చిత్రం - బీరువా
నటీనటులు - సందీప్ కిషన్, సురభి, నరేష్, ముఖేష్ రుషి, చలపతిరావు, అజయ్, సప్తగిరి, వేణు, షకలక శంకర్, గుండు సుదర్శన్, శివన్నారాయణ, అనితా చౌదరి, అనీషా సింగ్, సంధ్య తదితరులు
కొరియోగ్రఫీ - రాజు సుందరం, బాబా భాస్కర్, శేఖర్
ఫైట్స్ - వెంకట్
పాటలు - శ్రీమణి
మాటలు - వెలిగొండ శ్రీనివాస్
ఆర్ట్ - సాహి సురేష్
ఎడిటింగ్ - గౌతంరాజు
సంగీతం - ఎస్.ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ - ఛోటా కె.నాయుడు
లైన్ ప్రొడ్యూసర్ - సుబ్రత్ రాయ్
బ్యానర్స్ - ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్
నిర్మాత - రామోజీరావు
కథ,దర్శకత్వం - కణ్మణి
విడుదల తేదీ - 23.1.2015
'బీరువా' అని ఓ టైటిల్ పెట్టి, సినిమా తీస్తే.. ఈ బీరువాలో ఏదో ఉంటుంది అని ఎవరైనా అంచనా వేయడం సహజం. సందీప్ కిషన్, సురభి జంటగా 'బీరువా' చిత్రాన్ని ఎనౌన్స్ చేసినప్పుడు అలాంటి అంచనాలు ఏర్పడ్డాయి. పైగా, 'నా ఊపిరి' వంటి ఎమోషనల్ సబ్జెక్ట్ ని అద్భుతంగా డీల్ చేసిన కణ్మణి దర్శకుడంటే ఈ బీరువా డిఫరెంట్ గా ఉంటుందనుకుంటారు. మరి... నిజంగా ఈ చిత్రం వినూత్నంగా ఉందా? ఈ బీరువా అందర్నీ అలరిస్తుందా... ఆ విషయంలోకే వద్దాం.
కథ
లక్ష్మీ ఇండ్రస్టీస్ ఓనర్ సూర్యనారాయణ (నరేష్). కోట్ల రూపాయల్లో బిజినెస్ చేస్తున్న సూర్యనారాయణకి ఓ కొడుకు సంజు (సందీప్ కిషన్). కొడుకు తనకు ఎప్పుడూ తలనొప్పులు తెచ్చి పెడతాడనే ఫీలింగ్ తో ఉంటాడు సూర్యనారాయణ. సంజు తల్లి (అనితా చౌదరి)కి కొడుకు అంటే ప్రాణం. సంజూకి చిన్నప్పట్నుంచి తండ్రి తిడితే బీరువాలో దాక్కునే అలవాటు ఉంటుంది. దాంతో బీరువా మీద తెలియని ప్రేమ ఏర్పడుతుంది, పెద్దయ్యే కొద్దీ ఆ ప్రేమ ఇంకా పెరుగుతుంది. తల్లిదండ్రుల ప్రేమతో ఎలాంటి చీకూచింతా లేకుండా సరదాగా లైఫ్ లీడ్ చేస్తున్నసంజూకి స్వాతి (సురభి) తొలి చూపులోనే నచ్చుతుంది. ఆమెతో ప్రేమలో పడిపోతాడు. స్వాతి కూడా సంజూని ప్రేమిస్తుంది. కానీ తన తండ్రి ఆదికేశవులు నాయుడు (ముఖేష్ రుషి) మీద ఉన్న భయంతో సంజూని ప్రేమించడానికి నిరాకరిస్తుంది.
విజయవాడలో ఉండే ఆదికేశవులు తన కంటిచూపుతో రాష్ర్ట రాజకీయాలను శాసిస్తుంటాడు. తన మాటకు ఎదురు చెప్పేవాడిని చంపడానికి కూడా వెనుకాడడు. స్టేట్ లో ఏం జరిగినా సెటిల్ చేయగల కెపాసిటీ ఆదికేశవులుకి ఉంటుంది.
సూర్యనారాయణని ఓ వ్యక్తి బిజినెస్ పరంగా మోసం చేస్తాడు. 40కోట్లకు ఈ మోసం జరుగుతుంది. దాంతో సూర్యనారాయణ చాలా ప్రాబ్లమ్ లో ఇరుక్కుంటాడు. ఈ ప్రాబ్లమ్ ని ఆదికేశవులు క్లియర్ చేయగలడని సూర్యనారాయణకు సంజూ చెబుతాడు. దాంతో సంజూని తీసుకుని ఆదికేశవులుని కలవడానికి విజయవాడ వెళతాడు సూర్యనారాయణ. అక్కడ ఆదికేశవులు నాయుడు కూతురిని కలుసుకుని ధైర్యంగా తనతో ఆ ఇంటి నుంచి బయటికి వచ్చేలా చేస్తాడు సంజూ. తన కొడుకు సంజూ ప్రేమ గురించి తెలుసుకుని టెన్షన్ పడతాడు. మరి ఆదికేశవులు నాయుడు తన కూతురిని ఇంటి నుంచి బయటికి తీసుకెళ్లిన సంజూని ఏం చేస్తాడు. ఆదికేశవులు తన ప్రేమను అంగీకరించేలా సంజూ చేస్తాడా? లేదా అనేదే క్లయిమ్యాక్స్.
