'రంగస్థలం' చిత్రంలో రాంచరణ్ గెటప్ అందరినీ ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో గళ్ల లుంగీ, పెరిగిన గెడ్డంతో చరణ్ లుక్ చాలా మాస్ గా ఉంది. చరణ్ చేస్తున్న పాత్ర పేరు చిట్టిబాబు. ఇప్పటికే చిట్టిబాబు గెటప్ ని చాలా మంది ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ గెటప్ తో ఫోటోలు కూడా అప్ లోడ్ చేస్తున్నారు.
తాజాగా ఈ గెటప్ వేసుకుని రాంచరణ్ ని ఇమిటేట్ చేస్తున్న బుడ్డోడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున హల్ చల్ చేస్తోంది. ఈ బుడ్డోడు ఎవరనుకుంటున్నారు. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తనయుడు అల్లు అయాన్. సేమ్ టు సేమ్ చిట్టిబాబు లాంటి దుస్తులు వేసుకుని, అదే టైప్ లో ఫోజిచ్చి ఆకట్టుకుంటున్నాడు అల్లు అయాన్. మెగా హీరోలు పవన్ కళ్యాణ్, రాంచరణ్ లతో అల్లు అర్జున్ ఎడమొహం, పెడమొహంగా ఉంటున్నాడనే వార్తలు ప్రచారమయ్యాయి. కానీ అలాంటిదేంలేదని, మా కజిన్స్ అందరూ ఒకటేనని, మా మధ్య ఎలాంటి విభేదాలులేవని అల్లు అయాన్ ఫోటోని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేసి మరీ అల్లు అర్జున్ చెప్పినట్టు ఉంది. మార్చి 30న థియేటర్స్ కి వస్తున్న 'రంగస్థలం' చిత్రాన్ని మెగా, అల్లు కుటుంబసభ్యులు చూసి రాంచరణ్ ని, ఆ చిత్రం టీమ్ ని అభినందనలతో ముంచెత్తుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.