చిత్రం - రౌడీ ఫెలో
బ్యానర్స్ - మూవీ మిల్స్, సినిమా 5
నటీనటులు - నారా రోహిత్, విశాఖసింగ్, అజయ్, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, సుప్రీత్, పోసాని కృష్ణమురళి, సత్య, గొల్లపూడి మారుతిరావు, తాళ్లూరి రామేశ్వరి, పరుచూరి వెంకటేశ్వరరావు, తదితరులు
సంగీతం - సన్నీ యం.ఆర్
ఎడిటింగ్ - కార్తీక్ శ్రీనివాస్
సినిమాటోగ్రఫీ - ఓం
నిర్మాత - ప్రకాష్ రెడ్డి
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం: కృష్ణచైతన్య
హీరో అంటే రాముడు మంచి బాలుడిలా ఉండాలనే రూల్ ఎప్పుడో పోయింది. ఇప్పుడు మన హీరోలు పోకిరీలు, రౌడీల్లా ఉంటేనే అసలు సిసలైన హీరో కింద లెక్క.. ఈ క్రమంలో వచ్చిన 'రౌడీ ఫెలో' నారా రోహిత్. ఇడియట్లు, పోకిరీలు ఎలా మంచి పనులు చేస్తారో ఈ రౌడీ కూడా మంచి పనులే చేస్తాడని ప్రేక్షకులు ఊహించేస్తారు. మరి.. ఈ రౌడీ ఫెలో ఏం మంచి పనులు చేశాడో చూడ్డానికి థియేటర్ కి వెళ్లాలి కదా. పైగా.. పాటల రచయితగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణ చైతన్య దర్శకునిగా మారి, చేసిన తొలి చిత్రం ఇది. ఏమో... మూస ఫార్మలాకి భిన్నంగా తీసి ఉంటాడేమో.. అనే క్యూరియాసిటీ థియేటర్ కి వెళ్లేలా చేస్తుంది కదా.. మరి.. కృష్ణచైతన్య దర్శకునిగా మంచి మార్కులు కొట్టేస్తాడా? ఈ చిత్రం నారా రోహిత్ కెరీర్ కి ప్లస్ అయ్యే విధంగా ఉందా.. ఈ ప్రశ్నలకు జవాబు ఈ సమీక్ష.
కథ
రానా ప్రతాప్ జయదేవ్ (నారా రోహిత్) ఇగోని ఎవరైనా హర్ట్ చేస్తే, వాళ్లని వెతుక్కుంటూ వెళ్లి కొట్టి తన ఇగోని శాటిస్ ఫై చేసుకునే మనస్తత్వం కలవాడు. అలాంటి రానా ఇగో యస్.పి ఆహుతి ప్రసాద్ వల్ల హర్ట్ అవుతుంది. దాంతో పోలీస్ డిపార్ట్ మెంట్ లో చేరడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని యస్.ఐగా పోస్టింగ్ తెచ్చుకుంటాడు రానా. ఆహుతి ప్రసాద్ యస్.పి గా ఉంటున్న కొల్లేరుకు యస్.ఐగా వస్తాడు రానా. అప్పట్నుంచి అడుగడుగునా ఆహుతి ప్రసాద్ మాటలను లెక్కచేయకుండా తన ఇగోని శాటిస్ ఫై చేసుకుంటుంటాడు. అదే సమయంలో యస్.పి కూతురు మేఘన (విశాఖసింగ్) ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు రానా.
కొల్లూరు ఎం.పి అసురగణ దుర్గాప్రసాద్ (రావు రమేష్) కోల్లేరు చెరువులను సొంతం చేసుకుని, ఆ ఊరి ప్రజలను భయపెడుతూ తనకు కావాల్సింది దౌర్జన్యం చేసి లాక్కుంటుంటాడు. ఎలాగైనా అధిష్టానాన్ని మెప్పించి మినిస్టర్ పదవి దక్కించుకోవడానికి ట్రై చేస్తుంటాడు. కానీ అదే ఊరికి చెందిన జర్నలిస్ట్... ఇతగాడు చేస్తున్న అవినీతిని పేపర్ కెక్కిస్తాడు. దాంతో ఆ జర్నలిస్ట్ ని పోలీసుల సహకారంతో లాకప్ డెత్ చేయిస్తాడు దుర్గాప్రసాద్. ఈ కేసుకు సంబంధించి ఓ కానిస్టేబుల్ సైతం ప్రాణాలు కోల్పోతాడు. ఆ విషయం బయటికి రానివ్వకుండా దుర్గాప్రసాద్, పోలీసులు కుమ్మక్కవుతారు.
తన ఇగోని శాటిస్ ఫై చేసుకోవడానికి యస్.ఐగా పోస్టింగ్ తీసుకుని కొల్లేరుకు వచ్చిన రానా , అక్కడి ప్రజల బ్రతుకులు, దుర్గాప్రసాద్ చేస్తున్న అరాచకాన్ని చూసి, తట్టుకోలేకపోతాడు. దాంతో ఇగో శాటిస్ ఫై చేసుకోవడానికి యస్. ఐగా వచ్చిన రానా తన డ్యూటీని సక్రమంగా నిర్వహించి, దుర్గాప్రసాద్ ని ఎలా అంతమొందించాడన్నది ఈ చిత్రకథ.
