చిత్రం - పవర్
నటీనటులు - రవితేజ, హన్సిక, రెజీనా, ముఖేష్ రుషి, సంపత్, బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, సప్తగిరి, ప్రకాష్ రాజ్, అజయ్, సుబ్బరాజు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ - యస్.తమన్
కెమెరా - జయనన్ విన్సెంట్
ఎడిటింగ్ - గౌతంరాజు
నిర్మాత - రాక్ లైన్ వెంకటేష్
దర్శకత్వం - కె.యస్.రవీంద్ర
'బలుపు' లాంటి హిట్ చిత్రం తర్వాత మాస్ మహరాజా రవితేజ చేసిన చిత్రం 'పవర్'. 'బలుపు' చిత్రానికి డైలాగ్ రైటర్ గా వ్యవహరించి, ప్రేక్షకుల మన్ననలు అందుకున్న రైటర్ బాబి (కె.రవీంద్ర) ఈ చిత్రం ద్వారా డైరెక్టర్ గా పరిచయమయ్యారు. కన్నడంలో పలు చిత్రాలు నిర్మించి పాపులార్టీ సంపాదించుకున్న రాక్ లైన్ వెంకటేష్ తొలిసారి టాలీవుడ్ లోకి అడుగుపెట్టి రవితేజతో ఈ చిత్రాన్నినిర్మించారు. హన్సిక, రెజీనా కథానాయికలుగా నటించారు. రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్రను ఈ సినిమాలో చేసారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టు ఈ చిత్రం ఉందా? అనే విషయాన్ని తెలుసుకుందాం.
కథ
బల్దేవ్ (రవితేజ) కరెప్టెడ్ పోలీసాఫీసర్. కానీ చాలా డేరింగ్ అండ్ డ్యాషింగ్. కోల్ కత్తాని రౌడీయిజంతో గుప్పెట్లో పెట్టుకున్న గుంగూలీ భాయ్ (సంపత్)ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. అతనిని కోర్టుకు తీసుకెళ్లకుండా ఏసీపీ బల్దేవ్ తన టీమ్ సహాయ్, రాజీవ్, కుందన్ తో కలిసి అడ్డంపడతాడు. గంగూలీ భాయ్ ని ఎస్కేప్ చేసి, అతనిని అండర్ గ్రౌండ్ లోకి తీసుకెళ్లిపోతారు. ఈ క్రమంలో బల్దేవ్ చనిపోతాడు.
హైదరాబాద్ లో పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుకంటూ, అందుకోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాడు తిరుపతి (రవితేజ). కానీ అతను చేసే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటాయి. కోల్ కత్తా హోం మినిస్టర్ జయవర్ధన్ (ముకేష్ రుషి) ఓ రోజు బల్దేవ్ సహాయ్ పోలీకలతో ఉన్న తిరుపతిని చూస్తాడు. తిరుపతితో మాట్లాడి అండర్ గ్రౌండ్ లో ఉన్న గంగూలీ భాయ్ ని పట్టుకోవడానికి బల్దేవ్ సహాయ్ ప్లేస్ లో తిరుపతిని పంపిస్తాడు.
