స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన 'భరత్ అనే నేను' చిత్రం సొసైటీకి చక్కటి మెసేజ్ ని ఇచ్చింది. చేసిన ప్రామిస్ ని మర్చిపోకూడదు. ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి అని చిన్నప్పుడు తన తల్లి చెప్పిన మాటలను గుర్తు పెట్టుకున్న ఓ కుర్రాడు, అనుకోని పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించి, చేసిన వాగ్ధానాలను నిలబెట్టుకుంటే రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉంటుంది... ఆ రాష్ట్ర ప్రజల జీవితాలు ఎలా మారిపోతాయని చాలా చక్కగా తెరపై చూపించారు కొరటాల శివ. ఇదే కాన్సెఫ్ట్ ని స్ఫూర్తిగా తీసుకుని ఇచ్చిన మాటలను నిలబెట్టుకోవడానికి ఎ.పి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఎం.పి గల్లా జయదేవ్ లోకసభ సాక్షిగా చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ కి జరిగిన అన్యాయాన్ని ఎండగడుతూ ఈ రోజు (20.7.2018) బిజెపి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశ పెట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోకసభలో ప్రవేశ పెట్టి తొలుత ప్రసంగించిన ఎం.పి గల్లా జయదేవ్ 'భరత్ అనే నేను' సినిమా స్టోరీ లైన్ ని చెప్పి, ఆ తర్వాత 5కోట్ల ఆంధ్ర ప్రజల ఆవేదనను తెలియజేసారు. ఆసక్తికరంగా, ఆలోచింపజేసే విధంగా, ఆంధ్ర ప్రజలకు కాంగ్రెస్, బిజెపి చేసిన నష్టాన్ని తెలియజెప్పే విధంగా సాగిన జయదేవ్ ప్రసంగానికి అందరూ జేజేలు కొడుతున్నారు. మరి బావమరిది మహేష్ బాబు... బావ జయదేవ్ ని ప్రశంసించకుండా ఉంటారా... మహేష్ రాజకీయాలకు దూరంగా ఉంటాడు కాబట్టి, పర్సనల్ గా తన బావను ప్రశంసిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.