చిత్రం - పాఠశాల
బ్యానర్ - మూన్ వాటర్ పిక్చర్స్
నటీనటులు - సాయి రోనక్, అనుప్రియ , నందు, శిరీష, హమూద్, శశాంక్,నరసింహరాజు, కృష్ణ భగవాన్, ఎల్బీ శ్రీరాం, తదితరులు
సంగీతం - రాహుల్ రాజ్
ఎడిటింగ్ - శ్రవణ్.కె
సినిమాటోగ్రఫి - సుధీర్ సరేంద్రన్
నిర్మాతలు - రాకేశ్ మహంకాళి, పవన్ కుమార్ రెడ్డి
రచన & దర్శకత్వం: మహి.వి. రాఘవ్
విడుదల తేదీ - 10.10.2014
'వినాయకుడు' చిత్రం ద్వారా రైటర్ గా పరిచయం అయిన మహి.వి.రాఘవ్ మూన్ వాటర్ పిక్చర్స్ బ్యానర్ స్థాపించి 'విలేజ్ లో వినాయకుడు', 'కుదిరితే కప్పు కాపీ' సినిమాలను నిర్మించి టేస్ట్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తాజాగా ఇదే బ్యానర్ పై రూపొందిన 'పాఠశాల' చిత్రానికి మెగా ఫోన్ పట్టుకుని డైరెక్టర్ గా తన సత్తా చాటుకోవడానికి వచ్చారు మహి.వి.రాఘవ్. 5గురు ఫ్రెండ్స్ కలిసి చేసిన ఓ జర్నీ వారి జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొచ్చిందనే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు మహి. ఈ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ఈ రోజు (10.10.2014) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోషల్ మీడియా ద్వారా వెరైటీ పబ్లిసిటీతో ఈ సినిమాని ప్రేక్షకుల వరకూ రీచ్ అయ్యేలా చేసారు. ట్రైలర్స్, పబ్లిసిటీ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ సినిమా ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
సూర్య(శివ), రాజు(నందు), ఆది(సాయి కిరణ్), సాల్మా(శిరీష), సంధ్య(అనుప్రియ) ఈ ఐదుగురు మంచి ఫ్రెండ్స్.బిటెక్ పూర్తి చేసిన వీరు తమ ప్రిన్సిపాల్ సలహా మేరకు అందరూ కలిసి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి కొన్ని రోజులు గడపాలనుకుంటారు. అలా వెళ్లిన ఈ స్నేహితులు నాలుగేళ్లుగా తెలిసిన స్నేహితులు గురించి తెలీని ఎన్నో విషయాలను తెలుసుకుంటారు. తమ స్నేహితులనే ఈ జర్నీ కొత్తగా చూపిస్తుంది. పదహారేళ్లు చదువుకున్నప్పుడు నేర్చుకోని పాఠాలు, ఆ ఒక్క ప్రయాణంలో నేర్చుకుంటారు. ఈ ప్రయాణం ఆ ఐదుగురుకీ నేర్పించిన పాఠాలే ఈ పాఠశాల కథ.
నటీనటులు పెర్ఫార్మన్స్
ఈ సినిమాలో ఐదుగురు మెయిన్ రోల్ చేసారు. ఈ ఐదు పాత్రల్లో ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే పాత్ర రాజు. ఈ రాజు పాత్రను నందు చేసాడు. ఎంటర్ టైన్ మెంట్ గా ఉండే ఈ పాత్రను నందు బాగా చేసాడు. ఈ సినిమా నందుకు మంచి పేరు తెచ్చిపెడుతుంది. ఈ కథను ఆడియన్స్ కి చెప్పే సూర్య పాత్రను శివ చేసాడు. తను కూడా మంచి నటుడు. తన బాధను మనసులోనే దిగమింగుకుని, పైకి కూల్ గా కనిపించే ఆది పాత్రలో సాయికిరణ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాడు. సాల్మా పాత్ర చేసిన శిరీష, మోడ్రన్ గర్ల గా నటించిన అనుప్రియ చూడటానికి బాగున్నారు. ఎల్బీ శ్రీరాం, కృష్ణభగవాన్, నరసింహరాజు తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక నిపుణులు
ఈ సినిమాకి హైలెట్ సినిమాటోగ్రఫీ. లొకేషన్స్ చాలా బాగున్నాయి.అందమైన లొకేషన్స్ ని అద్భుతంగా తెరకెక్కంచి విజువల్ ఫీస్ట్ లా చేసారు కెమెరామ్యాన్ సుధీర్ సరేంద్రన్. రాహుల్ రాజ్ అందించిన పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. ఎమోషనల్ సీన్స్ ని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో బాగా ఎలివేట్ చేసారు మ్యూజిక్ డైరెక్టర్. సెకండాఫ్ ఎడిటింగ్ కొంచెం షార్ప్ గా చేసుంటే సినిమా ఇంకా బాగుండేది. మహి తీసుకున్న స్టోరీ లైన్ చాలా బాగుంది. ప్రెష్ ఫీల్ ని కలుగజేస్తుంది. స్ర్కీన్ ప్లే విషయంలో ఇంకొంచెం జాగ్రత్త తీసుకుని ఉంటే సినిమా ఇంకా బాగుండేది. తొలిసారి డైరెక్షన్ చేస్తున్నప్పటికీ, మహి ఎక్కడా తడబడలేదు. తను చెప్పాలనుకున్న పాయింట్ ని ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా చేయడంతో విజయం సాధించారు. ఈ ఫీల్ గుడ్ మూవీకి కొన్ని కమర్షియల్ పాయింట్స్ ని యాడ్ చేయాలని చూసారు కానీ, అవి ఆకట్టుకునే విధంగా లేవు. నిర్మాణపు విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
గోదావరి అందాలు, వైజాగ్ లోని అందమైన లొకేషన్స్ ప్రేక్షకులను సినిమాలో లీనమయ్యేలా చేసాయి. చిన్న పిల్లవాడి డ్యాన్సింగ్ ఎపిసోడ్ యూనిక్ ఐడియా. ఈ ఎపిసోడ్ సెంటిమెంటల్ గా కూడా వర్కవుట్ అవుతుంది. సెకండాఫ్ లో వచ్చే శశాంక్ పాత్ర సినిమాకి టర్నింగ్ పాయింట్. ప్రేక్షకులు ఊహించని ఈ టర్నింగ్ పాయింట్ బాగుంది. సూర్య పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. క్లయిమ్యాక్స్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. కానీ ఫస్టాప్ ఎంజాయ్ చేసినంతగా సెకండాఫ్ ని ప్రేక్షకలు ఎంజాయ్ చేయలేరు. సెకండాఫ్ లో ఎక్కువ సెంటిమెంట్, ఎమెషన్స్ ఉండటం వల్ల సినిమా స్లో అయినట్టు అనిపిస్తుంది. ఫస్టాప్ లో ఉన్న ఎంటర్ టైన్ మెంట్, జోష్ సెకండాఫ్ లో తగ్గిపోవడం వల్ల ప్రేక్షకులు బోర్ ఫీలయ్యే అవకాశం ఉంది. అయితే రెగ్యులర్ కి భిన్నంగా ఉండే సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు. ముఖ్యంగా యూత్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. రెగ్యులర్ మాస్ మసాలా సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.
ఫైనల్ గా చెప్పాలంటే...
కాలేజ్ డేస్, ఫ్రెండ్స్ అంటే ఈ వయసు వారినైనా ఆకట్టుకునే అంశమే కాబట్టి... యూత్ మాత్రమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని చూసి ఎంజాయ్ చెయ్యొచ్చు.