మరి గుంగూలీ భాయ్ ని తిరుపతి పట్టుకోగలిగాడా? బల్దేవ్ చనిపోలేదా? అతనే తిరుపతిగా వచ్చాడా? బల్దేవ్ నిజంగానే అవినీతి అధికారియా? లేక అతను అవినీతి చేయడానికి బలమైన కారణం ఉందా? తదితర విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఈ చిత్రంలో రవితేజ రెండు షేడ్స్ ఉన్న పాత్ర చేసాడు. తిరుపతి పాత్ర పక్కా మాస్ గా ఉంది. ఈ పాత్రను తనదైన శైలిలో, పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టాడు రవితేజ. ఈ పాత్రను ప్రేక్షకులు ఫుల్లుగా ఎంజాయ్ చేస్తారు. ఇక రెండో షేడ్ ఉన్న పాత్ర లంచగొండిగా కనిపించే పోలీసాపీసర్ పాత్ర. ఈ పాత్రను సీరియస్ పెర్ ఫామెన్స్ తో అలరించాడు రవితేజ. ఈ రెండు షేడ్స్ ఉన్న పాత్రలను ఎనర్జిటిక్ గా చేసి రవితేజ మరోసారి తన సత్తా చాటుకున్నాడు. ఈ చిత్రంలో హన్సిక, రెజీనా కథానాయికలుగా నటించారు. అందచందాలు పరంగా ఇందులో రెజీనాకి ఎక్కువ మార్కులు పడతాయి. రవితేజతో రెజీనా కెమిస్ట్రీ బాగుంది. గ్లామర్ గా కనిపించడంతో పాటు పెదవి ముద్దు సీన్ చేసి కుర్రకారును గిలిగింతలు పెట్టింది. రెజీనా కనిపించేది ప్లాష్ బ్యాక్ లో మాత్రమే. హన్సిక నాలుగైదు సీన్లు, నాలుగు పాటలకు మాత్రమే పరిమితమయ్యింది. బ్రహ్మానందం ఫస్ట్ హాఫ్ లో రవితేజ కాంబినేషన్ లో చేసిన సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే విధంగా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్, సప్తగిరి, ప్రకాష్ రాజ్, సంపత్, ముకేష్ రుషి, అజయ్, సుబ్బరాజు తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
ఈ సినిమా స్టోరీ లైన్ 'ఆపరేషన్ దుర్యోధన'ను పోలి ఉంటుంది. కొంచెం 'విక్రమార్కుడు' తరహాలో కూడా ఉంది. ఇప్పటివరకు పలు విజయవంతమైన కథలు అందించిన బాబీ.. మరి... ఈ చిత్రకథ ఎంపిక చేసుకునే విషయంలో ఎక్కడ తప్పటడుగు వేశాడో? తనకే తెలియాలి. తను చెప్పాలనుకున్న పాయింట్ ని కరెక్ట్ గా చెప్పలేక తడబడ్డాడు. స్ర్కీన్ ప్లే కూడా అంత ఆసక్తికరంగా లేదు. ఫస్టాఫ్ ఫర్వాలేదు. సెకండాఫ్ మాత్రం భరించలేని విధంగా ఉంది. పైగా.. క్లయిమాక్స్ లో విలన్లతో లుంగీ డాన్స్ చేయించడం చిరాకు తెప్పించింది. వాస్తవానికి అది ఏ ఫస్టాఫ్ లోనే ఉండి ఉంటే ఎంజాయ్ చేసే ఆస్కారం ఉండేది. జయనన్ విన్సంట్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. విజువల్ గా సినిమా చాలా రిచ్ గా ఉంది. తమన్ అందించిన పాటలు రొటీన్ రొడ్డకొట్టుడు అనే చెప్పాలి. సాంగ్స్ పిక్చరైజేషన్ కూడా బాగుంది. కోన వెంకట్ ప్రాస మీద దృష్టి పెట్టాడే తప్ప... కథకు తగ్గట్టు డైలాగులు రాయలేదు. కొన్ని పంచ్ డైలాగులు మాత్రమే బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం యావరేజ్ గా ఉంది. యాక్షన్ ఎపిసోడ్స్ బాగున్నాయి. ఆ క్రెడిట్ రామ్-లక్ష్మణ్ కే దక్కుతుంది. ఎడిటర్ గౌతంరాజు సెకండాఫ్ లెంగ్త్ తగ్గించి ఉంటే బాగుండేది. రాక్ లైన్ వెంకటేష్ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా సినిమాని నిర్మించారు. ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
రైటర్ గా సక్సెస్ అయిన బాబీకి దర్శకునిగా ఈ చిత్రం చేదు అనుభవాన్నే మిగులుస్తుందని చెప్పొచ్చు. తొలి సినిమా కావడం వల్ల కొంచెం తడబడ్డాడు. సినిమా మొత్తం అర్థం అయ్యీ, కానట్లు ఉంది. ఒకవేళ మహా మహా మేధావులకు అయితే అర్థం అవుతుందేమో. సెకండాఫ్ ఈ సినిమాకి చాలా మైనస్. చాలా సీన్లు కొన్ని సినిమాలను చూసి కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది. ఓవరాల్ గా
చెప్పాలంటే... సినిమా చూసి బయటికొచ్చేసరికి మన పవర్ ని ఎవరో లాగేసినట్లు అనిపిస్తుంది.