నటీనటుల పర్ఫార్మెన్స్
తన అహాన్ని దెబ్బతీసిన వ్యక్తికి బుద్ధి చెప్పాలనే ఇగోతో పోలీసాఫీసర్ అయ్యి, ఆ తర్వాత సమాజం గురించి ఆలోచించే రాణా ప్రతాప్ జయదేవ్ పాత్రలో నారా రోహిత్ ఫిజిక్ సరిగ్గా లేదు. అసలే కొంచెం బొద్దుగా ఉండే రోహిత్.. మరింత లావయ్యాడు. దాంతో పోలీసాఫీసర్ కి ఉండాల్సిన సహజమైన ఫిట్ నెస్ లేదు. అఫ్ కోర్స్ వృత్తిరీత్యా పోలీస్ కాదు.. అనుకోకుండా అయ్యాడు కాబట్టి, అలా ఉన్నా ఫర్వాలేదని సర్దిచెప్పుకోవచ్చు. కానీ, హీరో అన్నాక ఏ పాత్ర చేసినా ఫిజికల్ ఫిట్ నెస్ ఉండాలి. రోహిత్ ఆ విషయంలో నిర్లక్ష్యంగా ఉండటం మైనస్ అయ్యింది. విజృంభించి నటించే దమ్ము పాత్రలో లేదు. ఏదో పొడి పొడి డైలాగులతో, అక్కడక్కడా ఫైట్స్ తో సాగే పాత్ర కాబట్టి, నటించడానికి స్కోప్ లేదు. విశాఖా సింగ్ పాత్రకి ప్రాధాన్యం లేదు.. నటన ప్రదర్శించడానికి స్కోపూ లేదు. రావు రమేష్ ఇలాంటి పాత్రలు చాలానే చేశాడు కాబట్టి, నటన కూడా యాజిటీస్ గా అతని గత చిత్రాలను తలపించింది. సిల్క్ పాత్రలో పోసాని నవ్వించాడు. సినిమాలో పోసాని పాత్ర, ఆ తర్వాత సత్య చేసిన పాత్ర ఓ రిలీఫ్. గొల్లపూడి మారుతీరావు, పరుచూరి వెంకటేశ్వరరావులవి బరువైన పాత్రలు. బాగానే మోశారు. ఇక.. ఇతర పాత్రధారులు ఉన్నంతలో బాగానే చేశారు.
సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి ఉన్న ప్లస్ పాయింట్ ఓమ్ కెమెరా పనితనం. కొల్లేరు వాతావరణాన్ని బాగానే చూపించాడు. ఎం.ఆర్. సన్నీ ఇచ్చిన పాటలు సోసోగా ఉన్నాయి. రీ-రికార్డింగ్ అయితే.. కొన్ని సన్నివేశాల్లో పాత్రలు మాట్లాడుతున్ననప్పుడు అసలు ఇక్కడ సౌండ్ తో పనేంటి అనిపిస్తుంది. డైలాగ్స్ కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. కొన్ని చోట్ల అసందర్భంగా కూడా అనిపిస్తాయి. కార్తీక్ శ్రీనివాస్ మొహమాటపడకుండా తన కత్తెరకు పని పెట్టి, ఎడిటింగ్ చేసి ఉంటే బాగుండేదేమో.
ఫిల్మీబజ్ విశ్లేషణ
'ఇగో' అనే అంశాన్ని ప్రధానాంశంగా చేసుకుని అల్లిన కథ ఇది. ఇగో లేకపోతే మహాభారతం, రామాయణం ఉండేవి కాదు కదా.. అని హీరో చెప్పే పాయింట్ లాజికల్ గా ఉంది. క్లయిమాక్స్ లో వచ్చే ఈ ఎపిసోడ్ మాత్రమే హైలెట్. కానీ, పది, ఇరవై నిమిషాల క్లయిమాక్స్ బాగుంటే సరిపోతుందా? అంతకు ముందు గంటన్నర, రెండు గంటల సినిమా సోసోగా అయినా ఉండాలి కదా. అలా లేదు. పైగా.. సినిమా ఆరంభం నుంచి చివరి వరకు నత్త నడకన సాగుతుంది. కనీసం ఈ ఎపిసోడ్ నుంచైనా ఊపందుకుంటుందేమో అని ఆశించే ప్రేక్షకుడికి ఆశాభంగమే. సినిమా చాలా సా...గిం....ది. దానికి కారణం కథ చాలా చిన్నది కావడం. ఆ చిన్న కథను చూపించడానికి ఏవేవో అల్లికలు, కుట్లు... మొత్తం అతుకుల బొంతలా తయారైంది. ఓ పద్ధతి ప్రకారం తీసినట్లుగా కాకుండా ఎలా అనిపిస్తే అలా.. ఏది అనిపిస్తే.. అలా తీసినట్లుగా ఉంటుంది.
ఫైనల్ గా చెప్పాలంటే... ఈ సినిమాకి మంచి మార్కులు ఇవ్వాలా? అని ప్రేక్షకులు ఇగో ఫీలైతే తప్పుపట్టాల్సిన అవసరం లేదు.