మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' లో ఓ కీలక పాత్ర కోసం సునీల్ తీసుకున్నారని, డేట్స్ కుదరక ఈ సినిమాని సునీల్ వదులుకోవాల్సి వచ్చిందని వార్తలు వచ్చాయి. ఇందులో ఎంతవరకూ నిజముందో తెలీదుగానీ, వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్న సునీల్ కమెడీయన్ గా సినిమాలు చేయడంలేదు.
అయితే తాజా వార్తల ప్రకారం చిరు 151వ ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి చిత్రంలో సునీల్ ని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా సునీల్ చెప్పడంతో 'సైరా' లో సునీల్ కీలక పాత్రలో కనిపించడం ఖాయమని జనాలు ఫిక్స్ అవుతున్నారు.
సునీల్ చేయబోయే పాత్ర తీరుతెన్నులు ఎలా ఉంటుందో తెలియదుగానీ, గతంలో చిరు ఇంద్ర, ఠాగూర్ తదితర చిత్రాల్లో సునీల్ చేసిన పాత్రలు ప్రేక్షకులను విపరీతంగా అలరించాయి. దాంతో చిరు సినిమాలో సునీల్ నటిస్తున్నాడనగానే ఎలాంటి పాత్ర సునీల్ చేయబోతున్నాడా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. చాలా గ్యాప్ తర్వాత సునీల్ వేరే హీరో సినిమాలో కనిపించబోతున్నాడు కాబట్టి, ఖచ్చితంగా మంచి హైప్ క్రియేట్ అవుతుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిరంజీవి అంటే సునీల్ కి ప్రత్యేకమైన అభిమానం. అందుకే హీరోగా నటిస్తున్న సునీల్ 'సైరా' లో కీలక పాత్ర చేయడానికి అంగీకరించి ఉంటాడు. మరి ఈ సినిమాలోనే కాకుండా భవిష్యత్తులో ఇతర హీరో సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ వస్తే చేస్తాడేమో వేచి చూడాల్సిందే.