మహానటుడు ఎన్టీఆర్ జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న 'ఎన్టీఆర్' చిత్రంలో ఎన్టీఆర్ పాత్రను నందమూరి నటసింహం బాలకృష్ణ పోషిస్తోంటే, ఏఏన్నార్ పాత్రను ఆయన మనవడు సుమంత్ చేస్తున్నాడు. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలయ్య ఎలా ఉంటారో చూసేసాం. కాషాయం దుస్తుల్లో మైక్ ముందు స్వీచ్ ఇస్తున్నట్లు ఉన్న బాలయ్య లుక్ అచ్చం ఎన్టీఆర్ ని తలపించింది. ఆ తర్వాత నారా చంద్రబాబునాయుడు పాత్ర చేస్తున్న రానా దగ్గుబాటి లుక్ ని విడుదల చేసారు. ఈ లుక్ కి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారు.
తాజాగా ఈ రోజు (20.9.2018) ఏఎన్నార్ జయంతిని పురస్కరించుకుని అక్కినేని నాగేశ్వరరావు లుక్ ని విడుదల చేసారు. తాతయ్య పాత్రలో సుమంత్ లుక్ అదిరిపోయింది. టీనేజ్ లో ఏఎన్నార్ ని చూస్తున్నట్టే ఉంది. ఈ లుక్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసింది. సుమంత్ లుక్ ఏఏన్నార్ ని తలపిస్తోంది. నటన కూడా తాతయ్యను తలపిస్తే, సమంత్ ని ప్రతి ఒక్కరూ అభినందిస్తారు.
ఇక ఈ లుక్స్ ని పర్ ఫెక్ట్ గా తీర్చిదిద్దుతున్న డైరెక్టర్ క్రిష్ ని నందమూరి అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అక్కినేని నాగేశ్వరరావు లుక్ పోస్టర్ ని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున షేర్ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. మొత్తం మీద రోజురోజుకి 'ఎన్టీఆర్' పై అంచనాలు పెరిగిపోతున్నాయి. వచ్చే యేడాది జనవరి 9న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.