రిపబ్లిక్ డే (జనవరి 26) ను పురస్కరించుకుని పవర్ స్టార్ వవన్ కళ్యాణ్ 'కాటమరాయుడు' చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు ఈ చిత్రం టీమ్ అధికారికంగా ప్రకటించారు. అయితే తాజాగా ఈ టీజర్ రిలీజ్ ని వాయిదా వేసారు. ఈ 26న తమ అభిమాన హీరో నటిస్తున్న 'కాటమరాయుడు' టీజర్ ని చూడొచ్చని మెగాభిమానులు తెగ ఆనందపడిపోతున్నారు. ఇప్పుడు టీజర్ రిలీజ్ చేయడంలేదనే వార్త వారిని నిరాశపరుస్తోంది. కాకపోతే ఈ టీజర్ రిలీజ్ వాయిదా పడటానికి గల కారణం తెలుసుకుని మెగాభిమానులు పవన్ కళ్యాణ్ ని తెగ పొగిడేస్తున్నారు.
ఈ 26న ఆంధ్రరాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుతూ ఏ.పి యూత్ సైలెంట్ గా ప్రొటెస్ట్ చేయడానికి సమాయత్తమవుతోంది. ఈ ప్రోటెస్ట్ కి 'జనసేన' మద్ధతు ఉంటుందని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. కాబట్టి ఆ రోజు 'కాటమరాయుడు' టీజర్ ని విడుదల చేసి, అభిమానుల దృష్టి మరల్చడం కరెక్ట్ కాదని భావిస్తున్నారట. వారందరూ 'జనసేన' ప్రకటన మేరకు ప్రత్యేక హోదా కోరుతూ సైలెంట్ ప్రొటెస్ట్ లో పాల్గొనాలని పవన్ భావిస్తున్నారట. అందుకే టీజర్ విడుదలను వాయిదా వేసినట్టు సమాచారమ్. మరో రోజు టీజర్ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారట. సో... పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఈ 26న మెగాభిమానులందరూ వైజాగ్ ఆర్.కె.బీచ్ బాట పడతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.