చిత్రం - రభస
నటీనటులు - ఎన్టీఆర్, సమంత, ప్రణీత, జయసుధ, నాజర్, నాగినీడు, జయప్రకాష్ రెడ్డి, అజయ్, బ్రహ్మానందం, సురేఖావాణి, అలీ తదితరులు
సంగీతం - తమన్
కెమెరా - శ్యామ్ కె. నాయుడు
ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు
సమర్పణ - బెల్లంకొండ సురేష్
నిర్మాత - బెల్లంకొండ గణేష్
మాటలు, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సంతోష్ శ్రీనివాస్.
హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ లో నటించడం ఎన్టీఆర్ కి చాలా తేలిక. ఆ విషయాన్ని రెండు పదుల వయసు దాటక ముందే 'ఆది' ద్వారా నిరూపించుకున్నాడు. ఆ చిత్రంతో మంచి మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కూడా దాదాపు హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ కే పరిమితం కావాల్సి వచ్చింది. 'బృందావనం'తో తన ఇమేజ్ కి భిన్నంగా చేసి, భేష్ అనిపించుకున్నాడు. కానీ, తన నుండి యాక్షన్ ఎంటర్ టైనర్సే ఎదురు చూస్తారు కాబట్టి, ఎక్కువగా ఈ తరహా చిత్రాలకు పరిమితం అవుతున్నాడు. ఈ కోవలో చేసిన చిత్రమే 'రభస'. మరి.. ఎన్టీఆర్ చేసిన గత మాస్ చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉందా? తన కెరీర్ కి ఇదెలాంటి సినిమా అవుతుంది? 'కందిరీగ' తర్వాత సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అతనికి మరో విజయానందాన్ని కలిగిస్తుందా? 'ఆది'వంటి బంపర్ హిట్ తర్వాత ఎన్టీఆర్ తో బెల్లంకొండ సురేష్ తీసిన ఈ చిత్రం అతని బేనర్లో చెప్పకోదగ్గ చిత్రం అవుతుందా?... తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ సమీక్ష.
కథ
కార్తీక్ (ఎన్టీఆర్) తన తల్లి (జయసుధ) కోరిక నెరవేర్చడానికి అత్త కూతురు ఇందు (సమంత)ను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. కానీ, కార్తీక్, ఇందు చిన్నతనంలోనే ఈ రెండు కుటుంబాల మధ్య ఏర్పడిన శత్రుత్వం సంవత్సరాలు పెరిగినా తగ్గదు. ఈ నేపథ్యంలో ఇందూని కలవడానికి వెళతాడు కార్తీక్. పెద్దయ్యాక తనెలా ఉంటుందో అతనికి తెలియదు. దాంతో భాగ్యం (ప్రణీత)ని చూసి, తనే ఇందూ అనుకుని ప్రేమలో పడిపోతాడు. ఆ తర్వాత అసలు విషయం తెలిస్తుంది. మరి.. భాగ్యం తో ఎలా బ్రేకప్ అవుతాడన్నది ట్విస్ట్...
మరోవైపు పెద్దిరెడ్డి (జయప్రకాష్ రెడ్డి), గంగిరెడ్డి (నాగినీడు)ల కథ చెప్పాలంటే.. ఈ ఇద్దరూ బావా, బావమరుదులు. పెద్దిరెడ్డి కొడుకు, గంగిరెడ్డి కూతురికి... గంగిరెడ్డి కొడుకు, పెద్దిరెడ్డి కూతురికి కుండ మార్పిడి పెళ్లి ఖరారవుతుంది. కానీ, అల్రెడీ ఒక అబ్బాయితో ప్రేమలో ఉన్న గంగిరెడ్డి కూతురు, ఎలాగైనా తన ప్రియుడ్ని కలుసుకోవాలనుకుంటుంది. పెళ్లి మండపం నుంచి ఆమెను తప్పించే బాధ్యతను స్నేహితురాలు ఇందూ తీసుకుంటుంది. ఎవరి సహాయం కోరాలో తెలియక ఓ నంబర్ కి ఫోన్ చేస్తుంది. అదో మెకానిక్ ఫోన్. కాల్ వచ్చిన సమయంలో అది కార్తీక్ చేతిలో ఉండటంతో లిఫ్ట్ చేస్తాడు. ప్రేమికులను కలపమని ప్రాధేయపడుతుంది ఇందు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలనే సంకల్పంతో నాగినీడు కూతుర్నిచాకచక్యంగా కళ్యాణ మండపంలోంచి ఎస్కేప్ చేయించి, ఆమె లవర్ తో పెళ్లి చేస్తాడు. కానీ, ఇదంతా చేసింది కార్తీక్ అని ఇందూకి, తనకు ఫోన్ చేసింది ఇందూయే అని కార్తీక్ కి తెలియదు. ఇదో ట్విస్ట్.