నటీనటుల పర్ఫార్మెన్స్
సంజు పాత్రను సందీప్ కిషన్ చాలా ఈజ్ గా చేశాడు. హ్యాండ్ సమ్ గా కూడా ఉన్నాడు. ప్రస్థానం, గుండెల్లో గోదారి, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ తదితర చిత్రాల ద్వారా తనలో మంచి నటుడు ఉన్నాడని నిరూపించుకున్నాడు. అయితే, గత చిత్రాలకూ, తాజా చిత్రానికీ నటనలో వ్యత్యాసం లేదు. సేమ్ బాడీ లాంగ్వేజ్, సేమ్ ఎక్స్ ప్రెషన్స్... అంతా సేమ్ టు సేమ్. ఆల్రెడీ సందీప్ ని ఇలానే చూశాం కదా అనే ఓ రొటీన్ ఫీలింగ్ ప్రేక్షకులకు కలగక మానదు. కథానాయిక సురభి ఉన్నంతలో బాగా చేసింది. అందానికి కూడా యావరేజ్ మార్కులు వేయొచ్చు. మిడిల్ క్లాస్, హై క్లాస్.. ఏ క్లాస్ కైనా తండ్రి పాత్రకు నప్పుతారు సీనియర్ నరేశ్. ఈ చిత్రంలో కూడా తండ్రి పాత్రను తనదైన శైలిలో బాగా చేశారు. తల్లి పాత్రలో అనితా చౌదరి అక్కలా ఉంది. నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర ఇది. ఇంకా ముఖేష్ రుషి, అజయ్, చలపతిరావు.. తదితరులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు,
సాంకేతిక వర్గం
ఈ చిత్రానికి సంబంధించిన అసలు తప్పు కథ నుంచే మొదలైంది. చిన్న కథకు సన్నివేశాలు అల్లుకుని తెరకెక్కించారు. ఆ సన్నివేశాలు ఏదో సినిమాలో చూసినట్లుగానే అనిపిస్తాయి. దర్శకుడిగా కణ్మణికి ప్లస్ అయ్యే చిత్రం కాదు. వెలిగొండ శ్రీనివాస్ రాసిన సంభాషణలు బాగున్నాయి. చిన్న చిన్న డైలాగ్స్ తో నవ్వించారు. తమన్ పాటలు యథాతథం. థియేటర్లో ఉన్నప్పుడే మర్చిపోతాం. ఇక.. బయటికొచ్చాక ఏం చెబుతాం. ఛోటా కె. నాయుడు కెమెరా పనితనం సుపర్బ్. సినిమా మొత్తం కనువిందుగా ఉంది. ఇతర శాఖలు తమ పరిధి మేరకు బాగానే చేశారు. ఉషాకిరణ్ మూవీస్, ఆనంది ఆర్ట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి..
ఫిల్మీబజ్ విశ్లేషణ
హీరోకి చిన్నప్పట్నుంచీ బీరువా అంటే ఇష్టం కాబట్టి, దాన్నే టైటిల్ గా పెట్టారు. ఒకవేళ బీరువా అని కాకుండా సంజుగాడి ప్రేమకథ అని పెట్టినా ఓకే. బహుశా క్రేజ్ కోసం ఈ టైటిల్ పెట్టి ఉంటారు. చిన్నప్పుడు అమ్మానాన్నలను ఆటపట్టించడానికి బీరువాలో దాక్కుంటాడు హీరో. దాంతో దాని మీద ప్రేమ ఏర్పడుతుంది. పెద్దయిన తర్వాత బీరువాని ఓ రెండు, మూడు సార్లు తన లవ్ స్టోరీకి పావుగా వాడుకుంటాడు. అంతే తప్ప బీరువాలో ఏదో ఉందనీ, బీరువా చుట్టూ ఏదో సస్పెన్స్ ఉందని ఎదురు చూసి, థియేటర్ కి వెళితే ఓస్ ఇంతేనా.. అనుకోవాల్సి వస్తుంది. లైటర్ మూవీ తీయాలన్నది దర్శకుడి కాన్సెప్ట్. అందుకే, ఆద్యంతం వినోదాత్మకంగా తెరకెక్కించారు. కాన్సెఫ్ట్ కి తగ్గట్టు టైటిల్ అయితే పెద్ద ఎక్స్ ఫెక్టేషన్స్ ఉండవు. కానీ 'బీరువా' టైటిల్ అనేటప్పటికీ కాన్సెఫ్ట్ డిఫరెంట్ గా ఉంటుందనే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టు సినిమా లేకపోవడం నిరాశ పరుస్తుంది. ఫస్టాఫ్ బాగుంది. సెకండాఫ్ సోసోగా సాగుతూ... సహనానికి పరీక్ష అన్నట్లుగా ఉంది. సినిమా మొత్తం కామెడీతో, చివర్లో చిన్నపాటి సెంటిమెంట్ సీన్ తో ముగుస్తుంది. సో.. ప్రేక్షకులు కూడా ఈ సినిమాని తేలికగా తీసుకునే అవకాశం ఉంది. ఈ బీరువా కాసులతో నిండటం కష్టమే.