'ఎన్టీఆర్' బయోపిక్ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో జరుగుతోంది. ఈ బయోపిక్ రెండు పార్ట్ లుగా తెరకు రాబోతున్న విషయం తెలిసిందే. 'ఎన్టీఆర్ - కథానాయకుడు' ఫస్ట్ పార్ట్ టైటిల్ అయితే, 'ఎన్టీఆర్ - మహానాయకుడు' రెండో పార్ట్ టైటిల్. కాగా ఈ చిత్రానికి సంబంధించిన కీలక ఎపిసోడ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ ఎపిసోడ్ 'ఎన్టీఆర్ - మహానాయకుడు' లో ఉంటుంది. ఈ కీలక ఎపిసోడ్ చిత్రీకరణలో బాబాయ్ బాలకృష్ణ, అబ్బాయ్ కళ్యాణ్ రామ్ పాల్గొంటున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...
ఎన్టీఆర్ రాజకీయజీవితంలో ఆయన చేసిన 'చైతన్య యాత్ర' కు ప్రత్యేకమైన స్థానం ఉంది. చైతన్యరథం తో శ్రీకాకుళం నుంచి గుంటూరు వరకూ ఎన్టీఆర్ చేసిన చైతన్య యాత్ర ఎన్టీఆర్ ని అధికారంలోకి తీసుకువచ్చింది. తనయుడు నందమూరి హరికృష్ణ చైతన్యరథసారధిగా వ్యవహరించగా ఎన్టీఆర్ చేసిన ఈ చైతన్యయాత్రను తెలుగు ప్రజలు మర్చిపోలేరు. ఇప్పుడీ చైతన్యయాత్రకు సంబంధించిన చిత్రకరణ జరుగుతోంది. హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న బాలయ్య, హరికృష్ణ పాత్ర చేస్తున్న కళ్యాణ్ రామ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఆ చిత్రీకరణకు సంబంధించిన స్టిల్ ఇది. బాబాయ్ బాలకృష్ణ వాళ్ల నాన్నగారు ఎన్టీఆర్ లా నటిస్తోంటే, అబ్బాయ్ కళ్యాణ్ రామ్ వాళ్ల నాన్నగారు హరికృష్ణలా నటిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ గా బాలయ్య లుక్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. పైనున్న స్టిల్ లో కళ్యాణ్ రామ్ బ్యాక్ లో కనిపిస్తున్నాడు. త్వరలోనే కళ్యాణ్ రామ్ లుక్ ని విడుదల చేస్తారు. మరి హరికృష్ణ గా కళ్యాణ్ రామ్ ఏ మేరకు మెప్పిస్తాడో వేచి చూద్దాం.