చిత్రం - పిల్లా నువ్వులేని జీవితం
నటీనటులు - సాయిధరమ్ తేజ్, రెజీనా, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, రఘు బాబు, దువ్వాసి మోహన్, రజిత, సత్య కృష్ణ, సురేఖ వాణి తదితరులు
మాటలు - డైమండ్ రత్నం
పాటలు - సిరివెన్నెల సీతారామశాస్త్రి , చంద్రబోస్, అశోక్ తేజ్, శ్రీమణి
సంగీతం - అనూప్ రూబెన్స్
కెమెరా : దాశరధి శివేంద్ర
ఆర్ట్ : రమణ వంక
ఎడిటింగ్ : గౌతంరాజు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సత్య
నిర్మాతలు - బన్నీ వాసు, శ్రీ హర్షిత్
కథ, స్ర్కీన్ ప్లే, మాటలు, దర్శకత్వం - ఏ.ఎస్ .రవి కుమార్ చౌదరి
విడుదల తేదీ - 14.11.2014
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా ఆరంభమైన తొలి చిత్రం 'రేయ్'. వై.వి.యస్.చౌదరి స్వీయదర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఇప్పటివరకూ విడుదలకు నోచుకోలేదు. కానీ ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ సాయిధరమ్ తేజ్ లో విషయం ఉందని జనాలు అనుకునేలా చేసాయి. తొలి సినిమా విడుదలవ్వక నిరాశలో ఉన్న సాయిధరమ్ తేజకు వచ్చిన రెండో అవకాశం 'పిల్లా నువ్వులేని జీవితం'. ఈ సినిమాని అల్లు అరవింద్, దిల్ రాజు సమర్పణలో బన్నీ వాస్, శ్రీ హర్షిత్ కలిసి నిర్మించారు. దాంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఇక ఏకంగా ఈ సినిమాలో రెజీనా కథానాయికగా నటించింది. 'యజ్ఞం'లాంటి సూపర్ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించిన ఎ.ఎస్.రవికుమార్ చౌదరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ సినిమా పోస్టర్స్, ట్రైలర్స్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇన్ని ప్లస్ పాయింట్స్ తో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకునే విధందా ఉందా? మెగా మేనల్లుడు తొలి సినిమాతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటాడా తదితర విషయాలు తెలుసుకుందాం.
కథ
లైఫ్ ని ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ తిరిగే కుర్రాడు శీను (సాయిధరమ్ తేజ్). ఇలా తిరిగే శీనుకి శైలు (రెజీనా కసాండ్ర) కంట పడుతుంది. ఆమెను చూసిన వెంటనే ప్రేమలో పడిపోయిన శీను తన వెనకాల పడుతూ ప్రపోజ్ చేస్తుంటాడు. కానీ శైలు మాత్రం శీను ప్రేమను తిరస్కరిస్తుంటుంది. అయినా సరే వదలకుండా, శైలు వెనక పడతాడు శీను. అలాంటి టైంలో శైలూని చంపడానికి మైసమ్మ, కొంతమంది రౌడీలు ట్రై చేస్తుంటారు. ఈ విషయం శీను తెలుసుకుని వారి బారి నుంచి శైలూని కాపాడటానికి రకరకాల ఎత్తులు వేస్తాడు. ఫైనల్ గా శైలూని ఆ రౌడీల బారి నుంచి శీను తప్పించగలిగాడా? అసలు శైలూని రౌడీలు ఎందుకు చంపాలనుకున్నారు తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటులు పెర్ ఫామెన్స్
