#RRR మల్టీస్టారర్ లో ఎన్టీఆర్, రాంచరణ్ పాత్రలు ఏంటీ... ఈ సినిమాలో హీరోయిన్లు ఎవరు... ఈ సినిమా జానర్ ఏంటీ... ఈ సినిమాకి 'రామ రావణ రాజ్యం' టైటిల్ ని పెట్టాలనుకుంటున్నారా... రిలీజ్ ఎప్పుడు... ఈ భారీ బడ్జెట్ సినిమాలో కీలక పాత్రలు చేయబోయేది ఎవరు... రెగ్యులర్ షూటింగ్ ఎప్పటి నుంచి ఆరంభమవుతుంది... ఇలాంటి బోల్డన్ని ప్రశ్నలకు ఈ రోజు సమాధానాలు దొరుకుతాయని అందరూ భావించారు. కానీ దొరకలేదు. దాంతో తెలిసింది కొంచెం... తెలియాల్సింది చాలా... అని మళ్లీ ఎవరికి తోచినట్టు వారు #RRR మల్టీస్టారర్ గురించి మాట్లాడుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కనున్న మల్టీస్టారర్ #RRR ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ రోజు (11.11) 11 గంటలకు ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి ముహూర్తపు సన్నివేశానికి క్లాఫ్ ఇచ్చారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు చేతుల మీదుగా ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళి, నిర్మాత దానయ్య స్ర్కిఫ్ట్ ని అందుకున్నారు.
హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్పవానికి హీరోలు ప్రభాస్, రానా, డైరెక్టర్లు కొరటాల శివ, వి.వి.వినాయక్, నిర్మాతలు సురేష్ బాబు, అల్లు అరవింద్, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, జెమిని కిరణ్, కె.యల్.నారాయణ, కొర్రపాటి సాయి. బి.వి.యస్.యన్ ప్రసాద్, శోభు వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈగ, మగధీర, బాహుబలి చిత్రాలకు కెమెరామ్యాన్ గా వ్యవహరించిన సెంథిల్ కుమార్ ఈ మల్టీస్టారర్ కి కూడా కెమెరామ్యాన్ గా వ్యవహరించబోతున్నారు. యం.యం.కీరవాణి సంగీతం సమకూర్చబోతున్నారు. భారీ బడ్జెట్ తో డి.వి.వి.దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సో... ప్రస్తుతానికి తెలిసిన విషయాలు ఇవి. తెలియాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ఆసక్తికర విషయాల కోసం ఎదురుచూద్దాం.