అనుకోని పరిస్థితుల్లో కార్తీక్, ఇందు పెద్దిరెడ్డి ఇంట్లో ఆతిథ్యం పొందుతారు. తాను గంగిరెడ్డి కూతుర్ని పెళ్లి పీటల మీద నుంచి తీసుకుపోవడంవల్ల పెద్దిరెడ్డి కూతురి వివాహం ఆగిపోయిందని తెలిసి బాధపడతాడు కార్తీక్. దాంతో గంగిరెడ్డి కుటుంబాన్ని ఒప్పించి, వాళ్లబ్బాయికి, పెద్దిరెడ్డి కూతురికి పెళ్లి చేయాలనుకుంటాడు కార్తీక్. ఇదో ట్విస్ట్..
మరి.. తను అనుకున్నట్లుగానే కార్తీక్ పెళ్లి చేయగలిగాడా? అమ్మ కోరిక తీర్చడానికి ఇందూని పెళ్లి చేసుకోగలుగుతాడా? కేవలం ఫోన్లో అభ్యర్ధించిన మీదట తనకు పరిచయం లేనివాళ్లని ఆదుకున్న కార్తీక్ నే పెళ్లి చేసుకోవాలనుకునే ఇందూ ముందు ఓ డూప్లికేట్ కార్తీక్ని ప్రవేశపెట్టిన ఆమె తండ్రి (షయజీ షిండే).. తను అనుకున్నట్లు కార్తీ్క్, ఇందూని కలవకుండా చేయగలిగాడా?.. ఇలా పలు మలుపులతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
నటనపరంగా ఎన్టీఆర్ మరోసారి విజృంభించిన చిత్రం ఇది. డాన్సులు, ఫైట్లు, సెంటిమెంట్ సీన్లు... ఒకటేంటి.. అన్నింటినీ బాగా పండించాడు. చాలా హ్యండ్ సమ్ గా, స్టయిలిష్ గా కూడా ఉన్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజాల మీద నడిపించాడు. సమంత పాత్ర గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. పైగా.. ఓ పాటలో వేసుకున్న కురచ దుస్తుల్లో ఎబ్బెట్టుగా అనిపించింది. తను పక్కా మాస్ హీరోయిన్ అనిపించుకోవాలనే తాపత్రయం సమంతకు ఉన్నట్లుంది. కానీ, తనకు ఊర మాస్ అస్సలు నప్పదు. ప్రణీత సోసోగా ఉంది. ఇతర నటీనటులు పాత్రల పరిధి మేరకు చేశారు.
సాంకేతికంగా...
కెమెరా పనితనం సూపర్బ్. తమన్ స్వరపరచిన పాటలు ఎక్కడో విన్నట్లుగా అనిపిస్తాయి. పాటల మోత భరించలేని విధంగా ఉంది. రీ-రికార్డింగ్ కూడా అలానే ఉంది. ఎడిటింగ్ బాగుంది. సంభాషణలు అక్కడక్కడా బాగున్నాయి. దర్శకుడు పని తీరు గురించి చెప్పడానికి ఏమీ లేదు. రోటీన్ కథను తీసుకుని, కొత్తగా చెప్పడానికి ట్రై చేసాడు. టేకింగ్ కూడా కొత్తగా అనిపించదు. సెకండాఫ్ లో ఎన్టీఆర్, బ్రహ్మానందం మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఎన్టీఆర్ లాంటి దమ్మున్న నటుడితో ఓ మంచి కథతో సినిమా తీసి ఉంటే అతని కెరీర్ కి హెల్ప్ అయ్యేది. ఎన్టీఆర్ కష్టంలో ఏ మాత్రం లోపం లేదు. ఫస్టాఫ్ బాగానే ఉన్నట్లనిపిస్తుంది. సెకండాఫ్ నిడివి ఎక్కువైందనే ఫీలింగ్ కలగక మానదు. పరమ రొటీన్ కథ. ఆ రొటీన్ కథను కొన్ని జిమ్మిక్స్, ట్విస్ట్ లతో ఇంట్రస్టింగ్ గా స్ర్కీన్ ప్లే సమకూర్చడానికి తాపత్రయపడ్డాడు సంతోష్ శ్రీనివాస్. కానీ ట్విస్ట్ లు ఎక్కువైతే ఆడియన్స్ ఎంజాయ్ చేయడానికి బదులు, ఆ ట్విస్ట్ ల గురించి ఆలోచించి అలసిపోతారు. ఈ సినిమా ట్విస్ట్ ల విషయంలో ఆడియన్స్ ఇలాంటి ఇబ్బందినే ఎదుర్కొంటారు. టేకింగ్ కూడా కొన్ని చిత్రాలకు జిరాక్స్ లా అనిపిస్తుంది. ఫస్టాప్ బాగుందనుకునే ఆడియన్స్ సెకండాఫ్ విషయంలో మాత్రం అసంతృప్తి పడతారు.
ఫైనల్ గా చెప్పాలంటే... ఇది ఊర మాస్ ఎంటర్ టైనర్. బి,సి, ఏరియాలవాళ్లకి నచ్చితే పండగే. వాళ్లు కూడా రొటీన్ స్టోరీ అని ఫీలైతే.. దండగే.