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు అనే ట్యాగ్ ని తగిలించుకుని 'పిల్లా నువ్వులేని జీవితం' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సాయిధరమ్ తేజ్. దాంతో మెగాఅభిమానులు, చిత్ర పరిశ్రమకు చెందినవారు, కామన్ ఆడియన్స్ దృష్టి సాయిధరమ్ తేజ్ పై ఉంటుంది. శీనుగా ఓ బ్యాచిలర్ లైఫ్ గడిపే కుర్రాడిగా సాయిధరమ్ తేజ్ నటన ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. ఇక సాయిధరమ్ తేజ్ డ్యాన్సులు ఎలా చేస్తాడా అని కూడా అందరూ ఆసక్తిగా ఎదురు చూసారు ఆ విషయంలోనూ ఆడియన్స్ ని మెప్పించాడు. అయితే లుక్ పరంగా, ఎక్స్ ప్రెషన్స్ పరంగా ఇంకా మెరుగుపరుచుకుంటే సాయిధరమ్ తేజ్ కు మంచి భవిష్యత్తు ఉంటుంది. శైలు పాత్రకు పూర్తి న్యాయం చేసింది రెజీనా. ఈ సినిమా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చి పెడుతుంది. తన గత సినిమాలతో పోలిస్తే, ఈ సినిమాలో నటన పరంగా కూడా రెజీనాకి ప్లస్ పాయింట్స్ వెయ్యొచ్చు. జగపతిబాబు డిఫరెంట్ రోల్స్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమాలో మైసమ్మగా మంచి సపోర్టివ్ పాత్ర చేసాడు. జగపతిబాబు పెర్ ఫామెన్స్ ఈ చిత్రానికి ప్లస్ పాయింట్. మిగతా నటీనటులందరూ తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
డైరెక్టర్ రవికుమార్ చౌదరి తనలోని ప్రతిభను 'యజ్ఞం' చిత్రంలోనే చూపించాడు. కాకపోతే ఆ తర్వాత చేసిన సినిమాలు రవికుమార్ చౌదరిని వెనక్కి నెట్టేసాయి. మళ్లీ ఈ సినిమా అతనిని ఫామ్ లోకి తీసుకువస్తుంది. ఈ సినిమాలో రెండు ఫ్లాష్ బ్యాక్ లు ఉన్నాయి. వాటిని పర్ ఫెక్ట్ గా తెరకెక్కించాడు డైరెక్టర్. సింఫుల్ పాయింట్ కి చక్కటి స్ర్కీన్ ప్లే ఇవ్వగలిగితే, ప్రేక్షకులను సినిమాలో ఇన్ వాల్వ్ అయ్యేలా చేయడం పెద్ద కష్టం కాదు. ఈ ఫార్మూలాని రవికుమార్ చౌదరి చక్కగా ఉపయోగించుకున్నాడు. డైలాగులు బాగున్నాయి. అనూప్ చక్కటి పాటలిచ్చాడు. పాటల చిత్రీకరణ కూడా బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఖర్చు విషయంలో వెనుకాడలేదు. దాంతో సినిమా చాలా రిచ్ గా ఉంది. సాంకేతిక వర్గం సమిష్టగా వర్క్ చేస్తే, మంచి అవుట్ ఫుట్ వస్తుంది. అది ఈ సినిమాలో కనిపించింది.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఈ సినిమాకి స్ర్కీన్ ప్లే ప్లస్ పాయింట్. ఆ క్రెడిట్ డైరెక్టర్ కి చెందుతుంది. ఎంటర్ టైన్ మెంట్ బాగుంది. సాయిధరమ్ తేజ్, జగపతిబాబు మధ్య సాగే సన్నివేశాలు బాగున్నాయి. అయితే సాయిధరమ్ తేజ్, రెజీనా మధ్య సాగే లవ్ ట్రాక్ ని మాత్రం అంత ఇంప్రెసివ్ గా తెరెకెక్కించలేకపోయారనే ఫీల్ కలుగుతుంది. హీరో క్యారెక్టరైజేషన్ ని పక్కా మాస్ గా క్రియేట్ చేయడం వల్ల బి, సి ఏరియాల వారికి ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. ఆ పరంగా సాయిధరమ్ తేజ్ కి పర్ ఫెక్ట్ ఇంట్రడక్షన్ మూవీ. సెకండాఫ్ లోని ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత ప్రేక్షకులు ఊహించిన విధంగానే సినిమా సాగడం కొంత నిరాశపరిచే విషయం.
ఫైనల్ గా చెప్పాలంటే... మాస్ ప్రేక్షకులను, యూత్ ని బాగా ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్ టైనర్ ఇది.