చిత్రం - ఉందిలే మంచికాలం ముందు ముందునా
నటీనటులు - సుధాకర్ కోమాకుల, కార్తీక్, సీనియర్ నరేశ్, రాధిక, షకలక శంకర్, దయానంద్, పూర్ణిమ, మాధవి, మధు, సంతోష్ తదితరులు
సంగీతం - రామ్ నారాయణ్
కెమెరా - ఈశ్వర్ కిరణ్
ఎడిటింగ్ - ప్రవీణ్ పూడి
మాటలు - రవి మల్లు
నిర్మాత - రవిరాష్ దాస్యం
కథ, స్ర్కీన్ ప్లే, దర్శకత్వం - అరుణ్ దాస్యం
సినిమా మీద మమకారంతో నేడు చాలామంది దర్శక, నిర్మాతలు రంగప్రవేశం చేస్తున్నారు. నిర్మాత రవిరాష్, దర్శకుడు అరుణ్ సినిమా మీద మమకారంతోనే 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా' అనే పాజిటివ్ టైటిల్ తో సినిమా మొదలుపెట్టారు. 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం సుధాకర్ ఓ హీరోగా, మరో హీరోగా నూతన నటుడు కార్తీక్ నటించిన ఈ చిత్రంపై ప్రారంభం నుంచే అంచనాలు నెలకొన్నాయి. దానికో కారణం టైటిల్.. ఆ తర్వాత ప్రచార చిత్రాలు, పాటలు.. మరి.. ఈ చిత్రం ఏ విధంగా ఉందో చూద్దాం.
కథ
రాక్ స్టార్ కావాలనే ఆశయం ఓ కుర్రాడిది (సుధాకర్). హాకీ ప్లేయర్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలన్న ఆశయం మరో కుర్రాడిది (కార్తీక్). తమ ఆశయం నెరవేర్చుకోవడానికి ఈ స్నేహితులిద్దరూ ఎలాంటి కృషి చేశారు? ఈ నేపథ్యంలో వాళ్లు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? అనే కథతో ఈ చిత్రం సాగుతుంది.
నటీనటుల పర్ఫార్మెన్స్
సుధాకర్, కార్తీక్ తమ పాత్రల్లో అద్భుతంగా ఒదిగిపోయారు. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’లో నాగరాజు పాత్రను చక్కగా చేసి, మెప్పించిన సుధాకర్ ఈ చిత్రంతో మరింతగా ప్రేక్షకులకు దగ్గర కావడం ఖాయం. అంత బాగా చేశాడు. ఇక... కార్తీక్ కి ఇది తొలి చిత్రం. అయినా బాగా చేశాడు. సీనియర్ తారలు నరేశ్, రాధికాల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాగా యాక్ట్ చేశారు. ఇతర నటీనటులు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం
దర్శకుడు అరుణ్ దాస్యంని అభినందించాల్సిందే. కథ, కథనాల గురించి చెప్పుకునే ముందు అతని టేకింగ్ గురించి చెప్పాలి. చాలా బాగుంది. అరుణ్ లో మంచి టెక్నీషియన్ ఉన్నాడని చెప్పొచ్చు. రామ్ నారాయణ్ అందించిన పాటలు కథానుసారం సాగాయి. రవి మల్లు అందించిన సంభాషణలు మెచ్చుకోదగ్గ విధంగా సాగాయి. నిర్మాణ విలవులు సూపర్ అనే చెప్పాలి. రవిరాష్ పేషన్ ఉన్న నిర్మాత అని చెప్పొచ్చు. కథకు అవసరమైన బడ్జెట్ సమకూర్చారు.
ఫిల్మీబజ్ విశ్లేషణ
కుటుంబ సమేతంగా చూడదగ్గ యూత్ ఫుల్ మూవీ ఇది. ఫ్యామిలీస్ ఆడియన్స్ ఎక్కడా ఇబ్బంది పడరు. అందుకు అభిందించాల్సిందే. మామూలుగా ద్వందార్థ సంభాషణలు, మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉంటే వసూళ్లు రాబట్టుకోవచ్చు. కానీ, రవిరాష్, అరుణ్ దాస్యం ఆ విధంగా క్యాష్ చేసుకోదల్చుకోలేదనే విషయం సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. ఓవరాల్ గా సినిమా బాగుంది. అయితే కథను నడిపిన తీరు ఇంకొంచెం వేగంగా ఉండి ఉంటే బాగుండేది. కథ మీద ఇంకాస్త దృష్టి పెట్టి ఉండాల్సింది. కథానాయికలు అవంతిక, నీతూ చౌదరి మైనస్ అనే చెప్పాలి.
ఫైనల్ గా చెప్పాలంటే... యూత్, ఫ్యామిలీస్ కలిసి చూసే నీట్ ఎంటర్ టైనర్స్ అరుదైన నేపథ్యంలో ఆ కోవలో ఉన్న ఈ 'ఉందిలే మంచి కాలం ముందు ముందునా'ని నిరభ్యంతరంగా కుటుంబ సభ్యులతో కలిసి చూడొచ్చు.