మహానటుడు 'ఎన్టీఆర్ బయోపిక్' పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ బయోపిక్ లో ముందుగా థియేటర్స్ కి రాబోతున్నది 'ఎన్టీఆర్-కథానాయకుడు'. ఎన్టీఆర్ సినీ జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. నటుడిగా ఎన్టీఆర్ ఎదుగుతున్న సమయంలో ఎన్టీఆర్ పక్కనే ఉండి అన్ని తానై చూసుకున్న వ్యక్తి రుక్మనందరావు. ఇతను ఎవరో కాదు. ఎన్టీఆర్ సతీమణి బసవతారకం సోదరుడు. కాగా ఈ కీలక పాత్రలో నటించే అవకాశం నటుడు వెన్నెల కిషోర్ కి దక్కింది. త్వరలోనే వెన్నెలకిషోర్ ఈ చిత్రం షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాలను ఎన్టీఆర్ పాత్ర చేస్తున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, వెన్నెల కిషోర్ పాల్గొనగా చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారట డైరెక్టర్ క్రిష్. ఇదిలా ఉంటే...
ప్రస్తుతం షూటింగ్ తో పాటు ఈ సినిమాకి సంబంధించి నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జోరుగా జరుగుతున్నాయి. జనవరి 9న 'ఎన్టీఆర్-కథానాయకుడు' థియేటర్స్ కి రానుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రం బిజినెస్ ఫుల్ స్వింగ్ లో జరుగుతోందని సమాచారమ్. బాలయ్య స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు ఇందూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి యం.యం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 'ఎన్టీఆర్' లోని ఫస్ట్ సింగిల్ 'కథానాయక..' ని రేపు (2.12.2018) ఉదయం 7.42 కి విడుదల చేస్తున్నారు.