యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ జాబితాలో 'టెంపర్' చిత్రానికి ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఎన్టీఆర్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం హిందీ రీమేక్ కన్ ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాని తమిళంలో రీమేక్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారని తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ హీరో శింబు 'టెంపర్' రీమేక్ లో నటించబోతున్నాడనే వార్తలు కొన్నాళ్ల క్రితం ప్రచారమయ్యాయి. కానీ ఈ సినిమాలో శింబు హీరోగా నటించడంలేదు. పందెంకోడి, పొగరు, భరణి, ఇంద్రుడు, పూజ, జయసూర్య వంటి కమర్షియల్ విజయాలతో మాస్ హీరో ఇమేజ్ తెచ్చుకున్న హీరో విశాల్ 'టెంపర్' రీమేక్ లో హీరోగా నటించనున్నాడని తెలుస్తోంది. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని, రాశిఖన్నా హీరోయిన్ గా నటించబోతోందని వార్తలు అందుతున్నాయి. అయితే ఈ రీమేక్ కి సంబంధించి విశాల్ గానీ, మురుగదాస్ గానీ నోరు విప్పడంలేదు. మరి నిజంగానే 'టెంపర్' తమిళ రీమేక్ కి రంగం సిద్ధమయ్యిందా తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.