చిత్రం - రఫ్
బ్యానర్ - శ్రీదేవి ఎంటర్ టైన్ మెంట్స్
సమర్పణ - ఎమ్.సుదర్శనరావు మాధవరం
నటీనటులు - ఆది, రకుల్ ప్రీత్ సింగ్, శ్రీహరి (ప్రత్యేక పాత్రలో), తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాధ్, జయప్రకాష్ రెడ్డి, రఘుబాబు, సుప్రీత్, అజయ్, కృష్ణభగవాన్, శివారెడ్డి, సుహాసిని, అదుర్స్ రఘు, పవిత్రా లోకేష్ తదితరులు
మాటలు - మరుధూరి రాజా,
పాటలు - భాస్కర భట్ల
ఫైట్స్ - రామలక్ష్మణ్
ఎడిటర్ - మార్తాండ్ .కె.వెంకటేష్
డి.ఓ.పి - కె. కె.సెంధిల్ కుమార్, అరుణ్ కుమార్
సంగీతం - మణిశర్మ
నిర్మాత - ఎమ్.అభిలాష్
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - సి.హెచ్.సుబ్బారెడ్డి
విడుదల తేదీ - 28.11.2014
'ప్రేమ కావాలి', 'లవ్లీ'లాంటి లవ్ స్టోరీస్ తో లవర్ బోయ్ ఇమేజ్ తెచ్చుకున్న ఆది మాస్ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ చేయాలని భావిస్తున్న తరుణంలో కమిట్ అయిన చిత్రం 'రఫ్'. ఈ చిత్రం తనకు కమర్షియల్ హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాడు ఆది. ఈ సినిమా కోసం ఆది సిక్స్ ప్యాక్ కూడా చేసాడు. వరుసగా హిట్ చిత్రాలు చేస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించింది. మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రం ద్వారా సుబ్బారెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యారు. మరి ఆది నమ్మకం 'రఫ్' నిజం చేస్తుందా? తనకు ఈ చిత్రం కమర్షియల్ బ్రేక్ ఇస్తుందా అనే విషయం తెలుసుకుందాం.
కథ
చందు (ఆది) ఓ అనాధ. ప్రేమ అంటే మోసం చేయడం కాదు... ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసుండటం అనే నమ్మకం కల కుర్రాడు చందు. అలాంటి చందుకు తనలానే ఆలోచిస్తున్న నందిని (రకుల్ ప్రీత్ సింగ్) ని కలుస్తాడు. ఆమెను ప్రేమిస్తాడు. అయితే తను ప్రేమించిన విషయాన్ని ముందుగా నందిని కంటే ఆమె అన్నయ్య సిద్ధార్ధ్ (శ్రీహరి)కి చెప్పి ఒప్పించాలనుకుంటాడు చందు. అనుకున్నట్టుగానే సిద్ధార్ధ్ ని కలిసి నందినిని తను ప్రేమిస్తున్న విషయం చెబుతాడు చందు.
సొసైటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ అయిన సిద్ధార్ధ్ కు తన చెల్లెలు నందిని ప్రేమలో పడటం ఇష్టముండదు. ఇందుకోసం చందు ప్రేమలో నందిని పడకుండా రకరకాల ఎత్తులు వేస్తుంటాడు. ఆ ఎత్తులను చిత్తు చేస్తూ, నందిని తనను ప్రేమించేలా చేసుకుంటాడు చందు. అసలు చందు అనాధేనా, చందు, నందిని ప్రేమను సిద్ధార్ధ్ అంగీకరిస్తాడా? చందుకు ఏదైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
నటీనటుల పెర్ ఫామెన్స్
ఆది ఈ సినిమాలో రఫ్ లుక్ కోసం సిక్స్ ప్యాక్ ట్రై చేసాడు. ఈ రఫ్ క్యారెక్టర్ ని ఆది బాగా చేసాడు. డ్యాన్స్ లు, ఫైట్లు కూడా బాగా చేసాడు. ఈ సినిమాలో స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి నటించారు. అన్నయ్యగా అద్భుతంగా నటించారు శ్రీహరి. ముఖ్యంగా శ్రీహరి పాత్రకు డబ్బింగ్ బాగా కుదిరింది. శ్రీహరి పాత్రకు సరిగ్గా డబ్బింగ్ కుదరకపోయి ఉంటే ఈ పాత్రకు చాలా మైనస్ అయ్యుండేది. రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ గా ఉంది. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ని నందిని పాత్రలో బాగా ఆకట్టుకుంటుంది రకుల్. మిగతా నటీనటులందరూ వారి పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
డైరెక్టర్ సుబ్బారెడ్డికి ఇది తొలి సినిమా. కథ రొటీన్ పాయింట్ అయినప్పటికీ, స్క్రీన్ ప్లే బలంగా ఉంటే సినిమా నడక ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విషయంలో డైరెక్టర్ న్యాయం చేయలేకపోయాడు. స్ర్కిఫ్ట్ విషయంలో సుబ్బారెడ్డికి అసలు క్లారటీ లేదు. నటీనటుల దగ్గర్నుంచి సరైన నటన రాబట్టలేకపోయాడు. డైరెక్టర్ తడబాటు స్ఫష్టంగా కనబడుతుంది. డైలాగ్స్ పెద్ద ఆకట్టుకునే విధంగా లేవు. పంచ్ డైలాగ్స్ ఇవ్వాలనే ఆసక్తితో డైలాగ్ రైటర్ మరుధూరి రాజా సీన్ కి సరిపడా డైలాగులు ఇవ్వకలేపోయారు. సెంథిల్ కుమార్, అరుణ్ కుమార్ ఇద్దరూ ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్స్ గా వర్క్ చేసారు. ఇద్దరూ చేసినప్పటికీ, కలర్ ఫుల్ గా సినిమా లేదు. సిజి వర్క్ ఈ సినిమాకి చాలా మైనస్. మణిశర్మ పాటలు పెద్ద ఆకట్టుకునే విధంగా లేవు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సైతం ఈ సినిమాకి హెల్ప్ అయ్యే విధంగా లేదు. సరైన మెటీరియల్ ఉంటే ఎడిటింగ్ పరంగా బెటర్ మెంట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ సరైన మెటీరియల్ లేదు కాబట్టి... ఎడిటర్ ని తప్పుపట్టడానికి లేదు. నిర్మాణపు విలువలు యావరేజ్ గా ఉన్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
ఆది, శ్రీహరి ఎత్తుకు పై ఎత్తులు వేసే సీన్స్ బాగున్నాయి. కేవలం సిక్స్ ప్యాక్, యాక్షన్ ఎపిసోడ్స్ ఉండటం వల్ల సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయిపోదు. ముఖ్యంగా ఈ అంశాలు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనుకుంటే పప్పులో కాలేసినట్టే. కమర్షియల్ సినిమాకి స్టోరీ లైన్ వీక్ గా ఉన్నా... స్ర్కీన్ ప్లే ఆసక్తిగా ఉండాలి. అప్పుడే యాక్షన్ ఎపిసోడ్స్, కమర్షియల్ ఎలిమెంట్స్ సినిమాకి ప్లస్ అవుతాయి. కానీ అసలు కంటెంటే లేకుండా, కమర్షియల్ అంశాలతోనే సినిమాని తెరకెక్కించడం వల్ల లాభం లేదు. ఫస్ట్ హాఫ్ కంటే సెకండాఫ్ బెటర్ గా లేకపోవడం కూడా నిరాశపరిచే విషయం. ఎమోషన్ సీన్ ని సరిగ్గా తెరకెక్కించలేకపోయాడు డైరెక్టర్. దాంతో సెంటిమెంట్ వర్కవుట్ అవ్వలేదు. ఆది సిక్స్ ప్యాక్, మాస్ లుక్, రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్, శ్రీహరి అఫియరెన్స్ లాంటి ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి ఉన్నప్పటికీ, నిరాశపరిచే కథ, కథనం, డైలాగ్స్ ఈ సినిమాకి మైనస్ పాయింట్స్.
రఫ్ గా చెప్పాలంటే.. బాక్సాఫీస్ వద్ద రఫ్పాడించే సత్తా ఈ సినిమాకి లేదు