బ్యానర్ - పరమేశ్వర ఆర్ట్ క్రియేషన్స్
చిత్రం - నీ జతగా నేనుండాలి
నటీనటులు - సచిన్ జోషి, నజియా హుస్సేన్, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు
సంగీతం - మిథున్, జీత్ గంగూలి, అంకిత్ తివారీ
సినిమాటోగ్రఫీ - ఎ.వసంత్
సమర్పణ - శివబాబు బండ్ల
నిర్మాత - బండ్ల గణేశ్
దర్శకత్వం - జయ రవీంద్ర
ఆదిత్యరాయ్ కపూర్, శ్రద్ధాకపూర్ జంటగా మోహిత్ సూరి దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం 'ఆషికీ 2' ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. తక్కువ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో 'నీ జతగా నేనుండాలి' పేరుతో రీమేక్ చేశారు నిర్మాత బండ్ల గణేష్. తెలుగులో సచిన్ జోషి, నజియా హుస్సేన్ జంటగా నటించారు. ఓ భాషలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్న కథ కాబట్టి, రీమేక్ చేసినప్పుడు 'విజయం ఖాయం' అనే నమ్మకం ఉంటుంది. అయితే, ఒక్కోసారి ఆ నమ్మకం వమ్ము అవుతుంది. ఒక భాషలో ఘనవిజయం సాధించిన చిత్రం మరో భాషలోకి రీమేక్ అయ్యి, బోల్తా కొట్టిన సందర్భాలున్నాయి. 'నీ జతగా నేనుండాలి' విషయానికొస్తే.. హిందీ వెర్షన్ కన్నా బాగా వచ్చిందని నిర్మాత బండ్ల గణేష్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. మరి.. ఈ చిత్రం హిందీకన్నా ఇక్కడ సూపర్ హిట్ ను అందుకుంటుందా?.. ఆ విషయమే తెలుసుకుందాం...
కథ
రాఘవ్ జయరామ్ (సచిన్) ఓ పాప్ సింగర్. మంచి పేరు, ప్రఖ్యాతలు సంపాదించుకుంటాడు. అయితే, మద్యానికి బానిస కావడంవల్ల అతని కెరీర్ డౌన్ ఫాల్ కావడం మొదలవుతుంది. ఈ నేపథ్యంలో గోవాలో ఓ బార్ లో గాయని గాయత్రీ నందన (నజియా హుస్సేన్)తో రాఘవ్ కి పరిచయం అవుతుంది. లతా మంగేష్కర్ అంతటి గాయని కావాలన్నది గాయత్రి ఆశయం. గాయత్రి స్వరానికి ముగ్ధుడై, ఆమె ఆశయాన్ని నెరవేరుస్తానని మాటిస్తాడు రాఘవ్. ఇకనుంచీ బార్ లో పాడొద్దని తనతో పాటు రమ్మంటాడు. కోటి ఆశలతో రాఘవ్ వెంట వెళుతుంది గాయత్రి. తనతో పాటు హైదరాబాద్ తీసుకొస్తాడు. గాయత్రి హైదరాబాద్ లో తన ఇంటికి వెళుతుంది. ఓ రికార్డింగ్ కంపెనీ కి తీసుకెళతానని, కొత్త సిమ్ వేసుకుని, ఫోన్ చేయమని తన ఫోన్ నంబర్, తన పిఎ (శశాంక్) నంబర్ ఇస్తాడు రఘవ్ జయరామ్. మర్నాడు రాఘవ్ ని కాంటాక్ట్ చేస్తుంది గాయత్రి. కానీ, కొంతమంది అపరిచితులు అతనిపై దాడి చేయడంతో ఫోన్ తీయడు. ఆ తర్వాత శశాంక్ ఫోన్ తీసి, స్టేజ్ షోస్ నిమిత్తం రాఘవ్ విదేశాలు వెళ్లాడని ఆమెకు ఓ కట్టుకథ అల్లి చెబుతాడు. ఆస్పత్రిలో మాట్లాడలేని స్థితిలో ఉంటాడు రాఘవ్. అతన్ని కాంటాక్ట్ చేయడానికి గాయత్రి ఎన్నిసార్లు ప్రయత్నించినా నిరాశే ఎదురవుతుంది. విధి లేని పరిస్థితుల్లో మళ్లీ బార్ లో పాడటం మొదలుపెడుతుంది. ఈ నేపథ్యంలో గాయాల నుంచి కోలుకున్న రాఘవ్ వెంటనే గాయత్రి ఆచూకీ కనుగొనే పని మొదలుపెడతాడు. గాయత్రి కూడా అతని కలవడానికి ప్రయత్నిస్తుంటుంది. ఈ ఇద్దరూ కలుసుకున్నారా? గాయత్రీ ఆశయాన్ని అతను నెరవేరుస్తాడా? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
