చిత్రం - రోమియో
బ్యానర్ - టచ్ స్టోన్ ఫిల్మ్ ప్రొడక్షన్స్
నటీనటులు - సాయిరామ్ శంకర్, అడొనిక, రవితేజ (ప్రత్యేక పాత్రలో), నాగబాబు, అలీ, సుబ్బరాజు, జయసుధ, ప్రగతి తదితరులు
స్టోరీ, డైలాగ్స్ - పూరి జగన్నాధ్
మ్యూజిక్ డైరెక్టర్ - సునిల్ కశ్యప్
సినిమాటోగ్రఫీ - పి.జి.విందా
ఎడిటర్ - నవీన్ మాలి
స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - గోపి గణేష్
సమర్పణ - మధుర శ్రీధర్ రెడ్డి
ప్రొడ్యూసర్ - టచ్ స్టోన్ దొరైస్వామి
విడుదల తేదీ - 10.10.2014
'పూరి రాసిన ప్రేమకథ'.. ఈ ట్యాగ్ లైన్ మాత్రం చాలు.. ప్రేక్షకుల్లో ఆ సినిమాపై ఆసక్తి పెరగడానికి. కేవలం ట్యాగ్ లైన్ మాత్రమే కాదు.. ఏకంగా ఏదైనా సినిమాకి పూరి కథ రాసిస్తే.. ఇక అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి. 'రోమియో'పై కూడా అలాంటి అంచనాలే ఏర్పడ్డాయి. సాయిరామ్ శంకర్ కెరీర్ ఆశించిన విధంగా లేదు. అన్న రాసిచ్చిన ఈ కథతో తమ్ముడి ఫేట్ మారుతుందా? రోమియో-జూలియట్ పుట్టిన 'వెరోనా'లో ఓసారి షూటింగ్ చేస్తున్న సమయంలో అక్కడి జూలియట్ విగ్రహం చూసినప్పుడు పూరీకి ఈ చిత్రకథ తట్టింది. మరి.. ఈ ప్రేమకథలో ఉన్న గొప్పదనం ఏంటి? సాయిరామ్ శంకర్ కి ఉపయోగపడే చిత్రం అవుతుందా?.. ఆ విషయాల్లోకే వెళదాం.
కథ
వైజాగ్ కి చెందిన కిట్టు (సాయిరామ్ శంకర్) యూరోప్ లో ఉంటాడు. సమంత (అడోనిక) కుటుంబం న్యూయార్క్ లో ఉంటుంది. సమంతకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. పైగా ఒంటరి ప్రయాణాలను ఇష్టపడుతుంది. ఈ నేపధ్యంలో యూరోప్ కి వెళ్లిన సమంత ఓ హోటల్ లో బస చేస్తుంది. యూరోప్ అందాలను చుట్టివస్తున్న కిట్టు కంట్లో పడుతుంది. అప్పట్నుంచి ఆమెను వెంటాడతాడు. పాస్ పోర్ట్ దొంగిలించేస్తాడు. నా ప్రేయసి పద్దు (అడోనిక) లా ఉన్నావ్. నన్నుపెళ్లి చేసుకో అంటాడు. కానీ, అప్పటికే ఓ వ్యక్తి (సుబ్బరాజు)ని ప్రేమిస్తుంది సమంత. అసలు తన ప్రేయసిలా ఉన్నావంటూ సమంత వెనకాల కిట్టు పడటానికి కారణం ఏంటి? బాయ్ ఫ్రెండ్ ని కాదని మనసు మార్చుకుని కిట్టుని సమంత పెళ్లి చేసుకుంటుందా? అనేది సినిమాలో చూడాల్సిందే.
నటీనటుల పర్ఫార్మెన్స్
సాయిరామ్ శంకర్ చేసిన పాత్ర లోనటనకు పెద్దగా స్కోప్ లేదు. కాసేపు ఎమోషనల్ గా చాలాసేపు జోవియల్ గా ఉండే కారెక్టర్ ఇది. పాత్ర పరిధి మేరకు బాగానే చేశాడు. డాన్సులు, ఫైట్లు ఫర్వాలేదనిపించాడు. నటుడగా నిరూపించుకునే పాత్ర కాదు కాబట్టి, నటన గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఇక.. అడోనిక ఈజీ గోయింగ్ గాళ్ గా బాగానే చేసింది. తెరపై చాలా అందంగా కనిపిస్తుందని అనలేం కానీ.. ఫర్వాలేదనిపించుకుంది. విజృంభించి అంగాంగ ప్రదర్శన చేసే స్కోప్ కారెక్టర్ కి లేదు కాబట్టి, అవకాశం ఉన్నంతవరకు హాట్ గా కనిపించింది. ఇక.. అతిథి పాత్రలో రవితేజ సుపర్బ్. తనదైన శైలిలో డైలాగులు చెప్పి, నవ్వించాడు. అలీ. సుబ్బరాజు, జయసుధ, నాగబాబు, ప్రగతి పాత్రల పరిది మేరకు నటించారు.
సాంకేతిక వర్గం
పూరి రాసిన ఈ ప్రేమకథ అనే ఒక్క కారణంతో ఈ సినిమాకి వస్తారు. కానీ, ఈ ప్రేమకథ చాలా పేలవంగా ఉంది. ఒకవేళ పూరి రాసిన కథలో దర్శకుడు ఏమైనా మార్చాడా? లేక ఆ కథలోని గాఢతను సరిగ్గా ఆవిష్కరించలేకపోయాడా? అనే సందేహం కలగక మానదు. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఫొటోగ్రఫి. సినిమా మొత్తం ఓ అందమైన పెయింటింగ్ లా ఉంది. పాటలు ఓకే. మాటలు కూడా ఓకే.
ఫిల్మీబజ్ విశ్లేషణ
తన ప్రేయసి పద్దులా ఉందని సమంత వెనకాల పడతాడు కిట్టు. పద్దుతో అతని ప్రేమను ఒక్క పాటతో చూపించేశారు. దాంతో ఈ పద్దు అనే క్యారెక్టర్ మీద ప్రేక్షకులకు ఎలాంటి ప్రత్యేకమైన ప్రేమాభిమానాలు కలగవు. దాంతో హీరో ఆమె కోసం పడుతున్న ఆరాటం మనసు వరకు వెళ్లదు. అలాగని, సమంతతో ప్రేమ అంటూ కిట్టు వెనకాల పడటం కూడా ఆడియన్స్ హార్ట్ ని టచ్ చేయదు. ఏదో సరదాలా ఉంటుంది. కామెడీ జోనర్ అంటే చక్కగా నవ్వించాలి. లవ్ జోనర్ అంటే హార్ట్ టచ్ అయ్యే విధంగా ఉండాలి. ముఖ్యంగా యూత్ ని కట్టిపడేసే విధంగా ఉండాలి. హారర్ జోనర్స్ అయితే థ్రిల్ కి గురి చేయాలి. ఏ సినిమా అయినా ఏదో ఒక ఫీల్ కలిగించాలి. ఏ ఫీల్ కలిగించకపోతే సినిమా పేలవంగా ఉంటుంది. 'రోమియో' అలానే ఉంది. ఈ చిత్రం మాస్ ని ఎట్రాక్ట్ చేయకపోగా.. మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కూడా పూర్తిగా నచ్చే విధంగా లేదు. అయితే ఒక్క విషయం మాత్రం చెప్పొచ్చు. సినిమా ఎప్పుడు పూర్తయ్యిందో తెలియనంత వేగంగా సాగుతుంది. ఎలాంటి టెన్షన్, ఎమోషన్ కి గురి కాకుండా పాప్ కార్న్ తింటూ పక్కనవాళ్లతో జోకులేసుకుంటూ.. చూసీ చూడనట్లు సినిమాని చూస్తే ఎండింగ్ కార్డు పడగానే ఇంటిదారిన పట్టొచ్చు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. ఈ చిత్రంతో అయినా సాయిరామ్ శంకర్ కి ఓ హిట్టు దొరుకుతుందనే గ్యారంటీ లేదు.