''నా అభిమాన డైరెక్టర్ కోసం ఈ స్పెషల్ అఫియరెన్స్ ఇస్తున్నాను'' అని చెప్పి మాస్ మహారాజా రవితేజ 'రాజా ది గ్రేట్' చిత్రంలోని సాంగ్ లో రాశిఖన్నా స్పెషల్ అఫియరెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. రవితేజ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'రాజా ది గ్రేట్'. ఈ సినిమాలో రవితేజ, హీరోయిన్ మెహ్రీన్ లపై చిత్రీకరించిన పాటలో రాశిఖన్నా స్పెషల్ అఫియరెన్స్ ఇచ్చింది. విశేషమేంటంటే... ఇదే పాటలో మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ కూడా స్పెషల్ అఫియరెన్స్ ఇచ్చినట్టు వార్తలు అందుతున్నాయి. ఈ సాంగ్ చిత్రీకరణ జరిగిన సమయంలో సాయిధరమ్ తేజ్ ఈ సెట్ లోనే ఉన్నాడు.
రవితేజ, మెహ్రీన్, రాశిఖన్నా, అనిల్ రావిపూడి లతో పాటు సాయిధరమ్ తేజ్ ఓ సెల్ఫీ కూడా దిగాడు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపధ్యంలో సాయిధరమ్ తేజ్ కూడా ఈ పాటలో స్పెషల్ అఫియరెన్స్ ఇచ్చి ఉంటాడని, అందుకే సాంగ్ జరుగుతున్నప్పుడు ఆ సెట్ లో ఉన్నాడని జనాలు చెప్పుకుంటున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన 'సుప్రీమ్' చిత్రంలో సాయిధరమ్ తేజ్, రాశిఖన్నా జంటగా నటించారు. అప్పట్నుంచే ఈ డైరెక్టర్ తో ఈ ఇద్దరికీ చక్కటి బాండింగ్ కుదిరింది. ఈ నేపధ్యంలోనే 'రాజా ది గ్రేట్' పాటలో స్పెషల్ అఫియరెన్స్ ఇవ్వమని ఈ ఇద్దరినీ డైరెక్టర్ అడిగితే, యస్ చెప్పేసి ఉంటారు. నిజంగానే ఈ ఇద్దరి స్పెషల్ అఫియరెన్స్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అవుతుందని చెప్పొచ్చు.