చిత్రం - పూజ
నటీనటులు - విశాల్, శృతిహాసన్, సత్యరాజ్, రాధిక, ముఖేశ్ తివారి, తదితరులు
సంగీతం - యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ - ప్రియన్
ఎడిటింగ్ - వీటీ విజయన్
నిర్మాత - విశాల్
దర్శకత్వం - హరి
విడుదల తేదీ - 22.10.2014
విశాల్ తెలుగు వాడైనప్పటికీ, వీరి కుటుంబం చెన్నయ్ లో సెటిలయ్యింది. అయినా సరే విశాల్ చక్కగా తెలుగు మాట్లాడగలడు. తమిళంలో హీరోగా పరిచయం అయ్యి, అక్కడ స్టార్ హీరోల జాబితాలో చేరిపోయి క్రేజీగా కెరియర్ కొనసాగిస్తున్నాడు. తను చేసే ప్రతి చిత్రం తెలుగులో డబ్ అయ్యేలా చూసుకుంటున్నాడు విశాల్. తెలుగు వెర్షన్ కోసం తనే స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు. తెలుగు మార్కెట్ ను పెంచుకునే దిశగా విశాల్ అడుగులు వేస్తున్నాడు. ఈ యేడాది స్ర్టయిట్ తెలుగు సినిమా చేయబోతున్నాడు. తాజాగా తను నటిస్తూ, నిర్మించిన 'పూజ' చిత్రాన్ని కోలీవుడ్ లో విడుదలైన రోజునే టాలీవుడ్ లో కూడా సొంతంగా విడుదల చేసాడు విశాల్. పక్కా యాక్షన్ ఓరియంటెడ్ చిత్రాలకు దర్శకత్వం వహించే హరి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. విశాల్ సరసన శృతిహాసన్ కథానాయికగా నటించింది. దాంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఆ అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఉందా అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
మార్కెట్లో వ్యాపారులకు వడ్డీకి డబ్బులు ఇస్తూ, గడిపేస్తుంటాడు వాసు (విశాల్). అదే మార్కెట్లో ఓ గ్యాంగ్ ని మెయింటెన్ చేస్తాడు. అక్కడే దివ్య (శృతిహాసన్)ను చూసి ప్రేమలో పడతాడు వాసు. తన ప్రేమను దివ్యకు చెబుతాడు. అప్పటివరకూ వాసు అండ్ గ్యాంగ్ తో బాగానే మాట్లాడే దివ్య, తనపై ప్రేమను వ్యక్తపరిచిన వాసును అవమానపరుస్తుంది. దాంతో వాసు గ్యాంగ్ కి చెందిన కమెడీయన్ వాసు బ్యాక్ గ్రౌండ్ గురించి చెబుతాడు. వాసు ఎందుకు తన కుటుంబానికి దూరంగా ఉంటున్నాడనే విషయం తెలుసుకున్న దివ్య అతనిని ప్రేమించడం మొదలుపెడుతుంది. అసలు వాసు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ? వాసు తన కుటుంబంతో కలుస్తాడా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
యాక్షన్ సినిమాల్లో ఒదిగిపోవడం విశాల్ కి పెద్ద కష్టమేం కాదు. అతని గత చిత్రాలు 'పందెం కోడి', 'భరణి' చిత్రాలు ఈ విషయాన్ని నిరూపించాయి. 'పూజ'లో కూడా వాసు ఇలాంటి పాత్రే చేసాడు. యాక్షన్ సీన్లనీ చాలా ఈజ్ గా చేసాడు. ఎమెషన్స్ సీన్స్ పెద్దగా లేవు. శృతిహాసన్ గ్లామర్ గా ఉంది. నటించడానికి పెద్ద స్కోప్ లేదు. రాధిక, సత్యరాజ్ పాత్రలకు పెద్దగా ఇంపార్టెన్స్ లేదు. వారి పాత్రల పరిధి మేరకు నటించారు. కేవలం భారీ స్టార్ కాస్టింగ్ కోసం మాత్రమే వీరిని తీసుకున్నారనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖేష్ తివారీది రొటీన్ విలన్ రోల్. సూరి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. తన కామెడీ పెర్ ఫామెన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇతర నటీనటులు తమ పాత్రల పరిధిమేరకు నటించారు.
సాంకేతిక వర్గం
సింఫుల్ స్టోరీ లైన్ ని తీసుకుని, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లేతో ప్రేక్షకులను కట్టిపడేయడం డైరెక్టర్ హరికి బాగా తెలుసు. ఈ సినిమా కూడా అలానే ఉంది. కాకపోతే సింఫుల్ స్టోరీ లైన్ తీసుకున్న హరి, ఆసక్తికరమైన స్ర్కీన్ ప్లే చేయడంలో మాత్రం ఈ సినిమా పరంగా ఫెయిల్ అయ్యాడనే చెప్పాలి. కొన్ని సీన్లు తన మార్క్ లాగా అనిపించినా, చాలా సీన్లు మాత్రం బోర్ తెప్పించాయి.యువన్ శంకర్ రాజా అందించిన పాటలు ఫర్వాలేదు. విజువల్ గా కొన్ని పాటలు బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ కొన్నిబోర్ అనిపించాయి. కొన్ని కామెడీ పంచ్ లు బాగున్నాయి. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయి. ఫస్టాప్ బోర్ కొట్టకుండా తర్వగా పూర్తయినట్టు అనిపిస్తుంది. విశాల్ ఈ చిత్రానికి హైలెట్. కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి. స్ర్కీన్ ప్లే, సెకండాఫ్, విలన్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్. విలన్ క్యారెక్టరైజేషన్ మరింత బెటర్ గా చేసి ఉంటే బాగుండేది. హీరోకి సమఉజ్జీ అయినప్పుడే విలన్ పాత్ర పండుతుంది. ఆ పరంగా విలన్ పాత్ర ఈ సినిమాకి మైనస్. సత్యరాజ్, రాధిక పాత్రలను ఇంకా బాగా తీర్చిదిద్ది ఉంటే బాగుండేది.
ఫైనల్ గా చెప్పాలంటే...
పక్కా మాస్ యాక్షన్ చిత్రాలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చుతుంది. అంతకు మినహా ఈ సినిమా గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీలేదు.