చిత్రం - సికిందర్
నటీనటులు - సూర్య, సమంత, బ్రహ్మానందం, విద్యుత్ జమాల్, మనోజ్ బాజ్ పాయి తదితరులు
సంగీతం - యువన్ శంకర్ రాజా
కెమెరా - సంతోష్ శివన్
సమర్పణ - యుటీవీ మోషన్ పిక్చర్స్, తిరుపతి బ్రదర్స్
నిర్మాత - లగడపాటి శిరీషా శ్రీధర్,
కథ-స్ర్కీన్ ప్లే-దర్శకత్వం - లింగుస్వామి
విభిన్న తరహా చిత్రాలు చేసే కథానాయకునిగా సూర్యకి మంచి పేరుంది. మాతృభాష తమిళంతో పాటు తెలుగులోనూ మంచి స్థానం సంపాదించుకున్న సూర్య నటించిన భారీ చిత్రం 'సికిందర్'. భారీ మాస్ కమర్షియల్ చిత్రాలు అందించే లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లగడపాటి శిరీషా శ్రీధర్ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేశారు. మరి.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం ఆ అంచనాలను చేరుకునే విధంగా ఉందా?... సూర్య ఖాతాలో మరో హిట్ చేరుతుందా?... ఈ ప్రశ్నలకు సమాధానమే ఈ సమీక్ష.
కథ
అన్నయ్య రాజుభాయ్ (సూర్య)ని వెతుక్కుంటూ అతని తమ్ముడు కృష్ణ (సూర్య) వైజాగ్ నుంచి ముంబయ్ వస్తాడు. తన అన్నయ్య గురించి వాకబు చేస్తుంటాడు. ఆ క్రమంలో అన్నయ్య జీవితం గురించి తెలుస్తుంది. రాజుభాయ్ ముంబయ్ లో పెద్ద మాఫియా డాన్. తన స్నేహితుడు చందు (విద్యుత్ జమాల్) తో కలిసి మాఫియా సామ్రాజ్యాన్ని ఏలుతుంటాడు. మాఫియా సామ్రాజ్యంలోకి అడుగుపెట్టే చందు (మనోజ్ బాజ్ పాయి)కి ఈ స్నేహితులిద్దరి మీద దృష్టి పడుతుంది. ఈ ఇద్దర్నీ అంతం చేయాలని ప్లాన్ చేస్తాడు. మరి.. చందు తను అనుకున్నది సాధించగలిగాడా? రాజు భాయ్ ఆచూకీని కృష్ణ కనుక్కోగలుగుతాడా? తన అన్నని వెతకడానికి వచ్చిన ఇతనిపై చందు దృష్టి ఎందుకు పడింది? రాజు భాయ్ ప్రేయసి జీవా (సమంత) ఏమైంది? తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పెర్ ఫామెన్స్
శక్తిమంతమైన పాత్రలు చేయడంలో సూర్య ప్రతిభే వేరు. ఈ చిత్రంలో రెండు పాత్రలనూ అద్భుతంగా చేశాడు. చాలా స్టయిలిష్ గా కనిపించాడు. ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ లో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇక.. సమంత గురించి చెప్పాలంటే చాలా గ్లామరస్ గా కనిపించింది. బికినీలో కూడా మెరిసింది. సూర్యతో రొమాంటిక్ సన్నివేశాల్లో చక్కని హావభావాలు కనబర్చింది. మనోజ్ బాజ్ పాయి, విద్యుత్ జమాల్ తమ పాత్రల్లో పూర్తిగా ఒదిగిపోయారు.
సాంకేతి వర్గం
మంచి కమర్షియల్ దర్శకుడనిపించుకున్న లింగుస్వామి ఈ చిత్రంతో మాత్రం దర్శకుడిగా మైనస్ మార్కులే తెచ్చుకున్నాడు. ఫస్టాఫ్ బాగా తీసినా సెకండాఫ్ లో మాత్రం పట్టు తప్పాడు. యువన్ శంకర్ రాజా స్వరపరచిన పాటలు అంతంత మాత్రంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్ మాత్రం సన్నివేశాలను ఎలివేట్ చేసే విధంగా ఉంది. సంతోష్ శివన్ కెమెరా పనితనాన్ని వంకపెట్టడానికి లేదు. సంభాషలు యావరేజ్ గా ఉన్నాయి. నిర్మాణ విలవులు బ్రహ్మాండంగా ఉన్నాయి.
ఫిల్మీబజ్ విశ్లేషణ
స్టోరీ లైన్ సోసోగా ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫస్టాఫ్ ని ఆసక్తికరంగా మలిచినా సెకండాఫ్ ని సరిగ్గా తీయలేకపోవడం మైనస్ అయ్యింది. పైగా.. సన్నివేశాలన్నీ ముందే ఊహించే విధంగా ఉన్నాయి. ప్రధమార్ధం సాగినంత వేగంగా ద్వితీయార్థం లేదు. స్లోగా సాగే తీరు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. ప్రేక్షకులను నవ్వించాలనే తాపత్రయంతో బ్రహ్మానందంతో కామెడీ ట్రాక్ పెట్టారు. అది నవ్వించకపోగా విసుగు తెప్పిస్తుంది. మొత్తం మీద ఈ 'సికిందర్' ప్రేక్షకుల సహనానికి ఓ పరీక్ష.
ఫైనల్ గా చెప్పాలంటే... 'సికిందర్' ఫస్టాఫ్ లో సింప్లీ సూపర్బ్ గా అనిపిస్తాడు... సెకండాఫ్ లో సిల్లీగా అనిపిస్తాడు. బాక్సాఫీస్ ని ఎంత వరకు షేక్ చేస్తాడో చూడాలి.