మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక చిత్రం 'సైరా' నరసింహారెడ్డి రెగ్యులర్ షూటింగ్ కోసం రంగం సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా ప్రముఖ కెమెరామ్యాన్ రవివర్మని తీసుకున్నారు. అయితే 'సైరా' షూటింగ్ షెడ్యూల్స్ లో జరిగిన మార్పుల వల్ల రవివర్మన్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడని వినికిడి. దాంతో అతని స్థానంలో కెమెరామ్యాన్ రత్నవేల్ ని ఫిక్స్ చేసినట్టు వార్తలు ఉన్నాయి. ఇదిలా ఉంటే...
ఈ ‘సైరా’ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాన్ని వదిలేసిన రవివర్మన్ టాలీవుడ్ లో రూపొందనున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ఎన్టీఆర్ బయోపిక్ కి సైన్ చేసినట్టు తెలుస్తోంది. తెలుగు జాతి గర్వించదగ్గ యుగపురుషుడు నందమూరి తారక రామారావుగారి జీవిత చరిత్రను తెరకెక్కించడానికి రంగం సిద్ధమవుతోంది. ఎన్టీఆర్ పాత్రలో నందమూరి నటసింహం బాలకృష్ణ అలరించబోతున్నారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని బాలయ్య తన సొంత బ్యానర్ లో నిర్మించనున్నారు. టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఈ చిత్రానికి పాటలందించబోతున్నారు. జనవరి 18న ఎన్టీఆర్ వర్ధంతి. ఆ రోజున ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం జరుపుకోనుందని తెలుస్తోంది. మే 28న ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.