి డైరెక్టర్ ఈ చిత్రాన్ని తీర్చదిద్దారు. కాబట్టి ఈ చిత్రం రెగ్యులర్ మాస్ మసాలా చిత్రాలను చూసే ప్రేక్షకులను కూడా మెప్పిస్తుంది. వ్యభిచార కూపంలో చిక్కుకుని ఎంతోమంది అమ్మాయిలు బలవుతున్నారు. ఇలాంటి సోషల్ ఇష్యూలు తెరకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అప్పుడే జనాల్లో అవగాహన పెరుగుతుంది. సినిమా అనేది క్లాస్, మాస్ తేడా లేకుండా చొచ్చుకుపోయే మాద్యమం. కాబట్టి, ఇలాంటి సినిమాలు మరెన్నో రావాలి. ఇలాంటి పాయింట్ ని కూడా కుటుంబ సభ్యులందరితో కూర్చుని చూసే విధంగా తెరకెక్కించినందుకు డైరెక్టర్ ని అభినందించాల్సిందే. ఇలాంటి చిత్రం తీయడానికి ఏ నిర్మాతకైనా దమ్ముండాల్సిందే. ఆ దమ్ము ఉన్న సునీతాకృష్ణన్ ను అభినందించాల్సిందే.
ఫైనల్ గా చెప్పాలంటే... మెసేజ్ తో కూడుకున్న పక్కా కమర్షియల్ చిత్రం 'నా బంగారు తల్లి'. డోంట్ మిస్ ఇట్.