అభిమాన హీరో కోసం ఏం చేయడానికైనా అభిమానులు వెనకాడరు. ఆ హీరో సినిమా విడుదలైనప్పుడు కటౌట్లు పెట్టడం, వాటికి పాలాభిషేకం చేయడం, మొదటి రోజు మొదటి షో చూసేయడం ద్వారా తమ అభిమానాన్ని చాటుకుంటారు అభిమానులు. ఇంతటితో అభిమానం ఆగితే ఫర్వాలేదు.. వేరే హీరో అభిమానులతో గొడవలు పడిపోతుంటారు. అలా పవన్ కల్యాణ్, ప్రభాస్ అభిమానలు గొడవపడ్డారు. మా హీరోయే గొప్ప అంటే మా హీరోయే గొప్ప అంటూ మాటల దాడి చేసుకున్నారు. ఫ్లెక్సీల విషయంలో మొదలైన ఈ గొడవ చివరకు రాళ్లు రువ్వుకునే వరకూ వచ్చింది. దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ స్పందించి - ''అభిమానులు గొడవపడటం తనను చాలా బాధపెట్టింది. ఇలాంటి గొడవలు భవిష్యత్తులో పునరావృత్తం కాకూడదు. భౌతిక దాడులు చేయడం తగదు. భీమవరంలోని అభిమాన సంఘాల నాయకులు ఇలాంటి గొడవలకు దూరంగా ఉండాలి'' అని చెప్పాడు. ఇదంతా జరిగి చాలా కాలమయ్యింది. అయినా సరే పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందట.
కాగా ఎల్లుండి 'బాహుబలి ది కంక్య్లూజన్' రిలీజ్ అవుతున్న సందర్భంగా పోలీసులు రంగంలోకి దిగారు. భీమవరంకి చెందిన పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమాన సంఘాల నాయకులను పిలిచి క్లాస్ పీకారట. సినిమా విడుదల సందర్భంగా గొడవలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారట. మరి పవన్ కళ్యాణ్, ప్రభాస్ అభిమానులు కామ్ గా ఉంటారా.. ఎలాంటి గొడవలు చేయవద్దని ఈ హీరోలు తమ అభిమానులకు పిలుపునిస్తారా... వేచి చూద్దాం.