పాప్ సింగర్ గా హిందీలో ఆదిత్యరాయ్ కపూర్ పూర్తిగా ఒదిగిపోయాడు. కానీ, సచిన్ జోషి ఆ స్థాయిలో ఈ పాత్రను పండించలేకపోయాడు. ఒకరకంగా చెప్పాలంటే ఈ సినిమాకి హీరోయే మైనస్. ఓ రాక్ స్టార్ కి ఉండాల్సిన లక్షణాలేవీ హీరోలో కనిపించలేదు. కొంత విరామం తర్వాత తెలుగులో అతను నటించిన ఈ చిత్రం ఏమాత్రం కెరీర్ కి ఉపయోగపడదు. హీరోయిన్ విషయానికొస్తే.. హిందీలో శ్రద్ధాకపూర్ ఓ రేంజ్ లో ఇరగదీసింది. అందం, అభినయం పరంగా మార్కులు కొట్టేసింది. కానీ, తెలుగులో నజియా హుస్సన్ కి అంతంత మాత్రమే మార్కులు ఇవ్వాలి. ఇతర పాత్రలు చెప్పుకోదగ్గ విధంగా లేవు.
సాంకేతిక వర్గం
పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్ మక్కీకి మక్కీ దించేశారు. లిప్ సింక్ కోసం సాహిత్యం రాశారు. అద్భుతంగా ఉన్నప్పటికీ హిందీ పాట విన్నట్లుగానే ఉంటుంది. కెమెరా పనితనం బాగుంది. సంభాషణలు సోసోగా సాగాయి. నిర్మాణ విలువలు మాత్రం అదిరిపోయాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
క్లాసిక్ అన్న దగ్గ చిత్రాలు కొన్ని ఉంటాయి. వాటిలో 'ఆషికి 2' ఒకటి. మంచి ఫీల్ తో సాగే ఈ చిత్రం గత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నారనగానే.. 'హిందీ రేంజ్ లో ఉంటుందా' అనే సందేహం చాలామందికి కలిగింది. హిందీకన్నా బాగా వచ్చిందని బండ్ల గణేష్, సచిన్ చెప్పుకుంటూ వచ్చారు. ఫలితంగా భారీ అంచనాలే నెలకొన్నాయి. కానీ, ఆ అంచనాలను చేరుకునే విధంగా ఈ చిత్రం లేదు. సినిమా రిచ్ గా, కలర్ ఫుల్ గా ఉంటే మాత్రం సరిపోదు. ముఖ్యంగా ఇలాంటి లవ్ సబ్జెక్ట్ లకు హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ర్టీ కుదరాలి. హిందీ వెర్షన్ కు ప్లస్ అయ్యింది హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అయితే... తెలుగు వెర్షన్ లో ఇదే లోపించడం యూత్ ని నిరాశపరుస్తుంది. ఈ సినిమా పూర్తిగా యూత్ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ తో రూపొందింది. వారికి కనెక్ట్ అయ్యే అంశాలు ఈ చిత్రంలో లోపించడం సినిమాకి చాలా మైనస్. ఎంత భారీ బడ్జెట్ తో సినిమా తీసినా ప్రేక్షకులను ఇన్ వాల్వ్ చేయలేకపోతే బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఈ సినిమా విషయంలో ఇదే జరిగింది.
ఫైనల్ గా చెప్పాలంటే.. 'ఆషికి 2'కి మక్కీకి మక్కీగా దించిన ఈ చిత్రం బాలీవుడ్ మేజిక్ ని రిపీట్ చేయదు. డబ్బింగ్ సినిమా లుక్ లో కనిపించే ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే అవకాశం లేదు.